RAJ THACKERAY TO MEET MAMATA BANERJEE TODAY IN A BID TO LAUNCH CAMPAIGN AGAINST EVM CREDIBILITY
ఈవీఎంలకు వ్యతిరేకంగా ఇక దేశ వ్యాప్త ఆందోళనలు ఉధృతం..
ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ థాకరే(Getty Images)
EVM | ఈవీఎంలకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా రాజకీయ పార్టీలు ఏకతాటిపైకి వచ్చి ఉద్యమించాలని భావిస్తున్నాయి. ఇందులో భాగంగా ప.బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో చర్చించేందుకు ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ థాకరే కోల్కత్తా వెళ్లనున్నారు.
ఈవీఎంలకు వ్యతిరేకంగా ఇక దేశ వ్యాప్త ఆందోళనలు ఉధృతంకానున్నాయి. ఈవీఎంలతో ఎన్నికలను నిర్వహించకూడదని డిమాండ్ చేస్తూ పలు రాజకీయ పార్టీలు ఏకతాటిపైకి వచ్చి దేశ వ్యాప్త ఆందోళనలు చేపట్టేందుకు సన్నద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగా మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన(ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ థాకరే కోల్కత్తాలో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీని కలిసేందుకు మంగళవారం సాయంత్రం కోల్కత్తా చేరుకోనున్నారు. దేశ వ్యాప్తంగా విపక్షాలను ఏకతాటికి తీసుకువచ్చి ఈవీఎంలకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని ఉధృతం చేసేందుకు అనుసరించాల్సిన వైఖరిపై చర్చించనున్నారు. రాజ్ థాకరే మంగళవారం సాయంత్రం కోల్కతాకు చేరుకుంటారని, బుధవారం అక్కడ పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొని, ఆగస్టు 1న సీఎం మమతా బెనర్జీతో భేటీ అవుతారని రాజ్ థాకరే వ్యక్తిగత సహాయకుడు హర్షల్ దేశ్పాండే న్యూస్18కి ఫోన్లో తెలిపారు.
ప్రతీకాత్మక చిత్రం
అక్టోబర్ మాసంలో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలను ఈవీఎంలతో కాకుండా బ్యాలెట్ పత్రాలతో నిర్వహించాలని ఇది వరకే రాజ్ థాకరే డిమాండ్ చేశారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత పలువురు రాజకీయ నేతలు ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తంచేశారు. ఈవీఎంల ద్వారా ఎన్నికలను నిర్వహించే పక్షంలో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను బహిష్కరిస్తామని రాజ్ థాకరే ఇటీవల స్పష్టంచేశారు.
ఈవీఎంలకు వ్యతిరేకంగా దేశ వ్యాప్త మద్దతు కూడగట్టే ప్రయత్నాల్లో భాగంగా పలువురు జాతీయ నేతలను రాజ్ థాకరే కలవనున్నారు. ఈవీఎంల స్థానంలో బ్యాలెట్ పత్రాలతో ఎన్నికలు నిర్వహించేలా వివిధ పార్టీల మద్దతు కూడగట్టనున్నారు. ఇటీవల యూపీఏ ఛైర్పర్సన్ సోనియాగాంధీని కలిసిన రాజ్ థాకరే...ఈవీఎంల పనితీరుపై అనుమానాలు వ్యక్తంచేశారు. దేశ వ్యాప్తంగా దీనికి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందని సూచించారు.
Published by:Janardhan V
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.