కవిత ఓటమి... సొంత పార్టీ ఎమ్మెల్యేలే కారణమా ?

కల్వకుంట్ల కవిత

కవిత గెలుపు కోసం జిల్లా మంత్రి ప్రశాంత్ రెడ్డి కూడా బాగా కష్టపడ్డారు. అయినా ఫలితం మాత్రం టీఆర్ఎస్‌కు ప్రతికూలంగా వచ్చింది. ఆమె అనూహ్యంగా ఓటమి పాలయ్యారు.

  • Share this:
    తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో ఎన్నో ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి. అందులో నిజామాబాద్ సిట్టింగ్ ఎంపీ, కేసీఆర్ కుమార్తె కవిత ఓటమి చెందడం ముఖ్యమైనదిగా చెప్పాలి. 180 మంది రైతులు పోటీలో నిలవడంతో నిజామాబాద్ ఫలితం ఆసక్తికరంగా మారింది. అయితే టీఆర్ఎస్‌కు ప్రత్యర్థి పార్టీలైన కాంగ్రెస్, టీఆర్ఎస్‌లు అంత బలంగా లేకపోవడంతో... కాస్త ఇబ్బందులు వచ్చినా గెలుపు తమదే అని భావించాయి టీఆర్ఎస్ వర్గాలు. తన గెలుపు కోసం టీఆర్ఎస్ ఎంపీ కవిత ఎంతగానో శ్రమించింది. రైతుల కోపాన్ని చల్లార్చేందుకు ప్రయత్నించారు. ఎక్కడెక్కడ తనకు అత్యధిక ఓట్లు వస్తాయనే విషయాన్ని గమనించి...ఆయా స్థానాలపై ఆమె ఎక్కువగా దృష్టి పెట్టారు.

    కవిత గెలుపు కోసం జిల్లా మంత్రి ప్రశాంత్ రెడ్డి కూడా బాగా కష్టపడ్డారు. అయినా ఫలితం మాత్రం టీఆర్ఎస్‌కు ప్రతికూలంగా వచ్చింది. ఆమె అనూహ్యంగా ఓటమి పాలయ్యారు. అయితే కవిత ఓటమికి కారణమేంటనే దానిపై టీఆర్ఎస్ వర్గాల్లో రకరకాలుగా చర్చ జరుగుతోంది. లోక్ సభ నియోజకవర్గం పరిధిలోని ఎమ్మెల్యేలు నిర్లక్ష్యం కారణంగానే కవిత ఓటమి పాలయ్యారనే వాదన టీఆర్ఎస్‌లో వినిపిస్తోంది. కవిత గెలుపు కోసం ఎమ్మెల్యేలు అంతగా కష్టపడలేదని... అంతా ఆమే చూసుకుంటారనే విధంగా పలువురు ఎమ్మెల్యేలు వ్యవహరించారని తెలుస్తోంది. రైతుల అసంతృప్తిని క్యాష్ చేసుకునేందుకు బీజేపీ ప్రయత్నించడంతో పాటు కాంగ్రెస్ నేతలు కూడా బీజేపీకి సహకరించారనే ప్రచారం జరిగింది.

    అయితే దీనిపై ముందస్తుగానే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సమాచారం ఉన్నా... వాళ్లెవరూ ఇలాంటి ప్రయత్నాలను అడ్డుకోలేకపోయారని తెలుస్తోంది. కొన్ని నియోజకవర్గాల్లో తమకు అంతగా ఓట్లు రావని భావించిన టీఆర్ఎస్... ఆ నష్టాన్ని జగిత్యాల, కోరుట్ల, నిజామాబాద్, నిజామాబాద్ రూరల్ వంటి నియోజకవర్గాల్లో భర్తీ చేసుకోవాలని భావించింది. అయితే ఈ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలెవరూ అందుకు తగ్గట్టుగా పని చేయలేదని టీఆర్ఎస్ భావిస్తోంది. కౌంటింగ్ ప్రక్రియ పూర్తయిన తరువాత ఏ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్ని ఓట్లు వస్తాయో... బీజేపీకి ఎక్కడ ఎక్కువ ఓట్లు వచ్చాయనే విషయాన్ని పరిశీలించిన తరువాతే... కవిత విజయానికి కృషి చేయని వారెవరో గుర్తించాలని టీఆర్ఎస్ భావిస్తున్నట్టు టీఆర్ఎస్ వర్గాలు చర్చించుకుంటున్నాయి.


    First published: