ఢిల్లీపై కేటీఆర్ గరంగరం... కేసీఆరే కారణం ?

సీఎం కేసీఆర్‌కు ఉద్దేశపూర్వకంగానే ప్రధాని మోదీ అపాయింట్‌మెంట్ ఇవ్వలేదని టీఆర్ఎస్ భావిస్తోందా ? ఈ కారణంగానే కేంద్రం తెలంగాణపై వివక్ష చూపిస్తోందని కేటీఆర్ అన్నారా ? అనే అంశంపై రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.

news18-telugu
Updated: December 4, 2019, 3:59 PM IST
ఢిల్లీపై కేటీఆర్ గరంగరం... కేసీఆరే కారణం ?
కేటీఆర్, కేసీఆర్
  • Share this:
తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేంద్రంపై ఒక్కసారిగా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్రం తెలంగాణను పట్టించుకోవడం లేదని అన్నారు. రాజకీయ కారణాలతోనే కేంద్రం ఈ రకంగా వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. తెలంగాణకు రావాల్సిన అనేక ప్రాజెక్టులు రావడం లేదని... చాలా ప్రాజెక్టులు పెండింగ్‌లో ఉన్నాయని ఆయన అన్నారు. అభివృద్ధి కేవలం నాగ్‌పూర్‌కేనా ? అని కేటీఆర్ కామెంట్ చేశారు. దక్షిణాదిపై కేంద్రం వివక్ష చూపిస్తోందని అన్నారు. అభివృద్ధిని కేవలం గుజరాత్, మహారాష్ట్ర, చెన్నై వంటి నగరాలకు మాత్రమే పరిమితం చేస్తున్నారని... ప్రపంచస్థాయి మౌలిక వసతులు ఉన్న హైదరాబాద్‌కు అంతగా ప్రాధాన్యత ఇవ్వడం లేదని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

అయితే కేటీఆర్ ఉన్నట్టుండి కేంద్రంపై ఈ రకమైన వ్యాఖ్యలు ఎందుకు చేశారనే అంశం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మరోవైపు సీఎం కేసీఆర్ టూర్ కారణంగానే కేటీఆర్ ఈ రకమైన వ్యాఖ్యలు చేసి ఉండొచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఓ ప్రైవేటు కార్యక్రమం కోసం ఢిల్లీ వెళ్లిన సీఎం కేసీఆర్ ప్రధానితో సహా కేంద్రమంత్రులను కలిసి తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టులు, నిధుల గురించి చర్చించాలని భావించారు. అయితే కొన్ని కారణాల వల్ల ప్రధాని మోదీ అపాయింట్ మెంట్ కేసీఆర్‌కు లభించలేదు. తన ఢిల్లీ పర్యటనలో కేంద్రమంత్రులెవరినీ సీఎం కేసీఆర్ కలవలేదు.

సీఎం కేసీఆర్‌కు ఉద్దేశపూర్వకంగానే ప్రధాని మోదీ అపాయింట్‌మెంట్ ఇవ్వలేదని టీఆర్ఎస్ భావిస్తోందా ? ఈ కారణంగానే కేంద్రం తెలంగాణపై వివక్ష చూపిస్తోందని కేటీఆర్ అన్నారా ? అనే అంశంపై రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. మరోవైపు రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో తమకు కాంగ్రెస్ కంటే బీజేపీతోనే గట్టి పోటీ ఉంటుందని భావిస్తున్న టీఆర్ఎస్... ఇప్పటి నుంచే బీజేపీ తెలంగాణకు ఏమీ చేయడం లేదనే వాదనను తెరపైకి తీసుకొచ్చిందా ? అనే వాదన కూడా వినిపిస్తోంది. మొత్తానికి కేటీఆర్ ఉన్నట్టుండి కేంద్రంపై అసంతృప్తి వ్యక్తం చేయడం వెనుక అసలు కారణం ఏమిటన్నది ప్రస్తుతానికి సస్పెన్సే.



First published: December 4, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...