REASON BEHIND GANNAVARAM MLA VALLABHANENI VAMSI RESIGNATION SK
వల్లభనేని వంశీ రాజీనామా వెనక అసలు వ్యూహం ఇదేనా..?
వల్లభనేని వంశీ మోహన్(File)
మధ్యే మార్గంగా వంశీ రాజీనామా చేయడం, దాన్ని ఆమోదించకుండా వదిలేయడం ద్వారా ఆయన్ను టీడీపీ సభ్యుడిగా కాకుండా, స్వతంత్ర సభ్యుడిగా కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
దీపావళి వేళ ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. అంతా ఊహించినట్లుగానే గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ టీడీపీకి షాకిచ్చారు. తాజాగా సీఎం జగన్ తో సమావేశం తర్వాత దీపావళి ముగిశాక తన నిర్ణయం ప్రకటిస్తానని చెప్పిన వంశీ... దానికి తగినట్లుగానే టీడీపీకి గుడ్ బై చెప్పారు. అనుచరులపై కేసులు, వేధింపుల నేపథ్యంలో వారిని ఇబ్బంది పెట్టడం ఇష్టంలేకే ఎమ్మెల్యే పదవికీ, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి గుడ్ బై చెబుతున్నట్లు అధినేత చంద్రబాబుకు పంపిన వాట్సాప్ లేఖలో ప్రకటించారు. అదే సమయంలో రాజకీయాల నుంచి కూడా తప్పుకుంటున్నట్లు వంశీ తన లేఖలో చెప్పడం ఈ మొత్తం వ్యవహారానికి పెద్ద ట్విస్ట్ గా చెప్పవచ్చు.
మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో గన్నవరంలో వైసీపీ అభ్యర్ధి యార్లగడ్డ వెంకట్రావుపై 800 ఓట్ల తేడాతో గెలిచిన వల్లభనేని వంశీమోహన్.. నకిలీ పట్టాల పంపిణీ వ్యవహారంలో ప్రభుత్వం నుంచి ఎదురవుతున్న వేధింపులతో వ్యూహాత్మక అడుగులు వేయడం ప్రారంభించారు. పార్టీ మారేందుకు వీలుగా వైసీపీ సర్కారులో మంత్రులుగా ఉన్న తన పాత స్నేహితులు కొడాలి నాని, పేర్నినానితో తెరవెనుక సంప్రదింపులు ప్రారంభించిన వంశీ.. చివరి అడుగుగా సీఎ జగన్ తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో వైసీపీలో చేరేందుకు తన ఆసక్తిని జగన్ వద్ద ఆయన వ్యక్తం చేశారు. అయితే వైసీపీలో చేరేందుకు ఆ పార్టీ విధించిన రాజీనామా నిబంధన, భవిష్యత్తుపై హామీ ఇస్తే అందుకు తాను సిద్దమేనని వంశీ సీఎం జగన్ కు తెలిపారు. దీంతో ముందు టీడీపీకి రాజీనామా చేయమని, ఆ తర్వాత చూద్దామని జగన్ వంశీకి చెప్పినట్లు తెలుస్తోంది. టీడీపీ ఎమ్మెల్యేగా కొనసాగితే బీజేపీలోకి చేరమని పెరుగుతున్న ఒత్తిళ్లు, తనతో పాటు అనుచరులపై పోలీసు కేసుల వేధింపులు, ఇతర కారణాల నేపథ్యంలో వంశీ ఆ పదవిని వదులుకుంటున్నట్లు సమాచారం.
అయితే వైసీపీ పెద్దల నుంచి భవిష్యత్తుపై హామీ లభించిన నేపథ్యంలోనే వంశీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాననే ప్రతిపాదనను పార్టీ అధినేత చంద్రబాబుకు పంపినట్లు అర్ధమవుతోంది. దీంతో పాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్లు చంద్రబాబుకు రాసిన లేఖలో వంశీ తెలిపారు. పార్టీ సభ్యత్వం వరకూ అయితే చంద్రబాబుకు పంపిన లేఖ సరిపోతుంది. కానీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలంటే స్పీకర్ కు నిర్ణీత ఫార్మాట్ లో రాజీనామా లేఖను పంపాల్సి ఉంది. అది ఎప్పుడు పంపుతారన్న దానిపై వంశీ క్లారిటీ ఇవ్వలేదు. కానీ టీడీపీ ద్వారా సంక్రమించిన పదవికి రాజీనామా చేస్తున్నట్లు మాత్రం వంశీ పార్టీ అధినేతకూ, మిగతా వారికీ తెలిసేటట్లు ఓ లేఖ మాత్రం పంపి వదిలేశారు. దీన్ని బట్టి ఆయన వెంటనే వైసీపీ తీర్ధం పుచ్చుకునే అవకాశాలు లేకపోవచ్చనే తెలుస్తోంది.
ప్రస్తుతం వైసీపీలో వంశీ రాకపై గన్నవరం నియోజకవర్గ ఇన్ ఛార్జ్ యార్లగడ్డ వెంకట్రావు, ఆయన అనుచరుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది. అదే సమయంలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా ఆయన్ను వైసీపీలో చేర్చుకుంటే జగన్ చెబుతున్న నైతికత, విలువలకూ అర్ధం లేకుండా పోతుంది. గత టీడీపీ సర్కారు తన పార్టీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను చేర్చుకుని మంత్రి పదవులు ఇవ్వడంపై తుదికంటా పోరాటం చేసిన జగన్.. ఇప్పుడు వంశీ ఎమ్మెల్యేగా రాజీనామా చేయకుండా పార్టీలో చేర్చుకునే అవకాశాలూ లేవు. దీంతో మధ్యే మార్గంగా వంశీ రాజీనామా చేయడం, దాన్ని ఆమోదించకుండా వదిలేయడం ద్వారా ఆయన్ను టీడీపీ సభ్యుడిగా కాకుండా, స్వతంత్ర సభ్యుడిగా కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. తద్వారా గన్నవరం నియోజకవర్గంలో టీడీపీకి దెబ్బ కొట్టడం, రాబోయే స్దానిక ఎన్నికల నాటికి వైసీపీ పట్టు పెంచుకోవడం ఖాయమనే వాదన వినిపిస్తోంది
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.