news18-telugu
Updated: May 16, 2019, 12:05 PM IST
వైసీపీ ఎమ్మెల్యే రోజా (ఫైల్ ఫోటో)
వైసీపీ అధికారంలోకి వస్తే ఎవరెవరికి మంత్రి పదవులు దక్కుతాయనే అంశంపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే వైసీపీ కీలక నేత, నగరి ఎమ్మెల్యే రోజాకు మంత్రి పదవి గ్యారంటీ అంటూ టాక్ వినిపించింది. రోజాకు జగన్ కేబినెట్లో ముఖ్యమైన పదవి లభిస్తుందని మొదట్లో ప్రచారం జరిగింది. అయితే చిత్తూరు జిల్లా నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి జగన్ కేబినెట్లో ఫస్ట్ ప్రయారిటీ ఉంటుందని... ఆ తరువాతే రోజా పేరును వైసీపీ అధినాయకత్వం పరిశీలిస్తోందని పలువురు చర్చించుకుంటున్నారు. అయితే వైసీపీ అధికారంలోకి వస్తే తన పరిస్థితి ఏమిటనే దానిపై వస్తున్న ఊహాగానాలపై రోజా స్పందించకపోవడం కూడా చర్చనీయాంశంగా మారింది.
తనకు మంత్రి పదవి ఖాయం అంటూ వస్తున్న వార్తలపై ఆ పార్టీ ఎమ్మెల్యేల్లో ఒకరైన కొడాలి నాని స్పందించారు. జగన్ ఏం నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని... పరోక్షంగా తనకు మంత్రి పదవి ఇచ్చే విషయంపై జగన్‌దే తుది నిర్ణయమని ఆయన తేల్చేశారు. నిజానికి రోజా కూడా తనపై వస్తున్న ఊహాగానాలకు ఇలాంటి సమాధానం ఇస్తారని వైసీపీ వర్గాలు భావించాయి. కానీ ఆమె మాత్రం తనపై వస్తున్న వార్తలపై స్పందించకపోవడం విశేషం.
అయితే వైసీపీ అధికారంలోకి వస్తే తన పొజిషన్ ఏమిటనే విషయంలో రోజాకు అవగాహన ఉందని... ఈ విషయంలోఇప్పటికే ఆమెకు జగన్ నుంచి క్లారిటీ కూడా వచ్చిందనే టాక్ వినిపిస్తోంది. ఈ కారణంగానే తనపై వస్తున్న ఊహాగానాలకు ఆమె స్పందించడం లేదనే వైసీపీలోని కొందరు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ఫలితాలు వచ్చి... తన గెలుపు ఖాయమైన తరువాతే తనపై వస్తున్న వార్తలపై రోజా స్పందించే అవకాశం ఉందనే ప్రచారం కూడా ఉంది.
Published by:
Kishore Akkaladevi
First published:
May 16, 2019, 12:03 PM IST