Rajasthan Political Crisis: ‘కాంగ్రెస్‌తో వసుంధర రాజె కుమ్మక్కు’

Rajasthan Political Crisis: సచిన్ పైలట్ బీజేపీలో చేరితే తన హవాకు గండిపడుతుందన్న కారణంగా...ఆయన పార్టీలో చేరకుండా వసుంధర రాజె అడ్డుకుంటున్నారన్న రాజకీయ ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ మిత్రపక్షానికి చెందిన నేత ఆమెపై చేసిన ఆరోపణలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

news18-telugu
Updated: July 16, 2020, 10:33 PM IST
Rajasthan Political Crisis: ‘కాంగ్రెస్‌తో వసుంధర రాజె కుమ్మక్కు’
వసుంధరా రాజే (ఫైల్ ఫొటో)
  • Share this:
రాజస్థాన్ మాజీ సీఎం, బీజేపీ సీనియర్ నాయకురాలు వసుంధర రాజెపై బీజేపీ మిత్రపక్షమైన రాష్ట్రీయ లోక్‌తాంత్రిక్ పార్టీ(ఆర్ఎల్పీ) నేత హనుమాన్ బెనివాల్ సంచలన ఆరోపణలు చేశారు. రాజస్థాన్‌లో అధికార కాంగ్రెస్ పార్టీతో ఆమె కుమ్మక్కయ్యారని ఆరోపించారు. సచిన్ పైలట్ తిరుగుబాటుతో మైనార్టీలో పడిపోయిన అశోక్ గెహ్లోత్ ప్రభుత్వాన్ని కాపాడేందుకు వసుంధర రాజె ప్రయత్నిస్తున్నారని చెప్పుకొచ్చారు. గెహ్లోత్ ప్రభుత్వాన్ని కాపాడేందుకు కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కూడా వసుంధర రాజె మాట్లాడినట్లు ఆరోపిస్తూ ఆయన ఓ ట్వీట్ చేశారు. తన ట్వీట్‌ను కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలకు ట్యాగ్ చేశారు.

రాజస్థాన్‌లో కాంగ్రెస్ పార్టీపై తిరుగుబాటు చేసిన సచిన్ పైలట్‌ను డిప్యూటీ సీఎం పదవితో పాటు పీసీసీ అధ్యక్ష పదవి నుంచి కాంగ్రెస్ పార్టీ ఉద్వాసన పలకడం తెలిసిందే. దీంతో ఆ రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం తారస్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో వసుంధర రాజెపై హనుమాన్ బెనివాల్ ట్విట్టర్ వేదికగా చేసిన సంచలన ఆరోపణలు రాజకీయ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అయితే తన ఆరోపణలకు సంబంధించిన ఎలాంటి ఆధారణలను ఆయన బయటపెట్టలేదు. అటు తనపై వచ్చిన ఈ ఆరోపణలపై వసుంధర రాజె కూడా స్పందించలేదు.

గతంలోనూ ఆయన పలు సందర్భాల్లో వసుంధర రాజెపై ఆరోపణలు చేశారు. వసుంధర రాజె, అశోక్ గెహ్లోత్ మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని ఆయన పలు సందర్భాల్లో ఆరోపించారు. సచిన్ పైలట్ పార్టీలో చేరితే తన హవాకు గండిపడుతుందన్న కారణంగా...ఆయన బీజేపీలో చేరకుండా వసుంధర రాజె అడ్డుకుంటున్నారన్న రాజకీయ ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.

ఇదిలా ఉండగా సచిన్ పైలట్, ఆయన వర్గానికి చెందిన 18 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ కాంగ్రెస్ స్పీకర్‌కు పిటిషన్ ఇవ్వడం తెలిసిందే. దీనికి సంబంధించి స్పీకర్ జారీ చేసిన నోటీసులపై సచిన్ పైలట్ సహా ఆయన వర్గం ఎమ్మెల్యేలు రాజస్థాన్ హైకోర్టును ఆశ్రయించారు. సచిన్ పైలట్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను రాజస్థాన్ హైకోర్టు రేపు(శుక్రవారం) సాయంత్రం 5 గం.లకు వాయిదావేసింది.
Published by: Janardhan V
First published: July 16, 2020, 10:33 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading