Revanth Reddy Arrest: రేవంత్ రెడ్డిని అరెస్టు చేసిన పోలీసులు

Revanth Reddy visit to Srisailam Project | నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో ఉప్పునుంతల పోలీస్ స్టేషన్ కు రేవంత్ రెడ్డిని తరలించారు.

news18-telugu
Updated: August 22, 2020, 5:56 PM IST
Revanth Reddy Arrest: రేవంత్ రెడ్డిని అరెస్టు చేసిన పోలీసులు
రేవంత్ రెడ్డి (ఫైల్ ఫోటో)
  • Share this:
Revanth Reddy arrest news | తెలంగాణ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్ ప్లాంట్‌లో జరిగిన ఘటన గురించి తెలుసుకునేందుకు వెళ్తున్న రేవంత్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు, రేవంత్ రెడ్డి అనుచరులకు మధ్య వాగ్వాదం జరిగింది. కొద్దిసేపు టెన్షన్ వాతావరణం నెలకొంది. అనంతరం పోలీసులు రేవంత్ రెడ్డిని అరెస్టు చేశారు. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో ఉప్పునుంతల పోలీస్ స్టేషన్ కు రేవంత్ రెడ్డిని తరలించారు.  రేవంత్ రెడ్డితోపాలు కాంగ్రెస్ నేత మల్లురవిని కూడా పోలీసులు అరెస్టు చేశారు.

మానవ తప్పిదాల వల్లే శ్రీశైలం పవర్‌ఫ్లాంట్‌లో అగ్నిప్రమాదం జరిగిందని కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ నేతలు శ్రీశైలం వెళ్తే బండారం బయటపడుతుందని భయపడుతున్నారని అన్నారు. తప్పు చేయకపోతే ప్రభుత్వానికి భయమెందుకు? వారి కుట్రలను ప్రజలకు తెలియకుండా చేయాలని చూస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. తమను అక్రమంగా నిర్బంధించారని, తప్పును కప్పిపుచ్చుకోవడానికి దుర్మార్గాలు చేస్తున్నారని మండిపడ్డారు. అన్ని మండల కేంద్రాల్లో కాంగ్రెస్‌ శ్రేణులు నిరసన తెలియజేయాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. శ్రీశైలం ప్రమాదాన్ని కేంద్ర ప్రభుత్వం సుమోటోగా తీసుకుని సీబీఐ విచారణకు ఆదేశించాలని రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు.

కోవిడ్ విషయంలో జోక్యం చేసుకున్నట్టుగానే శ్రీశైలం పవర్ ప్లాంట్ ప్రమాద ఘటన విషయంలోనూ జోక్యం చేసుకోవాలని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి కోరారు. గవర్నర్‌కు ఆయన లేఖ రాశారు. క్షేత్రస్థాయి సిబ్బంది రెండు రోజుల క్రితమే హెచ్చరించినా ఉన్నతాధికారులు పట్టించుకోలేదని పేర్కొన్నారు. ఈ ప్రమాదానికి మంత్రి జగదీశ్వర్ రెడ్డి, సీఎండీ ప్రభాకర్ రావు బాధ్యత వహించాలని రేవంత్ పేర్కొన్నారు. వారిద్దరిపై చర్యలు తీసుకోవాల్సిందిగా ముఖ్యమంత్రిని ఆదేశించాలని గవర్నర్‌ను రేవంత్ రెడ్డి కోరారు. అలాగే బాధిత కుటుంబాలకు రూ. కోటి పరిహారం ఇవ్వాల్సిందిగా సీఎంను ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు.

కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డి, మల్లు రవిల అరెస్ట్ అప్రజాస్వామికమని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ప్రజాప్రతినిధులుగా శ్రీశైలం సంఘటనను పరిశీలించడం, బాధితులను పరామర్శించడం కనీస బాధ్యత అని గుర్తుచేశారు. కానీ తెలంగాణ ప్రభుత్వం రాక్షసంగా ప్రవర్తిస్తుందని ధ్వజమెత్తారు.ప్రభుత్వ తప్పిదాలు బయట పడతాయని పోలీసులను ప్రభుత్వం ఉపయోగించి నిర్బంధానికి పాల్పడుతోందన్నారు. రేవంత్, మల్లు రవిలను వెంటనే విడుదల చేసి శ్రీశైలం సంఘటన స్థలాన్ని సందర్శించే అనుమతి ఇవ్వాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు.

శ్రీశైలం ఎడమగట్టు వద్ద విద్యుత్ ప్లాంట్‌లో జరిగిన ప్రమాదంలో 9 మంది మృతిచెందారు. గురువారం రాత్రి ప్లాంట్‌లో షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు వచ్చాయి. వాటిని ఆర్పేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. పెద్ద ఎత్తున పొగ కమ్మేయడంతో లోపల ఉన్నవారు బయటకు రాలేకపోయారు. ఈ ఘటనలో 9 మంది చనిపోయారు. అందులో ఏడుగురు ప్రభుత్వ ఉద్యోగులు, ఇద్దరు అమరన్ బ్యాటరీ కంపెనీ ఉద్యోగులు ఉన్నారు. ప్రమాదంలో చనిపోయిన డీఈ శ్రీనివాస్ గౌడ్ కుటుంబానికి రూ. 50 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రభుత్వం.. ప్రమాదంలో చనిపోయిన మిగతా వారి కుటుంబాలకు రూ. 25 లక్షలు నష్టపరిహారం ఇవ్వనున్నట్టు మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. మృతుల కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగ అవకాశాన్ని ఇచ్చేందుకు పరిశీలిస్తామని చెప్పింది.

డీఈ శ్రీనివాస్ గౌడ్ (హైదరాబాద్), ఏఈ వెంకట్‌రావు (పాల్వంచ), ఏఈ మోహన్ కుమార్ (హైదరాబాద్ ), ఏఈ ఉజ్మ ఫాతిమా (హైదరాబాద్), ఏఈ సుందర్ (సూర్యాపేట) ప్లాంట్ అటెండెంట్ రాంబాబు (ఖమ్మం జిల్లా) , జూనియర్ ప్లాంట్ అటెండెంట్ కిరణ్ (పాల్వంచ) హైదరాబాద్‌కు చెందినా అమరన్ బ్యాటరీ కంపెనీ సిబ్బంది వినేష్ కుమార్, మహేష్ కుమార్ చనిపోయారు. ఈ కేసును సీఐడీ విచారిస్తోంది. ఈ రోజు సీఐడీ చీఫ్ ఘటన స్థలాన్ని పరిశీలించారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: August 22, 2020, 5:44 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading