REASON BEHIND AP MINISTER PEDDIREDDY RAMACHANDRA REDDY REJECTED NARA LOKESH CHAMBER AK
లోకేశ్ ఛాంబర్ వద్దన్న మంత్రి పెద్దిరెడ్డి... కారణం అదేనా...
నారా లోకేష్ (ఫైల్ ఫోటో)
ఏపీ సీఎం వైఎస్ జగన్ కేబినెట్లో పంచాయతీరాజ్ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి... గతంలో లోకేశ్ మంత్రిగా వ్యవహరించిన ఛాంబర్‌ను తీసుకోవడానికి నిరాకరించారు. మరో ఛాంబర్‌ను ఆయన ఎంపిక చేసుకున్నారు.
ఏపీ సీఎం వైఎస్ కేబినెట్లో చోటు దక్కించుకున్న కొత్త మంత్రులు... ఒక్కొక్కరుగా తమ బాధ్యతలను స్వీకరిస్తున్నారు. అయితే ఛాంబర్ల కేటాయింపు విషయంలో పలువురు మంత్రులు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వారిలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒకరు. వైఎస్ జగన్ కేబినెట్లో పంచాయతీరాజ్, మైనింగ్ శాఖలను దక్కించుకున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సచివాలయంలోని 5వ బ్లాక్‌లోని ఛాంబర్‌ను కేటాయించారు. గతంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా వ్యవహరించిన టీడీపీ అధినేత చంద్రబాబు తనయుడు లోకేశ్ ఈ ఛాంబర్‌ను వినియోగించారు. గతంలో లోకేశ్ మంత్రిగా చూసిన శాఖలే పెద్దిరెడ్డికి కేటాయించడంతో... అదే ఛాంబర్‌ను ఏపీ కొత్త మంత్రికి కేటాయించింది ప్రభుత్వం.
అయితే ఈ ఛాంబర్ తనకు వద్దన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి... మరో ఛాంబర్‌ను తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా సచివాలయంలోని 3వ బ్లాక్‌లోని 203 రూమ్‌ను తన ఛాంబర్‌గా ఎంచుకున్నారు. గురువారం ఆయన తన ఛాంబర్లో మంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. అయితే లోకేశ్‌కు కేటాయించిన ఛాంబర్‌ను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నిరాకరించడం వెనుక కారణం ఏంటనే దానిపై పలు రకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. లోకేశ్ ఛాంబర్ ఎంతో విశాలంగా, అత్యాధునికంగా ఉన్నప్పటికీ పెద్దిరెడ్డి మాత్రం ఈ ఛాంబర్‌పై ఆసక్తి చూపలేదని తెలుస్తోంది. అయితే ఈ ఛాంబర్ వాస్తు సరిగ్గా లేదని... అందుకే ఆయన ఈ ఛాంబర్‌ను వదులుకున్నారనే ప్రచారం కూడా సాగుతోంది. ఈ ఛాంబర్‌కు వాస్తు మార్పులు చేయించడం కంటే... మరో ఛాంబర్‌ను ఎంచుకోవడం మంచిదనే ఉద్దేశంతోనే ఆయన మరో ఛాంబర్‌ను ఎంపిక చేసుకున్నారని సమాచారం.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.