కేరళలోని వయనాడ్ నుంచి నామినేషన్ వేసిన రాహుల్ గాంధీ తన గెలుపు కోసం ఏం చేయాలనే అంశాన్ని ఆలోచించి ఉండొచ్చు. కానీ, దీన్ని మాత్రం కచ్చితంగా అంచనా వేసి ఉండరు. ఔను. నిజంగా వయనాడ్ బరిలో ముగ్గురు రాహుల్ గాంధీలు ఉంటారని ఊహించి ఉందరు. ఔను వయనాడ్‌లో ముగ్గురు రాహుల్ గాంధీలు పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నామినేషన్ వేసిన కొన్ని గంటల్లోనే వయనాడ్‌లో రాహుల్ గాంధీ కేఈ (33) అనే యువకుడు కూడా ఇండిపెండెంట్‌గా నామినేషన్ వేశాడు. కొట్టాయంలోని ఎరుమెలి గ్రామానికి చెందిన రాహుల్ గాంధీ కేఈ సంప్రదాయ సంగీతంలో రీసెర్చ్ స్కాలర్. అతడి సోదరుడి పేరు రాజీవ్ గాంధీ కేఈ. వారి నాన్న కుంజుమన్ డ్రైవర్, కాంగ్రెస్ కార్యకర్త. గాంధీ కుటుంబానికి అభిమాని. అందుకే కుంజుమన్ తన పిల్లలకు రాహుల్ గాంధీ, రాజీవ్ గాంధీ అనే పేర్లు పెట్టినట్టు కాంగ్రెస్ కార్యకర్తలు చెబుతారు. అయితే, రాజీవ్ గాంధీ సీపీఎం అభిమాని. నామినేషన్ వేసే సమయంలో రాహుల్ గాంధీ కేఈ ఇంట్లో ఎవరికీ చెప్పి ఉండకపోవచ్చని అంటున్నారు.

వయనాడ్‌లో రాహుల్ గాంధీ నామినేషన్ (ANI)
మరో రాహుల్ గాంధీ (30) తమిళనాడులోని కోయంబత్తూర్‌కు చెందిన వ్యక్తి. అగిలా ఇండియా మక్కల్ కజగం అనే పార్టీ తరఫున అతడు పోటీ చేస్తున్నాడు. ‘మా నాన్న స్థానిక కాంగ్రెస్ నాయకుడు. ఆ తర్వాత అన్నాడీఎంకేలోకి మారాడు. ఆయన కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు నేను పుట్టా. అందుకే నాకు రాహుల్ గాంధీ అని పేరు పెట్టారు. మా సోదరికి ఇందిరా ప్రియదర్శిని అని పేరు పెట్టారు. అప్పుడు మా నాన్న నాకు పెట్టిన పేరు ఇప్పుడు నాకు ఇలా ఉపయోగపడుతుంది.’ అని కె.రాహుల్ గాంధీ తెలిపాడు. కె.రాహుల్ గాంధీ గతంలో కూడా ఎన్నికల్లో పోటీ చేశాడు. 2016 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తమిళనాడులోని సింగనల్లూర్‌లో పోటీ చేశాడు. 2014లో కోయంబత్తూరు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా బరిలో దిగాడు.

రాహుల్ గాంధీ
ఈ ముగ్గురు రాహుల్ గాంధీలు అయితే, మరో గాంధీ కూడా వయనాడ్‌లో ఉన్నారు. ఆయన పేరు కేఎమ్. శివప్రసాద్ గాంధీ. ఆయన త్రిసూర్‌లో సంస్కృతం టీచర్. కేరళలో ఈసీ గుర్తింపు లేని గాంధీయన్ పార్టీ తరఫున ఆయన పోటీ చేస్తున్నారు. అయితే, పైన ఇద్దరి విషయంలో జరిగినట్టు ఈయన కుటుంబం కాంగ్రెస్ పార్టీలో లేదు. గాంధీయన్ పార్టీలో చేరిన తర్వాత ఆయనే తన పేరు వెనుక గాంధీ అని పెట్టుకోవాలని నిర్ణయించారు. ఆ రకంగా ఆయన పేరు చివర గాంధీ అని చేరింది.
ఒకే పేరుతో ఉన్న ఇలాంటి అభ్యర్థుల వల్ల ప్రధాన పార్టీల నుంచి పోటీ చేసే వారికి కొన్ని సార్లు షాక్ తగులుతూ ఉంటుంది. ఏపీలో కూడా ఇటీవల అనంతపురం జిల్లాలో వైసీపీ అభ్యర్థులను పోలిన పేర్లతో ఉన్న వ్యక్తులనే ప్రజాశాంతి పార్టీ పోటీకి నిలిపిందని పెద్ద దుమారం రేగింది.
Published by:Ashok Kumar Bonepalli
First published:April 06, 2019, 21:51 IST