CM KCR: ఢిల్లీ నుంచి తిరిగొచ్చాక కేసీఆర్ రివర్స్ గేర్.. అసలు కారణం ఇదన్నమాట..!?

నరేంద్రమోదీ, కేసీఆర్ (ఫైల్ ఫోటో)

ఢిల్లీకి వెళ్లొచ్చిన తర్వాత తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్ణయాల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి.. ఇంత వేగంగా కేసీఆర్ తన వైఖరిని మార్చుకోవడానికి కారణమేమిటబ్బా అని... టీఆర్ఎస్ కార్యకర్తల్లో ఆలోచన మొదలైంది..

 • Share this:
  ‘కేంద్రం చెబుతున్న ఆయుష్మాన్ భారత్ కంటే... మనం తెలంగాణలో అమలు చేస్తున్న ఆరోగ్య శ్రీయే వెయ్యి రెట్లు బెటర్..’ ఇదీ గతంలో కేసీఆర్ పలుమార్లు చెప్పిన మాటలు.. పేదలకు ఎంతో మేలు చేసే ఆయుష్మాన్ భారత్ పథకాన్ని రాష్ట్రంలో ఎందుకు అమలుచేయరని తెలంగాణ బీజేపీ నేతలు ప్రశ్నిస్తే.. దానికి గులాబీ బాస్ ఇచ్చిన సమాధానం.. ’ఢిల్లీలో గత్తర లేపుతా.. డిసెంబర్ రెండో వారంలో దేశంలోని ప్రాంతీయ పార్టీల నేతలతో మీటింగ్ పెడతా..? దేశాన్ని నాశనం చేస్తున్నారు.. ప్రభుత్వ ఆస్తులను బీజేపీ సర్కారు ధ్వసం చేస్తోంది..‘... ఇది మొన్న మొన్న జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కేసీఆర్ చేసిన సంచలన ప్రకటన.. కేంద్రం కొత్తగా ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టాలు కాస్త వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే.. ఈ వ్యవసాయ చట్టాలు రైతులకు మేలు చేసేవే అంటూ కేంద్రం పదే పదే తేల్చిచెబుతున్నా రైతులు నిరసనలను ఆపడం లేదు. రైతులు దేశవ్యాప్తంగా డిసెంబర్ 8న భారత్ బంద్ నిర్వహించిన సంగతి తెలిసిందే.. ఈ బంద్ కు టీఆర్ఎస్ సర్కారు కూడా మద్దతు పలికింది.. కేటీఆర్, హరీశ్, కవిత.. వంటి కీలక నేతలు ఆ బంద్ లో ప్రత్యక్షంగా పాల్గొన్నారు కూడా..

  కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది.. ఢిల్లీలో గత్తర లేపే పనికి గులాబీ దళపతి పులుస్టాప్ పెట్టేశారు.. ఫ్రంట్, కూటమి తరహా ఆలోచనలను వెయ్యి అడుగుల గోతిలో పూడ్చేశారు.. పనిలో పనిగా.. అప్పట్లో ససేమిరా అని చెప్పిన ఆయుష్మాన్ భారత్ పథకాన్ని తెలంగాణలో అమలు చేసేందుకు ఆదేశాలు కూడా జారీ అయ్యాయి.. వ్యవసాయ చట్టాల అమలుకు కూడా కేసీఆర్ సై అంటున్నారు.. ఢిల్లీకి వెళ్లొచ్చిన తర్వాతే కేసీఆర్ నిర్ణయాల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి.. ఇంత వేగంగా కేసీఆర్ తన వైఖరిని మార్చుకోవడానికి కారణమేమిటబ్బా అని... టీఆర్ఎస్ కార్యకర్తల్లో ఆలోచన మొదలైంది..

  అటు కేంద్రం విషయంలోనే కాదు.. రాష్ట్రంలో పరిపాలన విషయంలో తన మునుపటి వైఖరికి పూర్తి భిన్నంగా వెళ్తున్నారు.. మీకు గుర్తుందో లేదో... ఆర్టీసీ కార్మికుల సమ్మె జరిగినప్పుడు కేసీఆర్ ఎంతో మొండి వైఖరిని ప్రదర్శించారు.. ఆర్టీసీ కార్మికులతో అసలు చర్చలకే వెళ్లలేదు.. చివరకు ఆర్టీసీ కార్మికులే దిగిరావాల్సిన పరిస్థితి.. కానీ ప్రస్తుతం కేసీఆర్ తన నిర్ణయాలపై వ్యతిరేకత వస్తోంటే.. వాటిని మార్చుకునేందుకే మొగ్గుచూపుతున్నారు.. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లను తిరిగి పాత పద్దతిలోనే కొనసాగించేందుకు ఓకే చెప్పారు.. ఎల్ఆర్ఎస్ పై వెనక్కి తగ్గారు.. ఫలనా పంటే వేయాలంటూ రైతులకు ఆదేశాలు జారీ చేసే నియంత్రిత సాగుపై కూడా పునరాలోచన చేస్తున్నారు.. రైతులు తమకు ఇష్టమైన సాగు చేయొచ్చని తేల్చిచెబుతున్నారు..

  అంతే కాదు.. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికలతో తమపై ప్రభుత్వ ఉద్యోగులు గుర్రుగా ఉన్న విషయాన్ని కేసీఆర్ గ్రహించారు.. అందుకే వారిని దగ్గర చేసుకునేందుకు ప్రయత్నాలను మొదలుపెట్టారు.. ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలను పెంచేందుకు ఓకే చెప్పారు.. ఉద్యోగుల పదవీ విరమణ వయసును కూడా పెంచబోతున్నారు.. పదోన్నతులకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.. ఆర్టీసీ ఉద్యోగుల జీతాలను పెంచబోతున్నారు.. దాని వల్ల కలిగే అదనపు భారాన్ని కూడా ప్రభుత్వమే భరించనుంది.. హోంగార్డులు, అంగన్ వాడీ వర్కర్లు,, ఆశా వర్కర్లు, విద్యావలంటీర్లు, కాంట్రాక్టు వర్కర్లు, పెన్షనర్లు.. ఇలా.. ఏకంగా దాదాపు పది లక్షల మందికి ప్రయోజనం చేకూర్చేలా నిర్ణయాలను తీసుకోబోతున్నారు.. వచ్చే ఫిబ్రవరిలో ఉద్యోగ నియామకాల నోటిఫికేషన్ ను విడుదల చేయబోతున్నారు..

  ఢిల్లీకి వెళ్లి వచ్చిన తర్వాతే.. గులాబీ సర్కారు నుంచి ఇన్ని నిర్ణయాలు వెలువడ్డాయి.. 2020లో జమిలీ ఎన్నికలు జరుగుతాయన్న సమాచారం కేసీఆర్ కు అంది ఉంటుందనీ.. అందుకే ప్రభుత్వంపై వ్యతిరేకతను తగ్గించుకునేందుకు, వరుసగా మూడోసారి కూడా సీఎం అయ్యేందుకు కేసీఆర్ ఇలాంటి సంచలన నిర్ణయాలను తీసుకుంటున్నారని.. ఆయా విషయాల్లో తన వైఖరిని మార్చుకుంటున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.. అదే విధంగా బీజేపీతో కయ్యానికి కాలు దువ్వడం కంటే.. కేంద్రంతో సన్నిహితంగా ఉండటమే మేలనీ.. తద్వారా రాష్ట్రంలో బీజేపీ నేతలు ఎన్ని విమర్శలు చేసినా ..జనాలు పట్టించుకోరన్నది కేసీఆర్ ఆలోచనగా చెబుతున్నారు.. మరి భవిష్యత్తులోనూ ఇదే విధమైన వైఖరిని కేసీఆర్ ప్రదర్శిస్తారా..? తెలంగాణ బీజేపీ బాస్ బండి సంజయ్ దూకుడును తగ్గిస్తారా..? బీజేపీ జాతీయ నేతల వ్యూహమేంటి..? అన్న ప్రశ్నలకు కాలమే సమాధానం చెబుతుంది.
  Published by:Nikhil Kumar S
  First published: