తన పొలిటికల్ ఎంట్రీపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా ఆదివారం ఫేస్బుక్ పోస్ట్ ద్వారా సంకేతాలివ్వడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉత్తర్రపదేశ్‌లోని మొరదాబాద్ పట్టణంలో భారీ సంఖ్యలో రాబర్ట్ వాద్రా పోస్టర్లు వెలిశాయి. ‘రాబర్ట్ వాద్రా జీ...మొరదాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం’ అంటూ మొరదాబాద్ యూత్ కాంగ్రెస్ పేరిట ఈ పోస్టర్లను ఏర్పాటు చేశారు. మొరదాబాద్ పట్టణం రాబర్ట్ వాద్రా కుంటుంబ స్వస్థలంకావడంతో...ఆయన అక్కడి నుంచి పోటీ చేయొచ్చన్న ఊహాగానాలు జోరందుకున్నాయి. ఇటీవల ప్రియాంక గాంధీ క్రియాశీల రాజకీయాల్లో అడుగుపెట్టడంతో ఇక రాబర్ట్ వాద్రా కూడా రాజకీయ అరంగేట్రం చేసి, వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో మొరదాబాద్ నుంచి పోటీ చేసే అవకాశముందన్న ప్రచారం జరుగుతోంది. దీంతో అక్కడి కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంటోంది.
Posters saying 'Robert Vadra ji you are welcome to contest elections from Moradabad Lok Sabha constituency' seen in Moradabad. pic.twitter.com/cK1feeRIfN
మొరదాబాద్ నియోజకవర్గం ప్రస్తుతం బీజేపీ చేతిలో ఉండగా...2009లో ఇక్కడి నుంచి కాంగ్రెస్ టిక్కెట్‌పై పోటీచేసిన గెలిచిన మాజీ క్రికెటర్ అజారుద్దీన్, వచ్చే ఎన్నికల్లో మళ్లీ ఇక్కడి నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. కాంగ్రెస్ టిక్కెట్‌పై రాబర్ట్ వాద్రా ఇక్కడి నుంచి బరిలో నిలిచేపక్షంలో అజారుద్దీన్ మరో నియోజకవర్గాన్ని వెతుక్కోవాల్సి ఉంటుంది.
దేశంలో అత్యధికంగా 80 లోక్‌సభ నియోజకవర్గాలు కలిగిన యూపీలో బీఎస్పీ-ఎస్పీ కూటమిలో తనకు చోటు దక్కకపోవడంతో అక్కడి నుంచి కాంగ్రెస్ ఒంటరిగా బరిలోకి నిలుస్తోంది. యూపీలో గట్టి పోటీ ఇవ్వాలని భావిస్తున్న కాంగ్రెస్...ప్రియాంక గాంధీకి తూర్పు యూపీ పార్టీ వ్యవహారాల బాధ్యతలను, పశ్చిమ యూపీ వ్యవహారాల బాధ్యతలను జ్యోతిరాధిత్య సింథియాకు అప్పగించింది. కేంద్రంలో అధికారంలోకి రావాలంటే యూపీలో అత్యధిక స్థానాల్లో గెలవాలని అన్ని పార్టీలు భావిస్తున్నాయి. బీజేపీ, బీఎస్పీ-ఎస్పీ, కాంగ్రెస్ పార్టీలు విడివిడిగా పోటీ చేస్తుండడంతో అక్కడ ముక్కోణ పోటీ నెలకొననుంది.
Published by:Janardhan V
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.