తెలంగాణలో రాజకీయాల్లో కొత్త మార్పు రావడం దాదాపు ఖాయమైంది. తెలంగాణ మంత్రి, సీఎం కేసీఆర్ తనయుడు కేటీఆర్ ముఖ్యమంత్రి కావడం దాదాపు లాంఛనమే అనే టాక్ వినిపిస్తోంది. ఈ అంశంపై టీఆర్ఎస్ నేతలకు పూర్తి స్పష్టత రాగా... ఇతర పార్టీల నేతలు సైతం త్వరలోనే కేటీఆర్‌కు సీఎంగా పట్టాభిషేకం జరగడం ఖాయమని చర్చించుకుంటున్నారు. దీంతో ఇప్పటివరకు టీఆర్ఎస్ అధినేత, ప్రభుత్వాధినేతగా కేసీఆర్‌ను ఎక్కువగా టార్గెట్ చేస్తూ వచ్చిన విపక్షాలు.. ఇకపై తమ అస్త్రాలన్నీ కేటీఆర్‌పై ప్రయోగించాల్సి ఉంటుంది. ఇప్పటికే టీఆర్ఎస్ ముఖ్యనేత, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను విపక్షాలు టార్గెట్ చేస్తున్నప్పటికీ.. ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత కేసీఆర్‌ను కాకుండా పూర్తిస్థాయిలో కేటీఆర్ లక్ష్యంగా రాజకీయాలు చేయాల్సి ఉంటుందనే చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో మిగతా నేతల సంగతి ఎలా ఉన్నా.. కాంగ్రెస్ ముఖ్యనేత, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి వ్యూహం ఎలా ఉండబోతోందన్నది ఆసక్తికరంగా మారింది. కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతారనే అంశంపై బీజేపీ ఇప్పటికే స్పందించింది. కానీ రేవంత్ రెడ్డి మాత్రం ఈ అంశంపై ఇంకా రియాక్ట్ కాలేదు.
నిజానికి కేటీఆర్ టార్గెట్‌గా రేవంత్ రెడ్డి గతంలోనే అనేక ఆరోపణలు చేశారు. రంగారెడ్డి జిల్లాలో ఆయన ఫామ్ హౌస్ నిర్మాణం అక్రమమని ఆరోపించారు. దీనిపై కేటీఆర్ కూడా స్పందించి వివరణ ఇచ్చారు. అయితే కేటీఆర్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే ఇక రేవంత్ రెడ్డి సైతం ఆయన కేంద్రంగానే రాజకీయ విమర్శలు చేయాల్సి ఉంటుందని పలువురు చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి తన వ్యూహాన్ని మార్చుకునే అవకాశం లేకపోలేదనే టాక్ బలంగా వినిపిస్తోంది.
కేటీఆర్ ముఖ్యమంత్రి అయిన తరువాత కేసీఆర్‌ను విమర్శించడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని.. కాబట్టి ఇక తెలంగాణ రాజకీయాల్లో తన పోటీ కేటీఆర్‌తోనే ఉంటుందనే అంశంపై రేవంత్ రెడ్డి ఇప్పటికే ఓ క్లారిటీకి వచ్చారని కొందరు నేతలు చర్చించుకుంటున్నారు. ఈ కారణంగానే కేటీఆర్‌ను టార్గెట్ చేసేందుకు రేవంత్ రెడ్డి తన అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నారనే ప్రచారం కూడా సాగుతోంది. మొత్తానికి తెలంగాణ రాజకీయాలు, అందులోనూ టీఆర్ఎస్ రాజకీయాల్లో జరగనున్న మార్పుల పట్ల కాంగ్రెస్ ముఖ్యనేత రేవంత్ రెడ్డి ఏ రకంగా రియాక్ట్ అవుతారు ? ఆ పార్టీని ఏ రకంగా టార్గెట్ చేస్తారన్నది ప్రస్తుతానికి సస్పెన్సే.
Published by:Kishore Akkaladevi
First published:January 21, 2021, 18:20 IST