Home /News /politics /

RAJASTHAN CRISIS LIVE UPDATES SPEAKER CANT DISQUALIFY REBEL MLAS BEFORE SC ORDER IN WIN FOR PILOT CAMP SK

Rajasthan Crisis: సచిన్ పైలట్‌కు సుప్రీంకోర్టులోనూ ఊరట

సచిన్ పైలెట్(ఫైల్ ఫోటో)

సచిన్ పైలెట్(ఫైల్ ఫోటో)

పార్టీ సభ్యులు పార్టీకి వ్యతిరేకంగా గళం విప్పకూడదా? అని జస్టిస్ మిశ్రా పిటిషనర్ తరపున న్యాయవాదిని ప్రశ్నించారు. పార్టీలో అసమ్మతి స్వరాన్ని అణిచివేయలేరని వ్యాఖ్యానించారు.

    రాజస్థాన్ రాజకీయ సంక్షోభం ఎపిసోడ్ రోజుకో మలుపు తిరుగుతోంది. సీఎం అశోక్ గహ్లోత్‌పై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన సచిన్ పైలట్ వర్గానికి సుప్రీంకోర్టులోనూ ఊరట లభించింది. సచిన్‌ పైలట్‌ వర్గంపై ఈ నెల 24 వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దన్న రాజస్థాన్‌ హైకోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తూ అసెంబ్లీ స్పీకర్‌ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై గురువారం విచారించిన సుప్రీంకోర్టు.. రాజస్థాన్ హైకోర్టు విచారణపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. అంతేకాదు సచిన్ పైలెట్ వర్గం పిటిషన్‌పై రాజస్థాన్‌ హైకోర్టు తీర్పు వెలువరించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

    ఐతే హైకోర్టు ఆదేశాల అమలు మాత్రం సుప్రీంకోర్టులో వచ్చే ఫలితంపైనే ఆధారపడి ఉండాలని జస్టిస్ అరుణ్ మిశ్రా వెల్లడించారు. తదుపరి విచారణ ఈ నెల 27కి వాయిదా వేశారు.

    సుప్రీంకోర్టులో రాజస్థాన్ స్పీకర్ సీపీ జోషి తరపున సీనియర్ లాయర్ కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. స్పీకర్ విచక్షాణాధికారాల్లో కోర్టు జోక్యం చేసుకోలేదని వాదించారు. ఈ నెల 24 వరకు ఎలాంటి చర్యలు తీసుకోకూడదన్న హైకోర్టు ఆదేశాలు రాజ్యాంగ విరుద్ధమని కోర్టు దృష్టికి ఆయన తీసుకెళ్లారు. అనర్హత వేటుపై స్పీకర్ నిర్ణయం తీసుకున్న తర్వాతే న్యాయ సమీక్షకు అవకాశం ఉందని.. ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోకముందే హైకోర్టు ఎలా విచారిస్తుందని ప్రశ్నించారు. హైకోర్టులో ఉన్న కేసును సుప్రీంకోర్టుకు బదిలీ చేయాలని కోరారు. ఐతే దీనిపై ఇప్పటికిప్పుడు ఆదేశాలు ఇవ్వలేమని జస్టిస్ అరుణ్ మిశ్రా ధర్మాసనం తెలిపింది. దీనిపై సుదీర్ఘ విచారణ చేపడతామని స్పష్టం చేసింది.

    ఈ కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పార్టీ సభ్యులు పార్టీకి వ్యతిరేకంగా గళం విప్పకూడదా? అని జస్టిస్ మిశ్రా పిటిషనర్ తరపున న్యాయవాదిని ప్రశ్నించారు. పార్టీలో అసమ్మతి స్వరాన్ని అణిచివేయలేరని వ్యాఖ్యానించారు.


    సీఎల్పీ సమావేశాలకు హాజరుకాకపోవడంతో పాటు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో సచిన్‌ పైలట్‌పై కాంగ్రెస్ పార్టీ వేటువేసిన విషయం తెలిసిందే. రాజస్థాన్ కాంగ్రెస్ చీఫ్ పదవితో పాటు డిప్యూటీ సీఎం పదవి నుంచి తప్పించింది. ఈ క్రమంలో సచిన్ పైలట్‌తో పాటు మరో 18 మంది రెబల్ ఎమ్మెల్యేలకు రాజస్థాన్ స్పీకర్ నోటీసులు పంపించారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని, వారిపై అనర్హత వేటువేయాలని కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించిన నేపథ్యంలో.. ఆయన నోటీసులు జారీచేశారు. దీన్ని సవాల్ చేస్తూ రాజస్థాన్ హైకోర్టును ఆశ్రయించారు సచిన్ పైలట్. ఆ పిటిషన్‌పై విచారించిన హైకోర్టు.. జూలై 24 వరకు వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేసింది.

    కాగా, రాజస్థాన్ రాజకీయాల్లో ఆడియో టేపులు ఇటీవల సంచలనం రేపాయి. తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ కుట్ర చేసిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. తమ ఎమ్మెల్యే భన్వర్‌లాల్ శర్మతో కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్, బీజేపీ నేత సంజయ్ జైన్‌ ఫోన్‌లో మాట్లాడి.. బేరసారాలకు దిగారని ఆ పార్టీ నేతలు విమర్శించారు. వాటిపై కాంగ్రెస్ చీఫ్ విప్ మహేష్ జోషి రాజస్థాన్ స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (SOG)కి ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన SOG.. ఎఫ్ఐఆర్‌లో భన్వర్ లాల్, సంజయ్ జైన్‌తో పాటు కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ పేర్లను పొందుపరించింది. అటు బీజేపీ నేతలతో బేరసారాలు జరిపిన ఇద్దరు ఎమ్మెల్యేలను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది కాంగ్రెస్. ఈ పరిణామాలతో రాజస్థాన్ రాజకీయాలు మరింత వేడెక్కాయి.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Bjp, Congress, Rajasthan, Sachin Pilot

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు