టీడీపీకి బిగ్ షాక్.. ఏపీ రాజ్యసభ ఎన్నికల్లో 4 చెల్లని ఓట్లు.. ఎవరు వేశారంటే..

ప్రతీకాత్మక చిత్రం

వల్లభనేని వంశీ, మద్దాలి గిరి, కరణం బలరాం కావాలనే చెల్లని ఓటు వేసినట్లు ఏపీ రాజకీయాల్లో చర్చ జరుగుతోంది. మరి ఆదిరెడ్డి భవానీ ఎందుకు వేశారన్నది తెలియాల్సి ఉంది.

 • Share this:
  ఏపీ రాజ్యసభ ఎన్నికల లెక్కింపులో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది.  4 చెల్లని ఓట్లు పోలయ్యాయి. మొదటి ప్రాధాన్యత వద్ద '1'  అని నంబర్ వేయకుండా టిక్ మార్క్ పెట్టారు. ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, మద్దాలి గిరి, కరణం బలరాం ఈ చెల్లని ఓట్లు వేసినట్లు గుర్తించారు.  మరో ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ కూడా చెల్లని ఓటు వేశారు. వీరంతా టీడీపీకి ఓటు వేసినప్పటికీ.. నిబంధనల ప్రకారం వేయకపోవడంతో అవి చెల్లకుండా పోయాయి. టీడీపీ విప్ జారీ చేసిన నేపథ్యంలో భవిష్యత్‌లో ఇబ్బందులు రాకుండా ఉండేందుకు.. వీరంతా వ్యూహాత్మకంగా వ్యవహరించినట్లు సమాచారం.


  టీడీపీ విప్ జారీ చేయడం, వైసీపీ నుంచి ఒత్తిడి రావడంతో చివరి 10 నిమిషాల్లో వీరు ఓటువేశారు. వల్లభనేని వంశీ, మద్దాలి గిరి, కరణం బలరాం కావాలనే చెల్లని ఓటు వేసినట్లు ఏపీ రాజకీయాల్లో చర్చ జరుగుతోంది. ఆదిరెడ్డి భవానీ మాత్రం పొరపాటున వేశారు. దీనిపై పార్టీ నేత చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఎమ్మెల్యేలకు అవగాహన కల్పించడంలో నేతలు విఫలమయ్యారని మండిపడ్డారు.

  ఏపీలో రాజ్యసభ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. సాయంత్రం 4 గంటలకు పోలింగ్ పూర్తయింది. 175 ఎమ్మెల్యేల్లో 173 ఓట్లు పోల్ అయ్యాయి. అందులో 151 మంది వైసీపీ ఎమ్మెల్యేలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. జనసేనకు చెందిన ఒకే ఒక్క ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కూడా తన ఓటు వేశారు. ఇక టీడీపీకి ఉన్న 23 మందిలో 21 ఓట్లు పడ్డాయి. ఏసీబీ కేసులో అరెస్టైన అచ్చెన్నాయుడు,
  హోమ్ క్వారంటైన్‌లో ఉన్న అనగాని సత్యప్రసాద్ ఓటు వేయలేదు.


  ఏపీలో 4 రాజ్యభ స్థానాలకు ఐదుగురు అభ్యర్థులు పోటీపడ్డారు. అధికార పార్టీ వైసీపీ నుంచి పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, వ్యాపారవేత్త పరిమళ్ నత్వాని బరిలో ఉన్నారు. ఇక టీడీపీ నుంచి వర్ల రామయ్య పోటీ చేశారు. సంఖ్యా బలం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో నాలుగుకు నాలుగు సీట్లు వైసీపీయే కైవసం చేసుకుంది. ఇక వర్ల రామయ్యకు ఆ పార్టీ నుంచి పడాల్సిన ఓట్లు కూడా పడలేదు. ఆయనకు కేవలం 17 ఓట్లు మాత్రమే పోలయ్యాయి.

  First published: