vizag steel plant: ఉక్కు ఉద్యమం చేస్తున్న కార్మిక సంఘాలకు గుడ్ న్యూస్: త్వరలోనే లాభాల్లోకి విశాఖ స్టీల్ ప్లాంట్

వైజాగ్ స్టీల్ ప్లాంట్

దాదాపు 50 రోజులుగా ఉద్యమం చేస్తున్న కార్మిక సంఘాలకు గుడ్ న్యూస్ చెప్పంది స్టీల ప్లాంట్ యాజమాన్యం. త్వరలోనే స్టీల్ ప్లాంట్ కచ్చితంగా లాభాల్లోకి వస్తుందని లెక్కలు వేసి మరి చెప్పింది. మరి ఇప్పుడైనా కేంద్రం తన మనసు మార్చుకుంటుందో లేదో చూడాలి.

  • Share this:
    విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ దిశగా అడుగులు వడివడిగా పడుతున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఏ క్షణమైనా విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజాగా కేంద్ర తీసుకుంటున్న నిర్ణయాలు చూస్తుంటే విశాఖ ఉక్కును త్వరితగతిని ప్రైవేటు పరం చేయాలనే సంకల్పంతో ఉంది అని చెప్పక తప్పదు. విశాఖలో ప్రస్తుతం జరుగుతున్న ఉత్పత్తి.. గత గణంకాలు ఆధారంగా స్టీల్ ప్లాంట్ లాభాల్లోకి వచ్చే అకవాశం ఉందని పలు నివేదికలు చెబుతున్నా కేంద్రం మాత్రం వెనక్కు తగ్గేది లేదని తేల్చి చెప్పేస్తోంది. విశాఖ స్టీల్ ప్లాంటు కు లాభాలు వచ్చే అవకాశాలున్నా.. కేంద్రం అమ్మేయడానికి సిద్దపడిందని.. దేశ వ్యాప్తంగా ఉన్న విపక్ష నేతలు, నిపుణులు చెబుతున్నా కేంద్రం మాత్రం చెవికి ఎక్కించుకోవడం లేదు. కేంద్రం మాత్రం తాను అనుకున్న దారిలోనే వెళ్తోంది. మరోసారి ఇదే అంశం తెర మీదకు వచ్చింది. భవిష్యత్తులో విశాఖ స్టీల్ ప్లాంట్ లాభాల్లోకి రావడం ఖాయమని ప్లాంట్ యాజమాన్యం చాలా స్పష్టంగా చెప్పింది. ఎవరి లెక్కలు చూసి స్టీల్ ప్లాంటును ప్రైవేటీకరించాలని కేంద్రం నిర్ణయించుకుందో వారి లెక్కలే ఇప్పుడు ప్లాంట్ లాభాల్లోకి వచ్చే అవకాశం ఉందని స్పష్టంగా చెబుతున్నాయి.

    విశాఖ ఉక్కు పరిశ్రమ భవిష్యత్‌లో లాభాలు గడించే అవకాశాలు ఉన్నాయని రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌ తాజాగా స్పష్టం చేసింది. వార్షిక బ్యాలెన్స్‌ షీట్‌ ప్రకారం త్వరలోనే లాభాలకు అవకాశముందని పేర్కొంది. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన సమాచార హక్కు కార్యకర్త రమేష్‌ ఆర్టీఐ ద్వారా అడిగిన ప్రశ్నకు ఆర్‌ఐఎన్‌ఎల్‌ ఈమేరకు సమాధానమిచ్చింది. ఉద్యమం పెద్ద ఎత్తున జరుగుతున్న తరుణంలో తాజాగా ఆర్‌ఐఎన్‌ఎల్‌ ఇచ్చిన సమాధానం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. విశాఖ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ ఇచ్చిన లెక్కలు.. దాని బ్యాలెన్స్ షీట్లు చూసి విశాఖ స్టీల్ ప్లాంటును అమ్మకానికి పెట్టామనేది కేంద్రం వాదన. ఏపీలోని బీజేపీ నేతలు కూడా దీనికి వంత పాడడం మొదలు పెట్టారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ద్వారా రాష్ట్రానికి మేలే తప్ప.. ఎలాంటి నష్టం లేదని కేంద్రం చెబుతూ వస్తోంది.

    ఇలాంటి సందర్భంలో రమేష్ చంద్ర వర్మ అనే ఆర్టీఐ కార్యకర్త అడిగిన ప్రశ్నకు విశాఖ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ఇచ్చిన సమాధానంలో ఆసక్తికరమైన అంశాలు ఉన్నాయి. ఇన్నాళ్లూ కార్మిక సంఘాలు.. ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్న వివిధ పార్టీలు చేస్తున్న వాదనకు బలం చేకూర్చేలా విశాఖ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం సమాధానమిచ్చింది. విశాఖ స్టీల్ ప్లాంట్ కు భవిష్యత్తులో లాభాలు వస్తాయని క్లియర్ గా తేల్చి చెప్పింది. 2015 నుంచి 2020 మధ్య కాలంలో స్టీల్ ప్లాంట్ కు వరుస నష్టాలు సంభవించాయని.. అలాగే పన్నుల చెల్లింపులు కూడా జరపలేదని పేర్కొంటూనే.. వాటిని డిఫర్డ్ టాక్స్ అసెట్స్ జాబితాలో చేర్చింది. ఇదే విషయాన్ని బ్యాలెన్స్ షీట్ లో కూడా పొందు పరిచింది. దీని ప్రకారం చూస్తే.. విశాఖ స్టీల్ ప్లాంటుకు కచ్చితంగా లాభాలు వస్తాయని స్టీల్ ప్లాంట్ లెక్కలే చెబుతున్నాయి. అంతేకాదు ఐదేళ్ల నష్టాలు.. పెండింగులో ఉన్న పన్నుల బకాయిలని చెల్లించాక కూడా లాభాల్లోకి వచ్చే అవకాశం ఉంటుందని స్పష్టంగా చెప్పేసింది ఆర్ఐఎన్ఎల్.

    కేంద్రం వాదన మాత్రం వేరేలా ఉంది. నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రస్తుతం నష్టాల్లో ఉన్న విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయాలని కేంద్ర కేబినెట్‌ సిఫారసు చేసింది. కేంద్ర కేబినెట్‌ నిర్ణయానికి వ్యతిరేకంగా రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతున్నాయి. విశాఖ ఉక్కు పోరాట కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రంలో ఇటీవల బంద్‌ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని పునరాలోచించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. బీజేపీ మినహా రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరించవద్దని ఉద్యమిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం లోపభూయిష్ట విధానాలవల్లే విశాఖ ఉక్కు నష్టాల్లో కొనసాగుతోందని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి.
    Published by:Nagesh Paina
    First published: