news18-telugu
Updated: September 9, 2019, 11:28 AM IST
రేవంత్ రెడ్డి
తెలంగాణ కాంగ్రెస్ పగ్గాలు తనకే దక్కుతాయని ధీమాగా ఉన్న మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డికి మళ్లీ వెయిటింగ్లో ఉండక తప్పని పరిస్థితి కనిపిస్తోంది. రేవంత్ రెడ్డికి టీ పీసీసీ చీఫ్ ఖాయమైందని ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే దీనిపై తెలంగాణ కాంగ్రెస్‌కు చెందిన పలువురు సీనియర్లు ఢిల్లీ వెళ్లి తమ పార్టీ అధినాయకత్వం దగ్గర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది. స్వయంగా అహ్మద్ పటేల్‌ను కలిసి వీరంతా తమ అభ్యంతరాలు వ్యక్తం చేశారని సమాచారం. దీంతో టీ పీసీసీ చీఫ్ మార్పు నిర్ణయాన్ని తాత్కాలికంగా పక్కనపెట్టాలని కాంగ్రెస్ అధినాయకత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది.
తెలంగాణలో త్వరలోనే మున్సిపల్ ఎన్నికలు, హుజూర్ నగర్ ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో... ఆ తరువాతే టీ పీసీసీ చీఫ్ మార్పుపై నిర్ణయం తీసుకోవాలని కాంగ్రెస్ భావిస్తున్నట్టు సమాచారం. దీనికి తోడు టీ పీసీసీ చీఫ్‌గా ఉన్న ఉత్తమ్‌ను మారిస్తే...ఆ ప్రభావం హుజూర్ నగర్ ఉప ఎన్నికపై పడుతుందని కాంగ్రెస్ అధినాయకత్వం భావించినట్టు టాక్ వినిపిస్తోంది. మరోవైపు రేవంత్ రెడ్డి సైతం మున్సిపల్ ఎన్నికలు, హుజూర్ నగర్ ఉప ఎన్నికలు పూర్తయిన తరువాతే టీ పీసీసీ పగ్గాలు తీసుకోవాలని భావిస్తున్నారని పలువురు చర్చించుకుంటున్నారు. మొత్తానికి తెలంగాణ కాంగ్రెస్ పగ్గాలు దక్కించుకోవాలని ఎదురుచూస్తున్న రేవంత్ రెడ్డి ఆశలకు తాత్కాలికంగా బ్రేక్ పడినట్టే కనిపిస్తోంది.
Published by:
Kishore Akkaladevi
First published:
September 9, 2019, 11:12 AM IST