ROJA COUNTERS LOKESH AND NARAYANA OVER HOUSE SITES ISSUE IN ANDHRA PRADESH PRN
AP Politics: ఇళ్ల స్థలాలపై నువ్వా-నేనా...! ఆ ఇద్దరిపై ఫైర్ బ్రాండ్ మాటల తూటాలు..!
సినిమా రంగంలో ఉన్నపుడే నటిగా రోజా చాలా బిజీ. పదేళ్ల గ్యాప్లోనే 100 సినిమాలకు పైగా నటించింది ఈమె. ఇక రాజకీయాల్లోకి అడుగు పెట్టిన తర్వాత కూడా ఈమె తనను తాను నిరూపించుకునే పనిలో పడింది. ఇప్పటికే రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన రోజా.. తన నియోజకవర్గ ప్రజల కోసం పాటు పడుతుంది.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ఇళ్లస్థలాల (house sites) పంపిణీపై రాజకీయ దుమారం రేగుతోంది. అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి తెరతీసింది.
ఆంధ్రప్రదేశ్ లో పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ అట్టహాసంగా సాగుతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్లపట్టాలు పంపిణీ చేస్తున్నారు. ఇదే సమయంలో ప్రభుత్వం ఇస్తున్న స్థలాలపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ఊరికి దూరంగా ఇచ్చారని కొందరు, శ్మశానాల్లో, చెరువుల్లో, కొండలపై ఇస్తున్నారని మరికొందరు ఆరోపిస్తున్నారు. స్థలాల విస్తీర్ణంపైనా మాటల తూటాలు పేలుతున్నాయి. తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్.. వైసీపీ ఇచ్చే ఇళ్లు బాత్ రూముల్లా ఉన్నాయని విమర్శిస్తే.. సీపీఐ నేత నారాయణ ఐతే ఆస్థలాలు కుక్కలకు కూడా సరిపోవని ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీంతో రాజకీయ దుమారం రేగింది. ఇక ప్రతిపక్షాల విమర్శలపై అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు నువ్వా-నేనా అనే స్థాయిలో కౌంటర్లు వేస్తున్నారు.
పేదలకు ప్రభుత్వం నిర్మిస్తున్న ఇళ్లపై మాజీ మంత్రి నారా లోకేష్ కౌంటర్లు వేశారు. ముఖ్యమంత్రి ఇస్తున్న ఇల్లు బాత్ రూముల్లా ఉన్నాయని ఎద్దేవా చేశారు. చంద్రబాబు అధునాతన సౌకర్యాలతో అపార్ట్ మెంట్లు కట్టిస్తే.. జగన్ మాత్రం అగ్గిపెట్టెల్లాంటి ఇళ్లు ఇస్తున్నారని మండిపడ్డారు. ఇక సీపీఐ నేత నారాయణ కూడా ఇళ్లస్థలాలపై మండిపడ్డారు. ప్రభుత్వం అట్టహాసంగా పంచుతున్న ఇళ్లు, స్థలాల్లో కుక్కలు కూడా ఉండవని ఘాటుగా వ్యాఖ్యానించారు. జగన్ ఇంట్లో కుక్కలకు ఇచ్చే స్థలాన్ని కూడా పేదలకు కేటాయించడం లేదని విమర్శించారు. కుక్కలంటే తనకు గౌరవముందని.. వాటికి విశ్వాసముంటుందని చుకలంటించారు. అలాగే కులం పేరుతో తనను దూషించడంపైనా నారాయణ మండిపడ్డారు. తనకు కులం అంటగడుతున్న మంత్రి పెద్దిరెడ్డి.. వైఎస్ కు సీపీఐ మద్దతిచ్చినప్పుడు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు.
లోకేష్, నారాయణ చేసిన విమర్శలకు వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా ఘాటుగా రిప్లై ఇచ్చారు. అధికారంలో ఉన్న సమయలో బాత్ రూముల పేరుతో దోచుకున్న లోకేష్ కు ఏది చూసినా అలాగే కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. ఐదేళ్లలో 25లక్షల ఇళ్లు కట్టిస్తామంటూ చంద్రబాబు ప్రజలను మోసం చేశారన్నారు. పేదలకు ఇళ్లివ్వడం చేతగాని వారు విమర్శలు చేయడం సరికాదన్నారు. సీపీఐ నారాయణ.. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా పరువు తీస్తున్నారని రోజా మండిపడ్డారు. నారాయణ.. సీపీఐని చంద్రబాబు పార్టీ ఆఫ్ ఇండియాగా మార్చారని తీవ్రంగా విమర్శించారు. కమ్యూనిస్టులు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో పేదలకు ఎక్కడైనా ఇళ్ల స్థలాలిచ్చారా? అని ప్రశ్నించారు. నారాయణ ఎర్రజెండా వదిలేసి.., చంద్రబాబు అజెండా ఎత్తుకున్నారని ఆరోపించారు.
మొత్తానికి ఇళ్లస్థలాల పంపిణీ వ్యవహారం రాష్ట్రంలో రాజకీయ దుమారానికి వేదికగా మారుతోంది. ఇప్పటికే కోర్టు కేసులతో తీవ్రవివాదాస్పదమైంది. కొన్నిచోట్ల పంపిణీకి కోర్టులు బ్రేకులు వేశాయి. సాక్షాత్తూ ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలోని స్థలాల పంపిణీపై కోర్టు స్టే ఇచ్చింది. టీడీపీ చేస్తున్న కుట్రతోనే స్థలాల పంపిణీ వాయిదా పడిందని ముఖ్యమంత్రే ఆరోపించారు. దీంతో ప్రభుత్వానికి కౌంటర్ వేసేందుకు స్థలాల విస్తీర్ణం, ఇళ్ల సైజులు, ఇళ్లు నిర్మిస్తున్న ప్రాంతాల్లోని లోపాలను బయటపెట్టేందుకు టీడీపీ యత్నిస్తోంది. ఈక్రమంలో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుతోంది.
Published by:Purna Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.