Revanth ReddY: చివరకు రేవంత్‌రెడ్డినే వరించిన టీపీసీపీ పీఠం.. ఆయనను వ్యతిరేకించిన వాళ్ల సంగతేమిటి..?

రేవంత్‌ రెడ్డి(ఫైల్ ఫొటో)

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఎవరనే దానిపై ఉత్కంఠ వీడింది. మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్‌రెడ్డిని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా నియమిస్తూ కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం ప్రకటించింది.

 • Share this:
  తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఎవరనే దానిపై ఉత్కంఠ వీడింది. మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్‌రెడ్డిని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా నియమిస్తూ కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం ప్రకటించింది. ఈ మేరకు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ శనివారం పత్రిక ప్రకటన విడుదల చేశారు. ఇక, గత కొంత కాలంగా టీపీసీసీ అధ్యక్షుడు ఎవరనే దానిపై తీవ్ర ఉత్కంఠ కొనసాగిన సంగతి తెలసిందే. గతేడాది గ్రేటర్‌ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర ఓటమికి నైతిక బాధ్యతగా పీసీసీ చీఫ్‌గా ఉన్న ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా కొత్త సారథిని ఎంపిక చేయాలని కాంగ్రెస్‌ అధిష్ఠానాన్ని కోరినట్లు ఉత్తమ్‌ తెలిపారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ అధిష్టానం టీపీసీసీ నూతన సారథి ప్రక్రియ చేపట్టింది.

  అయితే టీపీసీపీ రేసులో ముఖ్యంగా రేవంత్‌రెడ్డి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి పేర్లు వినిపించాయి. ఇక, వీహెచ్, జగ్గారెడ్డి వంటి కొందరు నేతలు కూడా తమకు పీసీసీ పదవి ఇవ్వాలని కోరారు. మరోవైపు రేవంత్‌రెడ్డికి పీసీసీ పదవి ఇవ్వొద్దని పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలు కొందరు అధిష్టానాన్ని కోరారు. రేవంత్‌ను ఉద్దేశించి పలువురు కాంగ్రెస్ నేతలు బహిరంగంగానే విమర్శలు చేశారు. ఇటీవల పార్టీలో చేరిన వ్యకిని అధ్యక్షుడిగా నియమిస్తే సీనియర్ల ఆత్మగౌరవం దెబ్బతింటుందని సీనియర్ నేత వీహెచ్ అన్నారు. మొదటి నుంచి పార్టీలో ఉన్న వ్యక్తికే పీసీసీ బాధ్యతలు అప్పగించాలని అధిష్ఠానాన్ని కోరారు. తనను పార్టీ నుంచి బయటకు పంపించేందుకు కుట్రలు జరుగుతున్నాయని వీహెచ్‌ ఆరోపించారు.

  మరోవైపు జగ్గారెడ్డి పలు సందర్భాల్లో రేవంత్‌రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. రేవంత్, ఆయన అనుచరులు కాంగ్రెస్ పార్టీ పరువు తీస్తున్నారంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా రేవంత్ అంతా తీస్మార్ ఖానా.. అంటూ పదునైన పదజాలంతో మండిపడ్డారు. ఈ క్రమంలోనే టీపీసీసీ ఎంపిక ప్రక్రియ ఆలస్యం అవుతూ వచ్చింది. పార్టీ అధిష్టానం రేవంత్‌కు బాధ్యతలు అప్పగించేందుకు సానుకూలంగా ఉన్నప్పటికీ.. ఓ వర్గం నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత రావడంతో.. ఎంపిక ప్రక్రియ కాస్తా జాప్యం జరిగింది. చివరకు కోమటిరెడ్డి, రేవంత్ రెడ్డి పేర్లు తుది జాబితాలో నిలవగా.. మధ్యే మార్గంగా కాంగ్రెస్ అధిష్టానం మంథని ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, మాజీ ఎంపీ మధుయాష్కిల పేర్లను పరిశీలిస్తుందనే ప్రచారం కూడా జరిగింది.

  అయితే గత కొద్ది రోజులుగా రేవంత్‌ రెడ్డి, కోమటిరెడ్డిలతో పలుమార్లు మాట్లాడిన అధిష్టానం.. చివరకు రేవంత్‌ వైపే మొగ్గు చూపింది. అయితే టీపీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి నియామకంపై రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. కోమటిరెడ్డికి పీసీసీ వస్తుందని ఆశలు పెట్టుకున్న నేతలు.. ఈ నిర్ణయానికి మద్దతుగా నిలుస్తారా? లేదా? అనేది చర్చనీయాంశంగా మారింది. మరోవైపు రేవంత్‌ను వ్యతిరేకించిన నాయకులు.. ఏ విధంగా ముందుకు సాగుతారనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇక, రేవంత్‌ను ప్రధానంగా వ్యతిరేకించిన జగ్గారెడ్డిని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించడం ద్వారా పార్టీ అధిష్టానం ఆయనను శాంతపరిచే ప్రయత్నం చేసిందని రాజకీయ విశ్లేషకులు అంచా వేస్తున్నారు.

  ఇదిలా ఉంచితే చాలా కాలంగా కాంగ్రెస్‌లో గ్రూప్ రాజకీయాలు కొత్తేమీ కాదని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటిది ఇప్పుడు రేవంత్‌రెడ్డి పార్టీ పగ్గాలు అప్పగించిన నేపథ్యంలో.. పార్టీలో ఆయనను వ్యతిరేకిస్తున్నవారు కలిసి పనిచేసే అవకాశాలు తక్కువేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే రేవంత్ రెడ్డి వ్యతిరేకులు.. పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని గౌరవించి ఆయనతోతో కలిసి పనిచేస్తారా.. లేక పార్టీలో గ్రూప్ రాజకీయాలు తారాస్థాయికి చేరతాయా తెలియాలంటే మరికొంత కాలం వెయిట్ చేయాల్సిందే. మరోవైపు రేవంత్‌రెడ్డి కూడా తన వ్యతిరేక వర్గం నేతలను కలుపుకుని ముందుకు సాగుతారా? లేదా  అనేది చూడాల్సి ఉంది.
  Published by:Sumanth Kanukula
  First published: