లోక్‌సభ ఎన్నికల్లో మాజీ ప్రధాని దేవెగౌడ ఫ్యామిలీకి ఘోర పరాభవం ఎదరయింది. కర్నాటకలో మూడు స్థానాల్లో పోటీచేసిన దేవెగౌడ కుటుంబం ఒక సీటును మాత్రమే గెల్చుకుంది. తుమకూరులో ఏకంగా దేవెగౌడ ఓటమి పాలయ్యారు. అటు మాండ్యాలో సుమలత చేతిలో కుమారస్వామి కొడుకు నిఖిల్ ఓడిపోయాడు. ఐతే మాండ్యాలో మహిళ చేతిలో పరాజయం పాలవడాన్ని నిఖిల్ జీర్ణించుకోలేకపోతున్నాడని సమాచారం. అసహనంతో తాత దేవెగౌడపై నిఖిల్ అరిచాడని కన్నడనాట వార్తలు షికారుచేశాయి. వాటిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసిన జేడీఎస్ వర్గాలు పోలీసులకు ఫిర్యాదు చేశాయి. దాంతో పలువురు జర్నలిస్టులపై కేసుపెట్టారు.
శనివారం విశ్వవాణి దినపత్రికలో దేవెగౌడ-నిఖిల్‌కు సంబంధించిన వార్త ప్రచురితమైంది. మాండ్యాలో ఓటమి మీరే కారణమంటూ తాత దేవెగౌడపై నిఖిల్ అరిచినట్లుగా కథనం రాశారు. ఐతే అది తప్పుడు వార్తని..జడీఎస్ రాష్ట్ర కార్యదర్శి ఎస్పీ ప్రదీప్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పార్టీ వర్గాలను గందరగోళానికి గురిచేసేలా వార్త రాశారని పేర్కొన్నారు. దాంతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి విశ్వవాణి ఎడిటర్ విశ్వేశ్వర్ భట్‌తో పాటు ఎడిటోరియల్ టీమ్‌పై సెక్షన్ 406, 420, 499 కింద కేసులు పెట్టారు.
ఎక్కడ నివసిస్తున్నామో నాకు అర్థం కావడం లేదు. గత 19 ఏళ్లుగా నేను ఎడిటర్‌గా పనిచేస్తున్నా. కానీ ఎప్పుడూ ఇలాంటి పరిణామాలను ఎదర్కోలేదు. పరువు నష్టం దావా వేసుకోవచ్చు. కానీ ఎఫ్ఐఆర్ నమోదుచేయడం ఏంటో..? కేసును న్యాయపరంగా ఎదుర్కొంటా.
— విశ్వేశ్వర్ భట్, ఎడిటర్
కాగా, దేవెగౌడ ఫ్యామిలీ హసన్ సీటును మాత్రమే గెలుచుకోగలిగింది. హసన్‌లో హెడీ రేవణ్ణ కుమారుడు ప్రజ్వల్ విజయం సాధించారు. హసన్ దేవెగౌడ సిట్టింగ్ స్థానమైనప్పటికీ మనవడి కోసం త్యాగం చేశారు. ఆయన తమకూరు నుంచి పోటీచేసి ఓడిపోయారు. 19,214 ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి బసవరాజ్ విజయం సాధిచారు.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.