Ganta Srinivasa Rao: ఇద్దరు బలమైన నేతలు వద్దంటున్నా, గంటాను వైసీపీలోకి తెస్తుందెవరు?

తెలుగుదేశం పార్టీ నేత, విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరతారంటూ మరోసారి ప్రచారం మొదలైంది.

news18-telugu
Updated: September 30, 2020, 3:11 PM IST
Ganta Srinivasa Rao: ఇద్దరు బలమైన నేతలు వద్దంటున్నా, గంటాను వైసీపీలోకి తెస్తుందెవరు?
గంటా శ్రీనివాసరావు
  • Share this:
తెలుగుదేశం పార్టీ నేత, విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరతారంటూ మరోసారి ప్రచారం మొదలైంది. గతంలో కూడా గంటా వైసీపీలో చేరుతున్నట్టు ప్రచారం జరిగింది. ఎప్పుడైనా గంటా శ్రీనివాసరావు టీడీపీని వీడి వైసీపీలో చేరవచ్చనే ప్రచారం తెరపైకి వచ్చింది. అందుకు కారణాలు కూడా లేకపోలేదు. సెప్టెంబర్ 27న ఏపీలోని 25 పార్లమెంటరీ నియోజకవర్గాలకు అధ్యక్షులను నియమించింది టీడీపీ. అయితే, ఈ 25 లోక్‌సభ నియోజకవర్గాలకు సంబంధించి కాకపోయినా కనీసం విశాఖ, విజయనగరం, అనకాపల్లి లాంటి నియోజకవర్గాలకు అధ్యక్షులను ఎంపిక చేసేందుకు నిర్వహించిన సమావేశంలో గంటా శ్రీనివాసరావు లేరు. అలాగే, విశాఖ దక్షిణ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ ఇటీవల టీడీపీని వీడి వైసీపీలో చేరారు. ఆయన ప్రత్యక్షంగా పార్టీ కండువా కప్పుకోకపోయినా, గణేష్ కుమారులకు సీఎ వైఎస్ జగన్ వైసీపీ కండువాలను కప్పారు. దీనిపై చర్చించేందుకు నిర్వహించిన టీడీపీ సమావేశంలో కూడా గంటా శ్రీనివాసరావు కనిపించలేదు.

గంటా వైసీపీలో చేరుతున్నట్టు ఈ ఏడాది ఆరంభం నుంచి పలు డేట్లు తెరపైకి వచ్చాయి. ముఖ్యంగా వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత, ఉత్తరాంధ్ర ఇన్ చార్జి, రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డికి కరోనా వచ్చి హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో కూడా గంటా వైసీపీలో చేరుతున్నట్టు ప్రచారం జరిగింది. గంటా శ్రీనివాసరావు చేరికను విజయసాయిరెడ్డి బలంగా వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా గంటా శ్రీనివాసరావు మీద భూ ఆక్రమణల ఆరోపణలు ఉన్నాయి. 2019 ఎన్నికల సమయంలో అప్పటి అధికార టీడీపీ మీద వైసీపీ చేసిన విమర్శల్లో అది కూడా ఒకటి. టీడీపీ హయాంలోనే విశాఖలో భూముల ఆక్రమణల మీద సిట్ ఏర్పాటైంది. జగన్ ప్రభుత్వం వచ్చాక విశాఖలో భూ ఆక్రమణల మీద సిట్ కొనసాగుతుందని స్పష్టం చేసింది. భూ ఆక్రమణల మీద తీవ్ర ఆరోపణలు చేసిన తామే ఇప్పుడు అలాంటి నేతను వైసీపీలోకి చేర్చుకుంటే పార్టీ కేడర్‌కు తప్పుడు సంకేతాలు వెళ్తాయని విజయసాయిరెడ్డి వాదనగా ఉంది.

మరోవైపు గంటా శ్రీనివాసరావు వైసీపీలో చేరికను వ్యతిరేకిస్తున్న వారిలో మరో ముఖ్య నేత, ఏపీ టూరిజం శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్. వాస్తవానికి వ్యాపారవేత్తగా ఉన్న అవంతి శ్రీనివాసరావు గంటా శ్రీనివాసరావు ప్రోద్బలంతోనే ప్రజారాజ్యం పార్టీ సమయంలో రాజకీయాల్లోకి వచ్చారు. ఆ తర్వాత అవంతి టీడీపీలో ఎంపీగా గెలిచారు. కానీ, 2019 ఎన్నికలకు ముందు అవంతి టీడీపీని వీడి వైసీపీలో చేరారు. గంటాను చేర్చుకోబోమని స్పష్టంగా చెబితేనే తాను వైసీపీలో చేరతానని అవంతి జగన్ దగ్గర స్పష్టమైన హామీ తీసుకున్నారని ప్రచారం ఉంది. దానికి తగ్గట్టుగానే ఇటీవల గంటా వైసీపీలో చేరతారనే ప్రచారం జరిగినప్పుడు కూడా అవంతి శ్రీనివాస్ తీవ్రంగా మండిపడ్డారు. గంటా తన మీద ఉన్న కేసుల నుంచి తప్పించుకునేందుకే వైసీపీలో వస్తున్నారన్నట్టుగా మాట్లాడారు.

ఓ వైపు విజయసాయిరెడ్డి, మరోవైపు అవంతి శ్రీనివాస్ ఇద్దరూ గంటా చేరికను వ్యతిరేకిస్తున్నారు. అయినా సరే ఎప్పటికప్పుడు గంటా వైసీపీలో చేరతారంటూ ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు ఆ ప్రచారం చివరిదశకు చేరినట్టు తెలుస్తోంది. అయితే, అసలు ఇద్దరు బలమైన నేతలు వద్దంటున్నా కూడా గంటాను వైసీపీలోకి తీసుకొస్తోంది ఎవరనే చర్చ వైసీపీలో జరుగుతోంది. వారిద్దరినీ కాదని ఏకంగా జగన్ వద్దకు గంటాను తీసుకుని వెళ్లడానికి ప్రయత్నాలు చేస్తున్న నేత ఎవరనే చర్చ జరుగుతోంది.

విశాఖపట్నం త్వరలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కాబోతోంది. అలాంటి చోట ప్రతిపక్షానికి ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదనేది వైసీపీ వ్యూహంగా కనిపిస్తోంది. 2019 ఎన్నికల్లో విశాఖ నగరంలో టీడీపీ నాలుగు అసెంబ్లీ సీట్లు గెలిచింది. వారిలో ఒకరు వైసీపీలో చేరిపోయారు. ఇంకా మిగిలిన ముగ్గుర్ని కూడా వైసీపీలోకి తీసుకొస్తే టీడీపీ ఖాళీ అవుతుందని వైసీపీ భావన. అందుకే ఎవరు వ్యతిరేకించినా కూడా అవేవీ పట్టించుకోకుండా నేతల వలసలను జగన్ ప్రోత్సహిస్తున్నారనే వాదన కూడా ఉంది. టీడీపీని ఖాళీ చేస్తే వచ్చే గ్రేటర్ విశాఖ ఎన్నికల్లో జీవీఎంసీ మీద వైసీపీ జెండా ఎగరేయడం సులువు అవుతుందనే అభిప్రాయం వైసీపీ నేతల్లో ఉంది.
Published by: Ashok Kumar Bonepalli
First published: September 30, 2020, 3:11 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading