కోడెల ఆత్మహత్యకు దారితీసిన కారణాలివేనా ?

Kodela sucidie | కోడెల ఆత్మహత్యకు కారణమేంటనే అంశంపై రాజకీయవర్గాల్లో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఆయన మనస్థాపానికి గురికావడంలో కేసులతో పాటు సొంత పార్టీ పాత్ర కూడా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

news18-telugu
Updated: September 17, 2019, 1:12 PM IST
కోడెల ఆత్మహత్యకు దారితీసిన కారణాలివేనా ?
కోడెల శివప్రసాదరావు (File)
  • Share this:
ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద రావు ఆత్మహత్య ఉదంతం తెలుగు రాష్ఠ్రాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. అయితే కోడెల ఆత్మహత్యకు దారితీసిన పరీస్ధితులు మాత్రం రాజకీయాల్లో కొనసాగాలనుకునే సగటు నేతలకు మాత్రం ఎన్నో పాఠాలు నేర్పేలా ఉంది. ఏడాదికో పార్టీలో దర్శనమిచ్చే రాజకీయ నేతలున్న కాలంలో దశాబ్దాలపాటు పార్టీకి అండగా నిలబడిన నేతకు ఆ పార్టీ కష్టకాలంలో ఏ మేరకు అండగా నిలిచింది, అధికార పార్టీ రాజకీయంగా వేధిస్తున్నప్పుడు తమ పార్టీకి చెందిన సీనియర్ నేతకు కనీస స్థైర్యాన్ని ఎందుకు ఇవ్వలేకపోయింది. కోడెల మరణానికి ముందు వేధింపులపై స్పందించకుండా చట్టం తన పని తాను చేసుకుపోతుందంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఏ సంకేతాలు ఇచ్చాయి.

ఏపీ రాజకీయాల్లో, ప్రత్యేకంగా పల్నాడు ప్రాంత రాజకీయాలపై తనదైన ముద్ర వేసిన మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుటుంబ సభ్యుల అక్రమాలు ఓవైపు, ప్రభుత్వ కేసులు మరోవైపు, ఇన్నాళ్లూ తాను మోసిన పార్టీ నుంచి మద్దతు లేకపోవడం వంటి కారణాల నేపథ్యంలో ఆత్మహత్య చేసుకున్నట్లుగా అర్ధమవుతోంది. కోడెల ఆత్మహత్యపై నిన్నటి నుంచీ టీడీపీ, వైసీపీ నేతల మధ్య పరస్పర ఆరోపణల పర్వం కొనసాగుతోంది. ఇందులో టీడీపీ ప్రదానంగా వైసీపీ ప్రభుత్వం వరుస కేసులతో వేధించడం వల్లే కోడెల మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు విమర్శిస్తోంది. అయితే కోడెల ఇప్పటికే ఈ కేసులను తాను చట్టపరంగా ఎదుర్కొంటానని ప్రకటించడంతో పాటు హైకోర్టులో ముందస్తు బెయిల్ కూడా తెచ్చుకున్నారు.

అసెంబ్లీ ఫర్నిచర్ వ్యవహారంలో మాత్రమే ఆయనపై నేరుగా కేసు నమోదైంది. మిగతా కేసుల్లో ఆయన కుమారుడు, కుమార్తె సత్తెనపల్లిలో జనాన్ని వేధించడం, వసూళ్లకు పాల్పడటం వంటి కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో కోడెల తనపై నమోదైన కేసు కంటే కూడా కుటుంబ సభ్యులు సాగించిన అరాచకాల వల్లే తాను అప్రతిష్ట పాలైనట్లు భావించారు. ఇదే అంశంపై కొన్ని రోజులుగా కుటుంబ సభ్యులతో ఆయన పలుమార్లు వాగ్వాదానికి కూడా దిగారు. అదే సమయంలో పార్టీ నుంచి తనకు సరైన సహకారం అందలేదనే అంశంపైనా కోడెల తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. పదిరోజులుగా హైదరాబాద్ లో ఉంటూనే అధినేత చంద్రబాబు అపాయింట్ మెంట్ కోసం ఆయన ఎదురుచూసినట్లు మంత్రి కొడాలి నాని ఇవాళ వెల్లడించారు.

కోడెల ఆత్మహత్యకు దారితీసిన పరిస్ధితుల్లో ప్రధాన మైనది ఆయన ఇన్నాళ్లుగా మోసిన పార్టీ నుంచీ కేసుల విషయంలో తనకు ఎలాంటి మద్దతు లభించకపోవడం, అదే సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీకి చెందిన చింతమనేని, కూన రవికుమార్, యరపతినేని శ్రీనివాసరావు వంటి ఇతర నేతల విషయంలో మద్దతుగా ప్రకటనలు చేయడం, కోడెల విషయానికి వచ్చేసరికీ చట్టం తన పని తాను చేసుకుపోతుందని వ్యాఖ్యానించడం వంటి అంశాలు ఆయన్ను తీవ్రంగా ఇబ్బందిపెట్టినట్లు తెలుస్తోంది. దీంతో పాటు పల్నాడులో తాజాగా టీడీపీ చేపట్టిన ఆందోళనలకూ కోడెలను టీడీపీ ఆహ్వానించకపోవడంపైనా ఆయన మనస్తాపం చెందారు.

ఇదే అంశాన్ని స్వయంగా చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లాలని భావించిన కోడెల హైదరాబాద్ వెళ్లినట్లు తెలుస్తోంది. అక్కడ కూడా అపాయింట్ మెంట్ దొరక్కపోవడంతో తీవ్ర ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. ఇలా కోడెల వ్యవహారంలో వైసీపీ కేసులతో మొదలైన వేధింపుల పర్వం, టీడీపీ పట్టించుకోకపోవడం, కుటుంబ సభ్యుల చర్యల వల్ల తాను అప్రతిష్ట పాలైనట్లు ఆయన భావించే దాకా వచ్చి చివరికి ఆత్మహత్యతో ముగిసినట్లయింది.

సయ్యద్ అహ్మద్, సీనియర్ కరెస్పాండెంట్, విజయవాడFirst published: September 17, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading