పంచాయతీ ఎన్నికల్లో తనకు ఓటు వేయలేదన్న అనుమానంతో ఓ అభ్యర్థి ఓ ఓటరు ఇల్లు, గడ్డివాము, కందికట్టలకు నిప్పుపెట్టాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం రాంపురంలో ఈ ఘటన జరిగింది. రాంపురం గ్రామానికి చెందిన ఇస్లావత్ భద్రు, శంకర్ శనివారం రాత్రి పది గంటలకు నిద్రిస్తుండగా గడ్డి వాము, కందికట్టలతో పాటు ఏకంగా ఇంటికి కూడా నిప్పు పెట్టారు. బాధితులు వెంటనే నీళ్లు జల్లి మంటలను ఆర్పేసినా, అప్పటికే నష్టం జరిగిపోయింది. సుమారు రూ.లక్ష వరకు ఆస్తినష్టం వాటిల్లింది.
బాధితులు
రాంపురం పంచాయతీ కొత్తగా ఏర్పడింది. మూడో విడుత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఈ గ్రామంలో కూడా ఎన్నికలు నిర్వహించారు. ఈనెల 30న ఎన్నికలు జరిగాయి. టీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులతో పాటు ఇస్లావత్ క్రాంతి ఇండిపెండెంట్గా పోటీ చేశాడు. భద్రు, శంకర్ తనకు మద్దతు ఇస్తామని మాట ఇచ్చి అనంతరం టీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేయడంతో కేవలం 5 ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి భూక్యా ఇందిరపై అతను ఓడిపోయాడు. దీంతో ఆ రోజు రాత్రి ఇంటికి వచ్చి గొడవ చేశాడు. బాధితులపై దాడికి దిగారు. అనంతరం ఫిబ్రవరి 2న రాత్రి వారిద్దరూ ఇంట్లో నిద్రిస్తుండగా, ఇల్లు, గడ్డివాముకి నిప్పు పెట్టారని బాధితులు ఆరోపిస్తున్నారు.
తాము టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా పనిచేశామన్న కోపంతో తమపై దాడి చేశారని బాధితులు చెబుతున్నారు. ఘటన జరిగిన రోజు ఇంట్లో రెండు గ్యాస్ సిలిండర్లు ఉన్నాయని, ఒకవేళ అవి పేలి ఉంటే, తమ ప్రాణాలు కూడా దక్కేవి కావన్నారు. కట్టుబట్టలతో రోడ్డు మీద పడిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.