118 నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు.. అప్పుడే అందరికీ దళితబంధు.. కేసీఆర్‌ జైలుకెళ్లడం ఖాయమన్న రేవంత్ రెడ్డి

తెలంగాణలో టీపీసీసీ చీఫ్ బాధ్యతలు తీసుకున్న తరువాత రేవంత్ రెడ్డి దూకుడుగా ముందుకు సాగుతున్నారు. సైలెంట్‌గా ఉన్న కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేస్తున్నారు. సీనియర్లను కలుపుకుని ముందుకు సాగుతున్నారు.

Revanth Reddy: రాష్ట్రంలోని కాంగ్రెస్ కార్యకర్తలను కాపాడుకుంటామని రేవంత్ రెడ్డి తెలిపారు. తమ కార్యకర్తలను హెచ్చరించే అధికారులను విడిచిపెట్టబోమని హెచ్చరించారు.

  • Share this:
    హుజూరాబాద్ నియోజకవర్గం తరహాలో తెలంగాణ వ్యాప్తంగా దళితులందరికీ దళితబంధు రావాలంటే.. 118 నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు రావాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. దళితులందరికీ దళితబంధు కింద రూ. 10 లక్షలు ఇస్తారో లేదో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తేల్చుకోవాలని తెలిపారు. అదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో నిర్వహించిన దళిత గిరిజన దండోరా సభలో టీఆర్ఎస్‌ ప్రభుత్వంపై ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సోనియమ్మ రాజ్యం వస్తేనే తెలంగాణలోని దళిత, గిరిజన వర్గాలకు న్యాయం జరుగుతుందని రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణలో రాబోయేది సోనియమ్మ సారథ్యంలోని కాంగ్రెస్ రాజ్యమే అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలు 20 నెలలు కష్టపడితే రాష్ట్రలో కాంగ్రెస్ పాలన ఖాయమని అన్నారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ కార్యకర్తలను కాపాడుకుంటామని రేవంత్ రెడ్డి తెలిపారు. తమ కార్యకర్తలను హెచ్చరించే అధికారులను విడిచిపెట్టబోమని హెచ్చరించారు.

    ఇంద్రవెల్లిలో లక్షమందితో సభ పెడతామని అన్నామని.. లక్షకు ఒక్కరు తక్కువున్నా తన తల నరుక్కుంటానని సవాల్ విసిరారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండగా లక్షల కోట్ల అప్పులు చేశారని.. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి నెత్తిమీద లక్ష రూపాయల అప్పు పెట్టారని మండిపడ్డారు. కేసీఆర్ మంత్రివర్గంలో మొదటి ఐదేళ్లలో మహిళలకు స్థానం లేదని గుర్తు చేశారు. దళితుడిని ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించిన సీఎం కేసీఆర్.. ఆయనపై ఉన్న ఆరోపణలను ఇప్పటికీ నిరూపించలేదని విమర్శించారు. మంత్రివర్గంలో మాదిగలకు స్థానం లేదని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో పోలీసులను అడ్డుపెట్టుకుని కేసీఆర్ పాలన సాగిస్తున్నారని.. ఇది ఎంతోకాలం సాగదని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే కేసీఆర్‌ను ఫామ్‌హౌజ్‌‌కు బదులుగా చర్లపల్లి జైలుకు పంపిస్తామని రేవంత్ రెడ్డి హెచ్చరించారు.
    Published by:Kishore Akkaladevi
    First published: