తెలంగాణలో మరోసారి ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన లేదని.. ప్రభుత్వం పూర్తికాలం ఉంటుందని కొద్దిరోజుల క్రితం సీఎం కేసీఆర్ తమ పార్టీ ఎమ్మెల్యేలకు క్లారిటీ ఇచ్చారు. అయితే కేసీఆర్ తమ నేతలకు ఈ రకమైన క్లారిటీ ఇవ్వాల్సి రావడం వెనుక అసలు కారణంగా రేవంత్ రెడ్డి అనే చెప్పాలి. టీపీసీసీ చీఫ్‌గా బాధ్యతలు తీసుకున్న తరువాత కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతున్న రేవంత్ రెడ్డి.. మరోసారి కేసీఆర్ ముందుస్తు ఎన్నికలకు వెళతారని అన్నారు. ఆయన కామెంట్స్ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను టెన్షన్ పెట్టాయి. ఏకంగా ఈ విషయాన్ని కేసీఆర్ ముందే ప్రస్తావించేలా చేశాయి. అయితే కేసీఆర్ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చినప్పటికీ.. రేవంత్ రెడ్డి మాత్రం మళ్లీ ముందస్తు గురించి మాట్లాడటం ఆపలేటు. వచ్చే ఆగస్టు తరువాత కేసీఆర్ కచ్చితంగా అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళతారని మరోసారి ఓ ఇంటర్వ్యూలో జోస్యం చెప్పారు.
దీన్ని బట్టి తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు మరో ఏడాది మాత్రమే సమయం ఉందని అంచనా వేశారు. అయితే కేసీఆర్ చెప్పినా.. రేవంత్ రెడ్డి మాత్రం ఈ విషయంలో ఎందుకు అదే వాదన వినిపిస్తున్నారనే అంశంపై రాజకీయవర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపాలంటే.. ఎన్నికలు మరెంతో దూరంలో లేవని చెప్పాల్సి ఉంటుంది. ఈ కారణంగా రేవంత్ రెడ్డి ఈ రకమైన వాదనను గట్టిగా వినిపిస్తున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే రేవంత్ రెడ్డి ఈ రకమైన వాదన చేయడం వెనుక మరో కారణంగా కూడా ఉండొచ్చని పలువురు భావిస్తున్నారు.
ఎన్నికలు తొందరగానే వస్తాయనే ప్రచారం జరిగితే కాంగ్రెస్ పార్టీకి మేలు జరుగుతుందనే భావనలో రేవంత్ రెడ్డి అన్నారనే టాక్ వినిపిస్తోంది. అలా చేయడం వల్ల పార్టీ మారే నాయకులు, ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్‌లోకి రావాలనుకుంటున్న నేతలు తొందరగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. కొన్నేళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి అనేక మంది నేతలు ఇతర పార్టీలోకి వెళ్లిపోయారు. వారిలో కొందరు మళ్లీ కాంగ్రెస్‌లోకి రావాలని అనుకుంటున్నారు. అయితే ఎన్నికలకు మరికొంతకాలం సమయం ఉండటంతో.. చాలామంది నేతలు వేచి చూసే ధోరణిని అవలంభిస్తున్నారు.
Etela Rajendar: పిచ్చి పట్టిందా హరీశ్ ?.. దానితో నాకేం సంబంధం.. మండిపడ్డ ఈటల రాజేందర్
Revanth Reddy ముందస్తు వ్యూహం.. KCR ప్లాన్‌కు కౌంటర్.. Congress హైకమాండ్ ఓకే చెబుతుందా ?
అలాంటి వాళ్లు సాధ్యమైనంత తొందరగా నిర్ణయం తీసుకుని పార్టీలోకి రావాలంటే.. వచ్చే ఏడాది తెలంగాణలో ఎన్నికలు జరుగుతాయనే వాతావరణం కల్పించాలని రేవంత్ రెడ్డి భావించి ఉండొచ్చనే చర్చ కూడా సాగుతోంది. అయితే కేసీఆర్ ఆలోచన విషయంలో రేవంత్ రెడ్డి ఉన్నంత ధీమాగా బీజేపీ నేతలు మాత్రం కనిపించడం లేదని వాదన కూడా ఉంది. మొత్తానికి తెలంగాణలో కచ్చితంగా ముందస్తు ఎన్నికలు వస్తాయని చెబుతున్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు వెనుక ఉన్న అసలు వ్యూహం ఏమిటన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ అనే చెప్పాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Congress, Revanth Reddy, Telangana