తెలంగాణ కాంగ్రెస్‌లో తిరుగులేని నేతగా ఎదగాలని భావిస్తున్న రేవంత్ రెడ్డి.. ఆ దిశగా వ్యూహాత్మకంగానే అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తోంది. ఇటీవల రేవంత్ రెడ్డి పాదయాత్ర ముగింపు సందర్భంగా అనేకమంది కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. వారిలో కొండా సురేఖ దంపతులు కూడా ఉన్నారు. వరంగల్ జిల్లాలో కొండా సురేఖ, కొండా మురళి దంపతులకు బలమైన వర్గం ఉందనే విషయం అందరికీ తెలిసిందే. 2014కు ముందు టీఆర్ఎస్లో చేరిన కొండా సురేఖ.. గత ఎన్నికలకు ముందు మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరారు. అయితే ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి చేతిలో ఆమె ఓటమి పాలయ్యారు. అయితే కాంగ్రెస్‌లో కొనసాగుతూనే తమ పట్టు పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఈ క్రమంలోనే కొండా సురేఖ దంపతులు రాష్ట్ర స్థాయిలో ఏ నేత వైపు ఉంటారనే దానిపై చాలాకాలంగా నెలకొన్న సస్పెన్స్‌కు రేవంత్ రెడ్డి పాదయాత్ర ముగింపు సభతో క్లారిటీ వచ్చింది. ఈ సభలో పాల్గొన్న కొండా సురేఖ.. రేవంత్ రెడ్డిని వైఎస్ఆర్తో పోల్చడంతో పాటు కాంగ్రెస్ సీనియర్ నేతలపై మండిపడ్డారు. తాను రేవంత్ రెడ్డి వైపు ఉన్నానని చెప్పకనే చెప్పారు. మరోవైపు కొండా సురేఖ దంపతులను తనవైపు తిప్పుకోవడం ద్వారా రేవంత్ రెడ్డి వరంగల్ జిల్లా కాంగ్రెస్‌పై పట్టు సాధించారనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాలకు చెందిన ముఖ్యనేతల మద్దతును సమీకరించుకుంటున్న రేవంత్ రెడ్డి.. కొండా సురేఖ దంపతులను ఆకర్షించడం ద్వారా టీపీసీసీ రేసులో మిగతా వారి కంటే ముందుకు వెళ్లారనే చర్చ జరుగుతోంది.
మరోవైపు కొండా సురేఖ తరహాలోనే కాంగ్రెస్‌లో జిల్లా స్థాయిలో బలంగా ఉన్న మరికొందరు నేతలను తనవైపు తిప్పుకునేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని.. రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేయడానికి ముందే ప్రతి ఉమ్మడి జిల్లాలో బలమైన నేతలను తమ వైపు తిప్పుకోవాలని ప్లాన్ చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. మొత్తానికి తెలంగాణ కాంగ్రెస్‌లో ఎదిగేందుకు ప్రయత్నిస్తున్న రేవంత్ రెడ్డి.. ఈ విషయంలో కొంతవరకు సక్సెస్ అయినట్టే కనిపిస్తోంది.