రజనీకాంత్ రాజకీయ పార్టీ ఆవిర్భావానికి ముహుర్తం దాదాపుగా ఖరారుకావడం తెలిసిందే. ఏప్రిల్ 14 తర్వాత రజనీకాంత్ పార్టీ ప్రకటిస్తారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. తాజాగా రజనీకాంత్ రాజకీయ పార్టీకి సంబంధించి ఆయనకు అత్యంత సన్నిహితుడైన తమిళరువి మణియన్ ఆసక్తికర విషయాలను ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. రజనీకాంత్‌తో చేతులు కలిపేందుకు రాష్ట్రంలోని పలు రాజకీయ పార్టీలు సిద్ధంగా ఉన్నట్లు చెప్పుకొచ్చారు. రాందాస్ నేతృత్వంలోని పీఎంకే..రజనీకాంత్‌తో కలిసే పనిచేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలిపారు. అలాగే అన్నాడీఎంకేకి చెందిన ఇద్దరు ముఖ్యనేతలు రజనీకాంత్ పార్టీలో చేరేందుకు సంసిద్ధత వ్యక్తంచేసినట్లు వెల్లడించారు. అయితే వారి పేర్లను మాత్రం ఆయన బయటపెట్టలేదు. ఏ పార్టీలతో కలిసి పనిచేయాలన్న విషయమై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని...పలు పార్టీలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు చెప్పారు. అన్నాడీఎంకేతో పాటు డీఎంకే నేతలు కూడా రజనీకాంత్ పార్టీలో చేరేందుకు సుముఖంగా ఉన్నట్లు రజనీకాంత్ సన్నిహితుల్లో ఒకరైన కరాటే త్యాగరాజన్ తెలిపారు.
కాగా రజనీకాంత్‌తో పొత్తుకు టీటీవీ దినకరన్ మక్కువ చూపుతున్నా...ఆయనతో చేతులు కలిపేందుకు రజనీకాంత్ సుముఖంగా లేరని వెల్లడించారు. బీజేపీతో పొత్తు విషయంలో తుది నిర్ణయం రజనీకాంతే తీసుకుంటారని చెప్పారు. ఏప్రిల్ 14 తర్వాత పార్టీని ప్రకటించి..ఆగస్టు మాసంలో భారీ మహానాడును నిర్వహించనున్నట్లు తెలిపారు. సెప్టెంబర్ మాసంలో రజనీకాంత్ రాష్ట్ర వ్యాప్త పర్యటన చేపట్టనున్నట్లు తెలిపారు.
కాగా రజనీకాంత్‌తో తాము పొత్తు పెట్టుకోబోతున్న ప్రచారం ఊహాజనితమైనదిగా పీఎంకే నేతలు చెబుతున్నారు. ప్రస్తుతానికి తాము అధికార అన్నాడీఎంకే కూటమిలోనే కొనసాగుతున్నట్లు చెప్పారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Rajnikanth, Tamilandu