Rapaka Varaprasad: వైసీపీ కార్యకర్తను బూతులు తిట్టిన ఎమ్మెల్యే రాపాక.. ఆడియో టేప్ వైరల్

వైఎస్ జగన్‌తో రాపాక వరప్రసాద్, ఆయన తనయుడు వెంకట్రామ్

నా గ్రామానికి వచ్చి వైసీపీ అభ్యర్థిని ప్రెసిడెంట్‌గా గెలిపిస్తావా.. వైసీపీ వాళ్లంతా పోరంబోకులు తయారయ్యారంటూ మండిపడ్డారు. ఎవడ్రా నువ్వు.. వెధవ.. అంటూ దుర్భాషలాడారు.

  • Share this:
    రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మళ్లీ వార్తల్లో నిలిచారు. జనసేన నుంచి గెలిచి సీఎం జగన్‌పై ప్రశంసల జల్లు కురిపించే ఈయన.. తాజాగా కొత్త వివాదంలో చిక్కుకున్నారు. పంచాయతీ ఎన్నికల్లో ఓ గ్రామ అభ్యర్థి ఎంపిక విషయంలో.. వైసీపీ కార్యకర్తను బండ బూతులు తిట్టినట్లుగా ఆయన పేరుతో ఓ ఆడియో టేప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సహదేవ్‌ అనే వైసీపీ కార్యకర్తకు ఫోన్ చేసి బెదిరించారు. మా ఊర్లో వైసీపీ అభ్యర్థిని నిలబెట్టడానికి నువ్వు ఎవరంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. నువ్వు నిర్ణయించావా? అన్ని ప్రశ్నించగా.. లేదన్నా.. అమ్మాజీ గారు నిర్ణయించారని సహదేవ్ చెప్పాడు. నా గ్రామానికి వచ్చి వైసీపీ అభ్యర్థిని ప్రెసిడెంట్‌గా గెలిపిస్తావా.. వైసీపీ వాళ్లంతా పోరంబోకులు తయారయ్యారంటూ మండిపడ్డారు. ఎవడ్రా నువ్వు.. వెధవ.. అంటూ దుర్భాషలాడారు.

    వైసీపీ ఇంచార్జి పెదపాటి అమ్మాజీని కూడా ఆయన దూషించినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ఆడియో టేప్‌పై ఇప్పుడు దుమారం రేగుతోంది. ఐతే దీనిపై ఇప్పటి వరకు వైసీపీ నేతలు గానీ..రాపాక వరప్రసాద్ గానీ స్పందించలేదు. రాజోలు నియోజకవర్గంలో పంచాయతీ అభ్యర్థుల బాధ్యతను వైసీపీ ఇంచార్జి అమ్మాజీ చూస్తున్నారు. ఐతే తనను పట్టించుకోవడం లేదన్న కోపంతో వారిపై రాపాక విమర్శలు గుప్పిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో కొందరు వైసీపీ కార్యకర్తలు రాపాక వైఖరిని తప్పుబట్టుతున్నారు. ఆయన అసలు నైజం ఇది.. అని మండిపడుతున్నారు. పైకి సీఎం జగన్‌పై ప్రశంసలు కురిపిస్తూ.. ఇప్పుడేమో వైసీపీ నేతలను దూషిస్తారా? అని విమర్శిస్తున్నారు.

    2019 ఎన్నికల్లో జనసేన నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్. ఐతే గెలిచిన కొన్ని రోజులకే ఆయన ప్లేటు ఫిరాయించారు. జనసేనకు దూరమై వైసీపీకి దగ్గరయ్యారు. అసెంబ్లీతో పాటు బహిరంగ వేదికలపైనా సీఎం జగన్‌పై ప్రశంసలు కురిపించి.. పవన్ కల్యాణ్‌కు ఊహించని షాక్ ఇచ్చారు. తాను వైసీపీ మనిషినని పదే పదే చెప్పారు. ఇక 2020 డిసెంబరులో రాపాక వరప్రసాద్ కుమారుడు వెంకట్రామ్ వైసీపీలో చేరారు. ఆయనకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వైసీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఐతే రాపాక మాత్రం వైసీపీ కండువా కప్పుకోలేదు. జనసేనకు రాజీనామా చేయకుండా.. సాంకేతికంగా ఆయన జనసేన ఎమ్మెల్యేగానే ఉంటున్నారు. కానీ రాజకీయపరంగా వైసీపీ నేతగానే కొనసాగుతున్నారు. ఐతే ఇప్పుడు వైసీపీ కార్యకర్తను దూషించడం చర్చనీయాంశమయింది.
    Published by:Shiva Kumar Addula
    First published: