2010 మధ్యలో అనుకుంటా.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి భార్య వైఎస్ విజయమ్మ, కుమార్తె వైఎస్ షర్మిల హైదరాబాద్ నుంచి ఢిల్లీ వచ్చారు. నేరుగా అప్పటి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ నివాసం 10 జన్‌పథ్‌కు వెళ్లారు. వారు కొంచెం టెన్షన్‌గా ఉన్నారు. రాజీవ్ గాంధీ, సోనియాగాంధీతో వైఎస్‌కు ఉన్న మంచి అనుబంధం ఉంది కాబట్టి, తమకు ‘సుస్వాగతం’ లభిస్తుందని భావించారు. కానీ, వారి ఆశలు అడియాశలు అయ్యాయి. వారిని సుమారు 10 - 15 నిమిషాలు వెయిట్ చేయించారు. ఆ తర్వాత డ్రాయింగ్ రూమ్‌కి తీసుకెళ్లారు. ముఖంలో కోపం ఉన్నా.. దాన్ని దాచుకున్న సోనియాగాంధీ వారిని సాదరంగా ఆహ్వానించారు. ఎక్కువసేపు టైమ్ వేస్ట్ చేయకుండా సోనియాగాంధీ సూటిగా పాయింట్ చెప్పేశారు. ‘మీ అబ్బాయి జగన్ మోహన్ రెడ్డిని వెంటనే ఓదార్పు యాత్ర ఆపేయమనండి’. అని ఒక్కమాటలో చెప్పేశారు. 2009 సెప్టెంబర్‌లో హెలికాప్టర్ ప్రమాదంలో వైఎస్ చనిపోవడాన్ని జీర్ణించుకోలేక ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను పరామర్శించాలన్న ఉద్దేశంతో జగన్ ఓదార్పు యాత్ర ప్రారంభించారు. ఓదార్పు యాత్ర సగంలో ఉండగా, దాన్ని ఆపేయాలని సోనియా ఆదేశం. ఓదార్పు యాత్ర ఉద్దేశం ఏంటో సోనియాకు వివరించేందుకు విజయమ్మ ప్రయత్నించారు. కానీ, సోనియాగాంధీ కోపంతో కుర్చీలో నుంచి లేచి ‘షటప్’ అని అరిచారు. అంతే, తల్లీకూతుళ్లకు షాక్. ఘోర అవమానం. మారు మాట్లాడకుండా విజయమ్మ, షర్మిల హైదరాబాద్ వచ్చేశారు ఓ పంతంతో.
వైఎస్ షర్మిల ఎన్నికల ప్రచారం
రాయలసీమలో ఓ నానుడి ఉంటుంది. రెడ్డిలు పగబడితే అది నెరవేరేవరకు నిద్రపోరని. తమ కక్షైనా తీర్చుకుంటారు. తమను తాము బలి చేసుకుంటారు. సోనియాగాంధీకి ఇవేవీ తెలీవు. సోనియా చెప్పిన విషయం విని జగన్ ఖిన్నుడయ్యారు. కాంగ్రెస్‌ను వీడాలని ఆ క్షణమే కుటుంబసభ్యులకు చెప్పేశారు. సొంతంగా పార్టీ పెట్టాలని నిర్ణయించారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీని భస్మం చేసి సోనియాగాంధీ కుటుంబం మీద ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించారు. వైఎస్ మరణం తర్వాత జగన్ ఆ స్థానాన్ని భర్తీ చేయాలనుకున్నారు. కనీసం ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు కావాలనుకున్నారు. కానీ, జగన్‌ను ఎక్కువ ప్రోత్సహించొద్దని కోటరీ చెప్పడంతో సోనియా, రాహుల్ గాంధీ ఈ నిర్ణయానికి వచ్చారు. ఏపీ కాంగ్రెస్, కేబినెట్ మంత్రులు అంతా జగన్ వెంటే ఉన్నారు. కానీ, గాంధీ కుటుంబానికి విధేయుడు అయిన రోశయ్యకు సీఎం పీఠం దక్కింది. రోశయ్య అసమర్థ నాయకత్వాన్ని తనకు అనుకూలంగా మలుచుకున్న కేసీఆర్ ప్రత్యేక తెలంగాణ పోరాటాన్ని అందుకున్నారు. దీంతో కంగారుపడిపోయిన యూపీఏ ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. ఏపీ ప్రజల అభిప్రాయం, ముఖ్యంగా వైఎస్ ఫ్యామిలీ అభిప్రాయం తెలుసుకోకుండా నిర్ణయం తీసుకుంది.
సోనియాగాంధీ, రాహుల్ గాంధీ
2010 అక్టోబర్‌లో సీఎంగా రోశయ్యను తప్పించిన కాంగ్రెస్ హైకమాండ్ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని నియమించింది. దీంతో ఏపీలో కాంగ్రెస్ పని ఖతమైపోయింది. 1947 నుంచి కాంగ్రెస్ కంచుకోట లాంటి ఏపీ హస్తం చేజారిపోయింది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి కొత్త పార్టీ పెట్టారు. కడప ఎంపీ సీటుకు రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో ఘనవిజయం సాధించారు. దీంతో 10 జన్‌పథ్ గుండెల్లో రైళ్లు పరిగెట్టాయి. జగన్ అప్పటికే సక్సెస్ఫుల్ వ్యాపారవేత్త. సిమెంట్ నుంచి మీడియా వరకు సుమారు డజన్ కంపెనీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జగన్, మరికొందరు సన్నిహితులు జైలుకు వెళ్లాల్సివచ్చింది. దీనికి సోనియాగాంధీనే కారణమని జగన్ కుటుంబం ఆరోపించింది. జగన్ మోహన్ రెడ్డి 18 నెలలు చంచల్ గూడ జైల్లో ఉన్నారు. 2013 సెప్టెంబర్‌లో జైలు నుంచి విడుదలయ్యారు. అది జగన్ జీవితంలో అత్యంత కఠిన సమయం. ఆ సమయంలో ఓ వైపు పార్టీ, మరోవైపు వ్యాపార సామ్రాజ్యాన్ని కాపాడుకోవడానికి విజయమ్మ, షర్మిల, భారతిరెడ్డి ఎంతో కష్టపడ్డారు.
స్వీట్లు పంచుకుంటున్న జగన్, భారతిరెడ్డి
వైఎస్ అంటే అభిమానం ఉన్నవారు కూడా గాంధీలంటే భయం వల్ల జగన్‌కు దూరం అవుతూ వచ్చారు. జగన్ జైలు నుంచి బయటకు వచ్చేనాటికి ఏపీలో రాజకీయ ముఖచిత్రం మారిపోయింది. తెలంగాణ ఏర్పాటు ఖాయమైపోయింది. వైసీపీ సందిగ్ధంలో పడింది. తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిన జగన్ ఎన్నికలకు ముందు తీవ్రంగా పోరాడారు. జగన్ దురదృష్టం. అధికారాన్ని దక్కించుకోలేకపోయారు. అయితే, ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు. పార్టీని పునర్నిర్మించారు. చంద్రబాబునాయుడును ఢీకొట్టారు. ప్రధాని మోదీతో సయోధ్యతో సాగారు.
ప్రధాని మోదీతో వైఎస్ జగన్ భేటీ(ఫైల్ ఫోటో)
దేశ రాజకీయాల్లో మోదీ, అమిత్ షా ఎంట్రీ తర్వాత ఎన్నికల్లో పోరాడే తీరు మారిందని జగన్ గ్రహించారు. అందుకే పార్టీ క్యాంపెయిన్, స్ట్రాటజీ కోసం ప్రశాంత్ కిశోర్‌ను నియమించారు. 2014లో నరేంద్ర మోదీ, 2015లో నితీష్ కుమార్‌కు పీకే నేతృత్వంలోని ఐప్యాక్ సేవలు అందించింది. ఢిల్లీలోని ఓ జర్నలిస్ట్ మిత్రుడి ద్వారా ప్రశాంత్ కిశోర్‌ను జగన్ కాంటాక్ట్ అయ్యారు. జగన్ కోసం పనిచేసేందుకు పీకే కూడా ఉత్సుకత చూపారు. యూపీ ఎన్నికల్లో ఎస్పీ - కాంగ్రెస్‌తో ఉన్న అగ్రిమెంట్ పూర్తయ్యాక ఐప్యాక్ టీమ్ హైదరాబాద్‌లోని జగన్‌కు చెందిన ఓ బిల్డింగ్‌లో ఆఫీస్ ఏర్పాటు చేసుకుంది. 100 మందికి పైగా ఐప్యాక్ బృందం దాదాపు రెండేళ్ల పాటు జగన్ కోసం పనిచేసింది. జగన్ తరఫున వ్యూహాలు, ప్రచారం చేసింది. మరోవైపు ప్రజల మద్దతు కూడగట్టేందుకు జగన్ పాదయాత్ర చేశారు. 13 జిల్లాల్లో341 రోజుల పాటు 3648 కిలోమీటర్లు నడిచారు. పాదయాత్ర సందర్భంగా ఓ దశలో జగన్ చావు నుంచి బయటపడ్డారు. విశాఖ విమానాశ్రయంలో జగన్ మీద కోడికత్తితో దాడి జరిగింది. జగన్ చిన్న గాయంతో బయటపడ్డారు.
విశాఖ విమానాశ్రయంలో జగన్‌పై దాడి జరిగినప్పటి ఫొటో
ఎన్నికలకు ఏడాది ముందు ఎన్డీయే నుంచి టీడీపీ బయటకు వచ్చింది. ఏపీకి మోదీ సరైన న్యాయం చేయడం లేదని ఆరోపించిన చంద్రబాబు కాంగ్రెస్‌తో జట్టుకట్టారు. ఆ తర్వాత తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ - టీడీపీ కూటమి ఘోర పరాజయం చెందింది. ఏపీలో కూడా తొలిసారి చంద్రబాబునాయుడు ఒంటరిగా బరిలో దిగారు. జనసేనతో పొత్తుపెట్టుకుంటే మంచిదని చాలా మంది సలహా ఇచ్చినా జగన్ లైట్ తీసుకున్నారు. ప్రజలు తన వైపు నిలుస్తారని నమ్మారు. జగన్ నమ్మకం వమ్ముకాలేదు. మే 23న ఫలితాలు రాజకీయ పండితులు ఊహించని విధంగా వచ్చాయి. జగన్ కూడా ఊహించని ఫలితాలు వచ్చాయి. ఎన్నికల్లో ఘన విజయంపై న్యూస్18తో మాట్లాడిన జగన్ వినయంతో స్పందించారు.
జగన్‌ను ఆశీర్వదిస్తున్న తిరుమల తిరుపతి దేవస్థానం వేదపండితులు
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ క్లిష్ట పరిస్థితుల్లో, జంక్షన్లో ఉంది. విభజన తర్వాత వనరులు తగ్గిపోయాయి. జగన్ మాత్రం ఓటర్లకు ఏకంగా చందమామను హామీ ఇచ్చారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చడం జగన్ ముందున్న పెద్ద సవాల్. అమరావతి నిర్మాణం పూర్తి చేయాలి. తాను ఇవన్నీ పూర్తిచేయగలనని జగన్ నమ్ముతున్నారు. పదేళ్లలో కింద నుంచి పైకొచ్చారు. మరోవైపు జగన్ కష్టాలకు కారకులైన గాంధీ కుటుంబం దేశ రాజకీయాల్లో దాదాపు అంతరించిపోయే స్థితికి వచ్చింది. తాను కాంగ్రెస్‌ను, గాంధీ కుటుంబాన్ని క్షమించానని జగన్ చెప్పి ఉండొచ్చు. కానీ, అది దేవుడు చేసిన న్యాయం అని ఆయన సన్నిహితులు చెబుతారు. కొందరైతే ఆంధ్రప్రదేశ్ ప్రజల శాపం అని కూడా అంటారు. క్రైస్తవాన్ని నమ్మి ఆచరించే జగన్ మోహన్ రెడ్డి దీన్ని దేవుడు చేసిన న్యాయం అనడానికి ఒప్పుకుంటారేమో. ప్రజల శాపం అంటే మాత్రం ఒప్పుకోకపోవచ్చు.
(రచయిత: డీపీ సతీష్, సౌత్ హెడ్, న్యూస్18)
Published by:Ashok Kumar Bonepalli
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.