తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యూహాలు అంత ఈజీగా ఎవరికీ అర్థంకావు. అందుకే రాజకీయంగా కేసీఆర్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు ? దాని వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటనే దానిపై అనేక చర్చలు జరుగుతుంటాయి. తాజాగా రాజ్యసభ అభ్యర్థుల విషయంలో కేసీఆర్ తీసుకున్న నిర్ణయం నిజామాబాద్ టీఆర్ఎస్లో హాట్ టాపిక్‌గా మారిందనే టాక్ వినిపిస్తోంది. పార్టీ సీనియర్ నేత కే.కేశవరావును మరోసారి రాజ్యసభకు పంపించాలని కేసీఆర్ కొద్ది రోజుల ముందే నిర్ణయం తీసుకున్నారు. అయితే మరో సీటు కోసం మాజీ స్పీకర్ సురేశ్ రెడ్డిని ఎంపిక చేసిన తీరు మాత్రం టీఆర్ఎస్ వర్గాలను సైతం ఆశ్చర్యానికి గురి చేసింది.
నిజానికి రాజ్యసభ రేసులో సురేశ్ రెడ్డి చాలామంది కంటే వెనుక ఉన్నారు. ఇందుకు ప్రధాన కారణం నిజామాబాద్ జిల్లానే. నిజామాబాద్ జిల్లా నుంచి రాజ్యసభకు ఇప్పటికే టీఆర్ఎస్ తరపున డి.శ్రీనివాస్ ఉన్నారు. అయితే ఆయన టీఆర్ఎస్తో విభేదించారు. దీంతో ఈ జిల్లా నుంచి మరో నేతను కేసీఆర్ ఎంపిక చేస్తారా ? అనే సందేహాలు మొదలయ్యాయి. అంతేకాదు... ఒకవేళ నిజామాబాద్ నుంచి రాజ్యసభకు నేతను ఎంపిక చేయాల్సి వస్తే... మాజీ ఎంపీ, కేసీఆర్ కుమార్తె కవిత ముందు వరుసలో ఉంటారని అంతా అనుకున్నారు. ఆమెను రాజ్యసభకు పంపించే అంశంపై రాజకీయవర్గాల్లో కొద్ది నెలల నుంచి చర్చ జరిగింది.
సురేశ్ రెడ్డి, కేసీఆర్
అయితే కేసీఆర్ మాత్రం ఈ విషయంలో మిగతా వారికి భిన్నంగా ఆలోచించారు. ప్రచారంలో ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి, బండి పార్థసారథిరెడ్డి, దామోదర్ రావు వంటి వారిని పక్కనపెట్టి సురేశ్ రెడ్డికి ఛాన్స్ ఇచ్చారు. ఇందుకు ప్రత్యేకమైన కారణం ఉందని పలువురు భావిస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో బలపడేందుకు బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. నిజామాబాద్ ఎంపీ అరవింద్... ఈ మేరకు ముందుకు సాగుతున్నారు. దీంతో జిల్లాలో బీజేపీ ఎదుగుదలను అడ్డుకునేందుకు కేసీఆర్ సురేశ్ రెడ్డికి రాజ్యసభ ఛాన్స్ ఇచ్చారనే వాదనలు వినిపిస్తున్నాయి. మొత్తానికి కవితకు కాకుండా నిజామాబాద్ నుంచి సురేశ్ రెడ్డికి అవకాశం ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయించడం చాలామందికి ఆశ్చర్యం కలిగించింది.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.