ఆర్మీ, నేవీకి రూ.4 కోట్లు... బినామీలకు రూ.50 లక్షలకేనా?... ఏపీ అసెంబ్లీలో దుమారం...

ఇన్ సైడర్ ట్రేడింగ్ పై నిజానిజాలు తెలిసేందుకు , నిజాలు నిగ్గుతేల్చేందుకు లోతుగా దర్యాప్తు జరిపించాలని స్పీకర్ తమ్మినేని సీతారామ్ సూచించారు.

news18-telugu
Updated: January 20, 2020, 4:29 PM IST
ఆర్మీ, నేవీకి రూ.4 కోట్లు... బినామీలకు రూ.50 లక్షలకేనా?... ఏపీ అసెంబ్లీలో దుమారం...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
అమరావతిలో రాజధాని భూముల ఇన్ సైడ్ ట్రేడింగ్ వ్యవహారం మరోసారి ఏపీ అసెంబ్లీని కుదిపేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్ధలకు అమరావతిలో ఎకరం భూమిని నాలుగు కోట్ల రూపాయల లీజుకు ఇచ్చిన టీడీపీ సర్కారు, ప్రైవేటు యూనివర్శిటీలకు మాత్రం ఎకరం రూ.50 లక్షలకు ఇవ్వడాన్ని ఆర్ధికమంత్రి బుగ్గన తీవ్రంగా ఆక్షేపించారు. అప్పటి చంద్రబాబు ప్రభుత్వం తన బినామీల కోసమే అమరావతి భూములను కారుచౌకగా తన అనుచరులకు, బినామీలకు కట్టబెట్టారని బుగ్గన ఆరోపించారు.

అమరావతిలో గత ప్రభుత్వం ఇన్ సైడర్ ట్రేడింగ్ పై ఆర్ధిక మంత్రి బుగ్గన అసెంబ్లీ వేదికగా మరోసారి వివరాలు బయటపెట్టారు. అమరావతిని రాజధానిగా ప్రకటించకముందే 2014 జూన్ 6 నుంచి డిసెంబర్ 31 వరకూ సాగిన భూముల కొనుగోళ్ల వ్యవహారాన్ని అసెంబ్లీలో సవివరంగా వెల్లడించారు. మాజీ సీఎం చంద్రబాబుతో మొదలుపెట్టి ఆయన కేబినెట్ లో మంత్రులు, అప్పటి ఎమ్మెల్యేలు అమరావతిలో రాజధాని ప్రకటనకు ముందు కొన్న భూములన్నీ ఇన్ సైడర్ ట్రేడింగ్ కిందకే వస్తాయన్నారు. అమరావతిలో జరిగింది రాజధాని అభివృద్ధా లేక రియల్ ఎస్టేట్ వ్యాపారమా అని ఆర్ధికమంత్రి బుగ్గన ప్రశ్నించారు.

ఈ సందర్భంగా శాసనసభా వ్యవహారాల మంత్రి బుగ్గన మాట్లాడుతూ రాజధానిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్ధలకు ఎకరం 2 నుంచి 4 కోట్ల రూపాయలకు 60 ఏళ్ల లీజు ప్రాతిపదికన ఇచ్చిన అప్పటి చంద్రబాబు సర్కారు... తన బినామీలు, అనుచరులకు మాత్రం నామమాత్రపు ధరకే భూములు కట్టబెట్టడాన్ని తప్పుబట్టారు. విడ్త్ ఏపీ సంస్ధకు 200 ఎకరాలు, ఎస్.ఆర్.ఎం యూనివర్శిటీకి 200 ఎకరాలు,, అమృతా యూనివర్శిటీకి 200 ఎకరాలు, ఇండో యూకే హెల్త్ ఇన్ స్టిట్యూట్ కు 150 ఎకరాలు, మెడిసిటీ హెల్త్ సంస్ధకు 100 ఎకరాలను ఎకరం 50 లక్షల చొప్పున ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. పీపీపీ పద్ధతిలో వరుణ్ హాస్పిటాలిటీ, మహాలక్ష్మి ఇన్ ఫ్రా వెంచర్స్, ఇంద్రోయీ హోటల్స్ కూడా తక్కువ ధరలకు భూములు కేటాయించారని బుగ్గన వెల్లడించారు. ఇదంతా రాజధాని ప్రకటనకు ముందే కావడంతో ఇక్కడ జరిగింది రియల్ ఎస్టేట్ వ్యాపారంగా కనిపిస్తోందన్నారు. ఉండవల్లిలోని చంద్రబాబు ఇంటి యజమాని లింగమనేని రమేష్ కు కూడా నామమాత్రపు ధరకు ప్రభుత్వం వందలాది ఎకరాలు కట్టబెట్టిందన్నారు.

ఇన్ సైడర్ ట్రేడింగ్ పై బుగ్గన ప్రసంగం తర్వాత స్పందించిన స్పీకర్ తమ్మినేని భూముల వ్యవహారంపై ప్రభుత్వం ప్రజలకు నిజానిజాలు తెలిసేందుకు , నిజాలు నిగ్గుతేల్చేందుకు లోతుగా దర్యాప్తు జరిపించాలని సూచించారు. దీనిపై మాట్లాడిన సీఎం జగన్. సభాపతి నుంచి వచ్చిన ఆదేశాలు కచ్చితంగా అమలు చేస్తామని సభకు హామీ ఇచ్చారు.

(సయ్యద్ అహ్మద్, అమరావతి కరస్పాండెంట్, న్యూస్18)
First published: January 20, 2020, 4:29 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading