RAJINIKANTH CLOSE ASSOCIATE TAMILARUVI MANIAN SAYS SUPERSTAR DID NOT SAY HE WOULD NEVER ENTER POLITICS SSR
Rajini ReEntry: రజనీ రాజకీయాల్లోకి రానని చెప్పలేదు.. ఆయన సన్నిహితుడి కీలక ప్రకటన..!
రజనీకాంత్(ఫైల్ ఫొటో)
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాలపై వెనుకడుగు వేయడంతో తీవ్ర నిరాశలో ఉన్న ఆయన అభిమానుల్లో ఆశలు రేకెత్తించేలా రజనీ సన్నిహితుడు తమిళురువి మణియన్ కీలక ప్రకటన చేశారు. రాజకీయాల్లోకి వస్తున్నట్లు రజనీ రేపైనా ప్రకటించవచ్చన్నారు. రజనీకాంత్ రాజకీయాల్లోకి రానని ప్రకటించలేదని మణియన్ తెలిపారు. తమిళనాడులో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో...
చెన్నై: తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాలపై వెనుకడుగు వేయడంతో తీవ్ర నిరాశలో ఉన్న ఆయన అభిమానుల్లో ఆశలు రేకెత్తించేలా రజనీ సన్నిహితుడు తమిళురువి మణియన్ కీలక ప్రకటన చేశారు. రాజకీయాల్లోకి వస్తున్నట్లు రజనీ రేపైనా ప్రకటించవచ్చన్నారు. రజనీకాంత్ రాజకీయాల్లోకి రానని ప్రకటించలేదని మణియన్ తెలిపారు. తమిళనాడులో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆరోగ్య పరిస్థితులు సహకరించనందు వల్ల రాజకీయ పార్టీని ప్రారంభించడం లేదని మాత్రమే రజనీ ప్రకటించారని ఆయన చెప్పారు. ముందుగా ప్రకటించినట్లు పార్టీని ప్రస్తుతం ప్రారంభించడం లేదని చెప్పడం మాత్రమే రజనీకాంత్ ఉద్దేశమని పేర్కొన్నారు. త్వరలో జరగబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని రజనీ పార్టీ ప్రారంభించనప్పటికీ ఆ తర్వాత మళ్లీ ఏ క్షణమైనా పార్టీ స్థాపించే అవకాశాలున్నట్లు మణియన్ ప్రకటనతో స్పష్టమైంది. అయితే.. మణియన్ ప్రకటనపై రజనీ అభిమానుల్లోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రజనీ పార్టీ పెట్టడం లేదని ప్రకటించిన సందర్భంలో.. డిసెంబర్ 30, 2020న మణియన్ చేసిన వ్యాఖ్యలే ఇందుకు కారణం.
రాజకీయాలకు శాశ్వతంగా స్వస్తి పలుకుతున్నట్లు రజనీ చెప్పారని, ప్రాణమున్నంత వరకూ రాజకీయాల్లోకి రానని రజనీ తెలిపారని మణియన్ ఆ సందర్భంలో ప్రకటించారు. రజనీ అభిమానులు ఇతర పార్టీల్లో చేరుతున్నారన్న ఆందోళనలోనే రజనీ రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందంటూ తాజాగా ప్రకటన చేశారనే అభిప్రాయం పలువురిలో వ్యక్తమవుతోంది. మణియన్ చేసిన వ్యాఖ్యలు కూడా ఈ వాదనకు కొంత బలం చేకూర్చుతున్నాయి. రజనీ మక్కల్ మండ్రం నాయకులు, సభ్యులు విరక్తితో ఇతర పార్టీల్లో చేరుతుండటం తనకెంతో బాధ కలిగిస్తోందని తమిళురువి మణియన్ వ్యాఖ్యానించారు. రజనీ మక్కల్ మండ్రం నాయకుల్లో ఇటీవల కొందరు ప్రముఖులు ఇతర పార్టీల్లో సభ్యత్వం తీసుకున్నారు. కొందరు డీఎంకేలో, మరికొందరు అధికార అన్నాడీఎంకేలో చేరారు.
ఇతర పార్టీల్లో చేరినప్పటికీ తాము ఎప్పటికీ రజనీ అభిమానులమేనని వారు ప్రకటించడం విశేషం. రజనీకాంత్ రాజకీయాల్లోకి వచ్చే సంకేతాలు ఇప్పట్లో కనిపించడం లేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఒకవేళ.. తిరిగి రాజకీయాల్లో వచ్చే ఆలోచన ఉండి ఉంటే.. ఆయన అభిమానులు చెన్నైలో పెద్ద ఎత్తున నిరసన తెలిపినప్పుడైనా రజనీ ప్రకటన చేసేవారని, ఆ సందర్భంలో కూడా తనను ఇబ్బంది పెట్టొద్దన్న విధంగా రజనీ ప్రకటన విడుదల చేశారని గుర్తుచేస్తున్నారు.