Telangana PCC: తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడిగా ఎంపీ రేవంత్‌రెడ్డి.. వివరాలు ఇలా..

రేవంత్ రెడ్డి (ఫైల్ ఫోటో)

Telangana PCC: తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ(టీపీసీసీ) అధ్యక్షుడిగా ఎంపీ రేవంత్‌రెడ్డిని నియమిస్తూ ఏఐసీసీ(అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ) ప్రకటించింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  • Share this:
    ఎప్పటి నుంచో ఊరిస్తున్న తెలంగాణ పీసీసీ పదవిని  ఎట్టకేలకు కాంగ్రెస్ అధిష్టానం ఫైనల్ చేసింది.  తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ(టీపీసీసీ) అధ్యక్షుడిగా మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్‌రెడ్డిని నియమిస్తూ ఏఐసీసీ(అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ) ప్రకటించింది. ప్రస్తుతం ఆయన తెలంగాణ కాంగ్రెస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. వర్కింగ్‌ ప్రెసిడెంట్లుగా ఐదుగురుని నియమించింది.  టి.జగ్గారెడ్డి,  మహ్మద్‌ అజారుద్దీన్‌, జె.గీతారెడ్డి, ఎం.అంజన్‌కుమార్‌ యాదవ్‌, బి.మహేశ్‌కుమార్‌ గౌడ్‌లు నియమితులయ్యారు. ఉపాధ్యక్షులుగా సురేశ్‌ షెట్కార్‌, వేం నరేందర్‌రెడ్డి, చంద్రశేఖర్‌ సంబని, దామోదర్‌రెడ్డి, రవి మల్లు, పొడెం వీరయ్య,  రమేశ్‌ ముదిరాజ్‌, గోపిశెట్టి నిరంజన్‌, టి.కుమార్‌ రావు, జావేద్‌ ఆమీర్‌ లను నియమిస్తూ ఏఐసీసీ ఉత్తర్వులు జారీ చేస్తూ ప్రకటన విడుదల చేసింది. ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్‌గా దామోదర్‌ సి.రాజ నర్సింహ, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్‌గా ఆలేటి మహేశ్వరరెడ్డిలు నియమితులయ్యారు. ఈసారి టీమ్ ఎంపికలో సామాజిక సమీకరణాలకు కాంగ్రెస్ అధిష్టానం పెద్దపీట వేసింది. గతానికి భిన్నంగా ఈసారి ఐదుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమించింది. ఒక రెడ్డి, ఇద్దరు బీసీలు, ఒక ఎస్సీ, మరో మైనారిటీ నేతకు వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించింది. దీన్ని బట్టి తెలంగాణలో సామాజిక సమీకరణాలకు అనుగుణంగా కాంగ్రెస్ పెద్దలు అడుగులు వేశారు.

    అయితే గత కొన్ని నెలల నుంచి తెలంగాణ పీసీసీ చీఫ్ పై ఎలాంటి నిర్ణయాన్ని వెల్లడించలేదు. రేపు, మాపు  ప్రకటన వెలువడుతుందంటూ ఎన్నోసార్లు పీసీసీ చీఫ్ ఎవరన్నది వాయిదా పడుతూ వచ్చింది. ఈ రేసులో చాలామంది పేర్లు తెరపైకి వచ్చాయి. అందులో ప్రధానంగా రేవంత్ రెడ్డి పేరు కూడా వినిపిస్తూ వచ్చింది. మొదటి నుంచి పార్టీలో ఉన్న వారిని కాదని కొత్తవాళ్లకు ఎలా అవకాశం ఇస్తారని
    కాంగ్రెస్ లో కొంతమంది సీనియర్ నేతలు అలకబూనడంతో పాటు పలువురు నేతలు తీవ్ర స్థాయిలో అభ్యంతరాలు వ్యక్తిచేసిన పరిస్థితి నెలకొంది. దాంతో టీఎస్ పీసీసీ చీఫ్ ఎవరు అనేదానిపై ఏఐసీసీ నిర్ణయం తీసుకోలేకపోయింది.

    ఆ తర్వాత తెలంగాణలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు, ఉప ఎన్నికల నేపథ్యంలో కూడా వాయిదా వేస్తూ వచ్చింది. వీహెచ్ లాంటి సీనియర్ నేతలు బయట నుంచి వచ్చినవారిని ఎలా తీసుకుంటారంటూ అలకలుబూనారు. ఇవన్నింటిని పరిగణనలోకి తీసుకుని తెలంగాణ పీసీసీ చీఫ్ నియామకాన్ని ఏఐసీసీ అధిష్టానం వాయిదా వేసుకుంటూ వచ్చింది. చివరకు ఆ పదవి మాల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డిని వరించింది.  ఇప్పటికే తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా సునీతా రావును నియమిస్తూ సోనియా గాంధీ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.
    Published by:Veera Babu
    First published: