మహారాష్ట్రలో కొత్త ఫార్ములా.. శివసేనతో కేంద్ర మంత్రి చర్చలు

అధికారం పంచుకునే విషయంలో శివసేన, బీజేపీ మధ్య విభేదాలు తలెత్తిన నేపథ్యంలో.. ఈయన కొత్తగా 3-2 ఫార్ములాను తెరపైకి తెచ్చారు. బీజేపీ మూడేళ్లు, శివసేనకు రెండేళ్ల సీఎం పదవి ఉంటే ఓకేనా అని అడిగారు.

news18-telugu
Updated: November 18, 2019, 7:50 PM IST
మహారాష్ట్రలో కొత్త ఫార్ములా.. శివసేనతో కేంద్ర మంత్రి చర్చలు
ఉధ్దవ్ థాక్రే, దేవేంద్ర ఫడ్నవిస్
  • Share this:
మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై రాజకీయ హైడ్రామా కొనసాగుతోంది. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించినా పార్టీల పవర్ గేమ్ మాత్రం రోజుకో మలుపు తిరుగుతోంది. శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తాయని ప్రచారం జరుగుతున్న వేళ మధ్యలో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (RPI)కి చెందిన కేంద్ర మంత్రి రామ్‌దాస్ అథవాలే ఎంట్రీ ఇచ్చారు. బీజేపీ, శివసేన మధ్య సయోధ్య కుదుర్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే మహారాష్ట్రలో అధికార పగ్గాలపై కొత్త ఫార్ములాను ప్రతిపాదించారు అథవాలే.

శివసేన ఎంపీ సంజయ్ రౌత్‌తో రాందాస్ అథవాలే ఫోన్‌లో మాట్లాడారు. అధికారం పంచుకునే విషయంలో శివసేన, బీజేపీ మధ్య విభేదాలు తలెత్తిన నేపథ్యంలో.. ఈయన కొత్తగా 3-2 ఫార్ములాను తెరపైకి తెచ్చారు. బీజేపీ మూడేళ్లు, శివసేనకు రెండేళ్ల సీఎం పదవి ఉంటే ఓకేనా.. అని అడిగారు. ఐతే ఆ ఫార్ములాకు బీజేపీ ఒప్పుకుంటే తాము కూడా ఆలోచిస్తామని సంజయ్ రౌత్ చెప్పినట్లు అథవాలే తెలిపారు. ఈ నేపథ్యంలో దీనిపై త్వరలోనే బీజేపీతో చర్చిస్తానని చెప్పారు.

288 అసెంబ్లీ సీట్లున్న మహారాష్ట్రలో బీజేపీ 105 స్థానాల్లో విజయం సాధించింది. శివసేన 56 సీట్లు గెలిచింది. ఇక ఎన్సీపీ 54, కాంగ్రెస్ పార్టీ 44 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఐతే సీఎం పదవి విషయంలో శివసేన, బీజేపీ మధ్య విభేదాలు తలెత్తాయి. చెరి రెండున్నరేళ్లు సీఎం పదవిలో ఉండాలంటూ శివసేన పెట్టిన కండిషన్‌కు బీజేపీ ఒప్పుకోలేదు. అసెంబ్లీ గడువు ముగిసే లోపు తమకు తగిన సంఖ్యా బలం లేకపోవడంతో బీజేపీ చేతులెత్తేసింది. ఆ తర్వాత శివసేన, ఎన్సీపీ కూడా ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు రాకపోవడం..అసెంబ్లీ గడువు ముగియడంతో మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించారు.

మరోవైపు ప్రభుత్వ ఏర్పాటు విషయంలో ఎన్సీపీ, కాంగ్రెస్‌తో టచ్‌లో ఉంది శివసేన. ఇప్పటికే ఎన్డీయేకు కటీఫ్ చెప్పిన ఉద్ధవ్ థాక్రే.. తమ పార్టీ నేత అరవింద్ సావంత్‌ను కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయించారు. అనంతరం ఎన్సీపీ, కాంగ్రెస్‌తో జట్టు కట్టేందుకు సిద్ధమయ్యారు. కానీ గవర్నర్ విధించిన డెడ్‌లైన్ లోపు మూడు పార్టీల మధ్య ఏకాభిప్రాయం రాకపోవడం.. ప్రభుత్వ ఏర్పాటుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో అక్కడ రాష్ట్రపతి పాలన అమలు చేస్తున్నారు. ఇలాంటి పరిణామాల క్రమంలో రాందాస్ అథవాలే తీసుకొచ్చిన 3-2 ఫార్ములాకు శివసేన, బీజేపీ ఒప్పుకుంటాయా? లేదా? అన్నదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

First published: November 18, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>