కారుకు రోడ్ రోలర్ భయం... టీఆర్ఎస్‌లో టెన్షన్

గత అసెంబ్లీ ఎన్నికల్లో హుజూర్ నగర్‌లో ట్రక్కు గుర్తు తమ కొంపముంచిందని టీఆర్ఎస్ భావించింది. ట్రక్కు గుర్తు కారణంగా పలు నియోజకవర్గాల్లో తాము ఓడిపోయామని ప్రకటించింది. ఆ జాబితాలోనే హుజూర్ నగర్ కూడా ఉందని టీఆర్ఎస్ నేతలు ఇప్పటికీ చెబుతున్నారు.

news18-telugu
Updated: October 7, 2019, 8:22 PM IST
కారుకు రోడ్ రోలర్ భయం... టీఆర్ఎస్‌లో టెన్షన్
టీఆర్ఎస్ ఎన్నికల గుర్తు
  • Share this:
తెలంగాణలో త్వరలోనే జరగబోయే హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో కచ్చితంగా గెలవాలని భావిస్తోంది టీఆర్ఎస్. ఇందుకోసం ఇప్పటికే తన వ్యూహాలను సిద్ధం చేసింది. స్వయంగా ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్... హుజూర్ నగర్‌లో పార్టీ గెలుపు బాధ్యతను భుజాన వేసుకున్నారు. ఎప్పటికప్పుడు అక్కడి పార్టీ ఇన్‌ఛార్జ్‌లతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. నామినేషన్ల ప్రక్రియ పూర్తి కావడంతో... ఇక ప్రచారంపైనే పూర్తి స్థాయిలో ఫోకస్ చేసిన టీఆర్ఎస్‌కు ఇప్పుడు కొత్త టెన్షన్ పట్టుకుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో హుజూర్ నగర్‌లో ట్రక్కు గుర్తు తమ కొంపముంచిందని టీఆర్ఎస్ భావించింది. ట్రక్కు గుర్తు కారణంగా పలు నియోజకవర్గాల్లో తాము ఓడిపోయామని ప్రకటించింది. ఆ జాబితాలోనే హుజూర్ నగర్ కూడా ఉందని టీఆర్ఎస్ నేతలు ఇప్పటికీ చెబుతున్నారు.

ఈ ట్రక్కు గుర్తు ఎఫెక్ట్‌తో ముందుగా జాగ్రత్త పడ్డ టీఆర్ఎస్ బాస్ కేసీఆర్... ఆ తరువాత జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఈవీఎంలలో ట్రక్కు గుర్తు కేటాయించొద్దని ఢిల్లీకి వెళ్లి ఈసీకి ఫిర్యాదు చేశారు. అలా ట్రక్కు నుంచి తప్పించుకున్న టీఆర్ఎస్‌ను లోక్ సభ ఎన్నికల్లో రోడ్ రోలర్ గుర్తు మరోసారి దెబ్బ తీసింది. ఈ ఎన్నికల్లో రోడ్ రోలర్ గుర్తు కారణంగా భువనగిరి నియోజకవర్గంలో టీఆర్ఎస్ ఓటమి చవిచూసిందనే భావన ఆ పార్టీ నేతల్లో ఉంది. తాజాగా ఇదే రోడ్ రోలర్ గుర్తు హుజూర్ నగర్ ఉప ఎన్నిక సందర్భంగా ఈవీఎంపై కనిపించనుండటం టీఆర్ఎస్‌ను కలవరపెడుతోంది.

ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగిన ఓ అభ్యర్థికి రోడ్ రోలర్ గుర్తును కేటాయించింది ఈసీ. దీంతో కారు గుర్తుకు పడాల్సిన ఓట్లు కొన్ని ఎక్కడ రోడ్ రోలర్ ఎగరేసుకుపోతుందో అనే భయం టీఆర్ఎస్‌ను ఆందోళనకు గురి చేస్తోంది. ఉప ఎన్నికల్లో పోటీ హోరాహోరీగా సాగితే... రోడ్ రోలర్ తమ కొంపముంచే అవకాశం కూడా లేకపోలేదని కొందరు గులాబీ నేతలు టెన్షన్ పడుతున్నట్టు సమాచారం.

అందుకే హుజూర్ నగర్ ఉప ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్‌కు ఓటు వేయాలని కోరడటంతో... కారు గుర్తును పోలిన రోడ్ రోలర్‌తో పాటు ట్రాక్టర్ సహా ఇతర గుర్తులపై ఓటర్లకు అవగాహన కల్పించాలని టీఆర్ఎస్ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి లోక్ సభ ఎన్నికల్లో టీఆర్ఎస్‌ను ఇబ్బంది పెట్టిన రోడ్ రోలర్ గుర్తు... హుజూర్ నగర్‌లోనూ గులాబీ పార్టీలో గుబులు రేపుతోంది.

First published: October 7, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>