తెలంగాణ రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి. ఒకప్పుడు టీఆర్ఎస్ తప్ప తెలంగాణలో మరో పార్టీకి సంబంధించిన ప్రస్తావన పెద్దగా ఉండేది కాదు. అలాంటిది ఇప్పుడు టీఆర్ఎస్‌తో కాంగ్రెస్, బీజేపీ ఢీ అంటే ఢీ అంటున్నాయి. ఈ రెండు పార్టీలు రాజకీయంగా రాబోయే రోజుల్లో టీఆర్ఎస్‌ను ఎంతవరకు సవాల్ చేస్తాయనే విషయం తెలియకపోయినప్పటికీ.. రాజకీయ రణక్షేత్రంలో మాత్రం టీఆర్ఎస్‌తో పోటాపోటీగా తలపడుతున్నాయి. బీజేపీ అధికార టీఆర్ఎస్, సీఎం కేసీఆర్‌పై ధ్వజమెత్తుతుంటే.. కాంగ్రెస్ కూడా అదే స్థాయిలో గులాబీ పార్టీని టార్గెట్ చేస్తుంది. అయితే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి టీఆర్ఎస్‌ను టార్గెట్ చేసే విషయంలో కొత్త వ్యూహాన్ని అమలు చేస్తున్నారనే చర్చ రాజకీయవర్గాల్లో సాగుతోంది. టీఆర్ఎస్‌తో తలపడే పార్టీలో ఎక్కువగా కేసీఆర్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తుంటాయి.
కానీ రేవంత్ రెడ్డి మాత్రం ఈ విషయంలో కాస్త భిన్నంగా ముందుకు సాగుతున్నారని తెలుస్తోంది. టీఆర్ఎస్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్నారు. తెలంగాణ రాజకీయాల్లో కీలకమైన టీఆర్ఎస్ నిర్ణయాల్లో ప్రస్తుతం సీఎం కేసీఆర్‌ది కీలక పాత్ర అయినప్పటికీ.. రాబోయే రోజుల్లో మాత్రం కేటీఆర్ టీఆర్ఎస్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించడం దాదాపు ఖాయం.
టీఆర్ఎస్ వర్గాలు కూడా ఈ విషయంలో క్లారిటీతో ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ మరోసారి విజయం సాధిస్తే.. కేసీఆర్‌కు బదులుగా కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతారని ఆ పార్టీ నేతలు, తెలంగాణ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ విషయంలో పూర్తి స్పష్టతతో ఉన్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. భవిష్యత్ రాజకీయాల్లో తనకు పోటీ కేటీఆర్ అవుతారని భావిస్తున్నారు. అందుకే కేసీఆర్‌తో పోటీ పడటానికి బదులుగా కేటీఆర్‌ను టార్గెట్ చేస్తూ రాజకీయాలు చేస్తున్నారనే చర్చ జరుగుతోంది.
Telangana: ఇటు కాంగ్రెస్.. అటు బీజేపీ.. బ్యాలెన్స్ చేస్తున్న మాజీ ఎంపీ.. టార్గెట్ ఆ నాయకుడే..
YS Jagan: ఏపీ కేబినెట్‌లో మార్పులు చేర్పులు.. వారిచ్చే నివేదికలే సీఎం జగన్‌కు కీలకమా ?
మరోవైపు కేసీఆర్‌తో పాటు కేటీఆర్‌ను కూడా రాజకీయంగా ఎదుర్కోవాల్సిన అవసరం రేవంత్ రెడ్డికి ఉంటుందని.. అందుకే రేవంత్ రెడ్డి ఈ విధమైన వ్యూహంతో ముందుకు సాగుతున్నారని పలువురు చర్చించుకుంటున్నారు. మొత్తానికి తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ కంటే ఎక్కువగా కేటీఆర్‌ను టార్గెట్ చేస్తున్న రేవంత్ రెడ్డి.. ఇకపై కూడా కేటీఆర్‌తోనే ఎక్కువగా రాజకీయంగా పోరాడతారా లేక పరిస్థితిని బట్టి కేసీఆర్, కేటీఆర్‌లపై రాజకీయ దాడి చేస్తారా ? అన్నది చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Congress, KTR, Revanth Reddy, Telangana, Trs