Rajasthan Political Crisis: సచిన్ పైలట్‌‌తో కాంగ్రెస్ పెద్దల రాజీ ప్రయత్నాలు

Rajasthan Political Crisis updates | ఓ వైపు సచిన్ పైలట్‌తో రాజీ కోసం కాంగ్రెస్ పెద్దలు బుజ్జగిస్తుండగా...మరోవైపు దారిలోకి రాకుంటే ఆయనతో పాటు ఆయన వర్గానికి చెందిన 18 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయనున్నట్లు కాంగ్రెస్ నేతలు హెచ్చరికలు పంపుతున్నారు.

news18-telugu
Updated: July 15, 2020, 3:09 PM IST
Rajasthan Political Crisis: సచిన్ పైలట్‌‌తో కాంగ్రెస్ పెద్దల రాజీ ప్రయత్నాలు
సచిన్ పైలట్(ఫైల్ ఫోటో)
  • Share this:
రాజస్థాన్ రాజకీయాలు రక్తికట్టిస్తున్నాయి. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్‌పై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన సచిన్ పైలట్‌ను డిప్యూటీ సీఎం పదవితో పాటు...ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్ష పదవి నుంచి కాంగ్రెస్ అధిష్టానం తప్పించడం తెలిసిందే. సచిన్ పైలట్ వర్గానికి చెందిన ఇద్దరు మంత్రులకు కూడా ఉద్వాసన పలికారు. అయితే సచిన్ పైలట్‌ను బుజ్జగించి తిరిగి పార్టీలోకి తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ పెద్దలు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, సీనియర్ నేతలు చిదంబరం, అహ్మద్ పటేల్ తదితరులు సచిన్ పైలట్‌ను బుజ్జగిస్తున్నట్లు ఢిల్లీ రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. అటు ఆ పార్టీ నేతలు మీడియా ఎదుట చేసిన వ్యాఖ్యలతో కాంగ్రెస్ పెద్దలు...ఇంకా సచిన్ పైలట్‌‌తో రాజీ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు తేటతెల్లమవుతోంది. సచిన్ పైలట్‌కు కాంగ్రెస్ తలుపులు పూర్తిగా మూసేయలేదని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి అవినాష్ పాండే పేర్కొన్నారు. తన తప్పు తెలుసుకుని మళ్లీ సొంత గూటికి చేరేలా సచిన్ పైలట్‌కు దేవుడు మంచి బుద్ధిని ప్రసాదించాలని కోరుకుంటున్నట్లు వ్యాఖ్యానించారు. బీజేపీ ట్రాప్‌లో సచిన్ పైలట్ చిక్కుకోకూడదని తాను కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు.

మరో వైపు కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశానికి గైర్హాజరైనందుకు వివరణ ఇవ్వాలంటూ సచిన్ పైలట్‌తో పాటు మరో 18 మంది ఎమ్మెల్యేలకు ఆ పార్టీ నోటీసులు జారీ చేసింది. శుక్రవారంకల్లా వివరణ ఇవ్వాలని లేనిపక్షంలో అనర్హత వేటు చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని కాంగ్రెస్ హెచ్చరించింది. కొందరు ఎమ్మెల్యేలు వారి ఇళ్లలో లేకపోవడంతో నోటీసులను వారి ఇంటి బయట అంటించారు. విప్‌ను ధిక్కరించి సీఎల్పీ సమావేశానికి గైర్హాజరైన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఆ రాష్ట్ర స్పీకర్ సీపీ జోషికి పిటిషన్ సమర్పించింది. పార్టీ శాసనసభాపక్ష సమావేశానికి గైర్హాజరైన ఎమ్మెల్యేలు మరో రెండ్రోజుల్లో వివరణ ఇవ్వనిపక్షంలో వారు సీఎల్పీ సభ్యత్వం నుంచి వైదొలగినట్లు పరిగణిస్తామని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి అవినాష్ పాండే అన్నారు. వారి వివరణ సంతృప్తికరంగా లేనిపక్షంలో ఎమ్మెల్యేలపై అనర్హత వేటు విషయంలో స్పీకర్ తగిన నిర్ణయం తీసుకుంటారని పేర్కొన్నారు.




రాజస్థాన్‌లో చోటుచేసుకుంటున్న మరిన్ని రాజకీయ పరిణామాలు- రాజస్థాన్ బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు సతీష్ పూనియా పార్టీ సీనియర్ నేతలతో జైపూర్‌లో సమావేశమయ్యారు. కాంగ్రెస్‌పై సచిన్ పైలట్ తిరుగుబాటు నేపథ్యంలో రాష్ట్రంలో నెలకొంటున్న తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు.

- ప్రస్తుత పరిస్థితుల్లో అసెంబ్లీలో బలపరీక్ష ఎదుర్కోవాలని అశోక్ గెహ్లోత్‌ను డిమాండ్ చేయాల్సిన అవసరం ఏర్పడినట్లు భావించడం లేదని రాజస్థాన్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత గులాబ్ చంద్ కటారియా పేర్కొన్నారు. అలాంటి పరిస్థితి ఏర్పడితే బలపరీక్ష కోసం బీజేపీ డిమాండ్ చేస్తుందని చెప్పారు.
Published by: Janardhan V
First published: July 15, 2020, 3:08 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading