మోదీకి తీసిపోని విధంగా యోగి కాంగ్రెస్ వారసులపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ ను నాశనం చేయడానికి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ చాలునని, వేరొకరెవరూ అక్కర్లేదని యోగి ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ పార్టీ వారసత్వ రాజకీయాలకంటే ఇండియాకు పెద్ద ప్రమాదమేదీ లేదంటూ నెహ్రూ-గాంధీ కుటుంబం వల్ల దేశం ఎదుర్కొన్న సమస్యలను ఇటీవల పార్లమెంటులో ఏకరువు పెట్టారు ప్రధాని నరేంద్ర మోదీ. ఆయనకు ఏమాత్రం తీసిపోని విధంగా ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సైతం కాంగ్రెస్ వారసులపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ ను నాశనం చేయడానికి ఆ పార్టీ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ చాలునని, వేరొకరెవరూ అక్కర్లేదని యోగి ఎద్దేవా చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు‘బేకార్’ కాంగ్రెస్కు ఓటు వేయవద్దని కోరినట్లు తెలిపారు. సోమవారం ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుతం దేశంలో వాతావరణాన్ని వేడెక్కించిన కర్ణాటక హిజాబ్ వివాదంపైనా యూపీ సీఎం యోగి సంచలన వ్యాఖ్యలు చేశారు. పాఠశాలల్లో సరైన డ్రెస్ కోడ్ ఉండాలని, షరియత్ చట్టాల ప్రకారం దేశం నడవాలనుకునేవారి కలలు కల్లలుగానే మిగిలిపోతాయని అన్నారు. ఇది నవ భారతమని, ప్రపంచంలో గొప్ప ప్రజాదరణగల నాయకుడు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఉన్న భారత దేశమని, దేశం రాజ్యాంగాన్ని బట్టి మాత్రమే నడుస్తుందని, షరియా ప్రకారం కాదని యోగి వివరించారు.
న్యూ ఇండియాలో అభివృద్ధి జరుగుతోందని, ఎవరినీ బుజ్జగించాల్సిన అగత్యం లేదని, వ్యక్తిగత ఇష్టాఇష్టాలు, ప్రాథమిక హక్కులు, నమ్మకాలను దేశంపైనా, వ్యవస్థలపైనా రుద్దలేమని యోగి చెప్పారు. కాషాయం ధరించాలని ఉత్తర ప్రదేశ్ ప్రజలను, కార్యకర్తలను అడిగానా? అని ప్రశ్నించారు. తమకు నచ్చినదాన్ని ప్రజలు ధరిస్తారన్నారు. కానీ పాఠశాలల్లో మాత్రం డ్రెస్ కోడ్ ఉండాలన్నారు. ఇది పాఠశాలలు, వాటిలో క్రమశిక్షణలకు సంబంధించిన విషయమని చెప్పారు. వ్యక్తిగత నమ్మకాలు వేరని, వ్యవస్థల విషయానికి వచ్చేసరికి, వాటిలోని నియమ, నిబంధనలను అంగీకరించాలని చెప్పారు. దేశం విషయానికొచ్చేసరికి రాజ్యాంగాన్ని పాటించాలన్నారు.
‘80శాతం వర్సెస్ 20శాతం’ అంటూ తాను చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంపైనా యోగి వివరణ ఇచ్చారు. తన మాటలు మతాలను ఉద్దేశించి కాదని ఆయన క్లారిటీ ఇచ్చారు. ‘రాష్ట్రంలో 80శాతం ప్రజలు భాజపావైపు ఉన్నారు. ప్రభుత్వ అజెండాతో వీరంతా సంతోషంగా ఉన్నారు. 20శాతం మంది మాత్రమే వ్యతిరేకిస్తున్నారు. వీరు ప్రభుత్వం ఏం చేసినా ప్రతికూలంగానే ఆలోచిస్తారు. ఆనాడు కూడా నేను ఇదే విషయాన్ని చెప్పాను. అంతేగానీ, మతం, కులాన్ని ఉద్దేశిస్తూ ఆ వ్యాఖ్యలు చేయలేదు’ అని యోగి పేర్కొన్నారు.
అంతకుముందు, కాంగ్రెస్ అగ్రనాయకులు, నెహ్రూ-గాంధీ కుటుంబ వారసులైన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల మధ్య తీవ్రమైన ఉన్నాయనే అర్థంలోనూ యూపీ సీఎం యోగి వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వాద్రా ఆదివారం పంజాబ్లో మాట్లాడుతూ, రాహుల్ గాంధీతో తనకు విభేదాలున్నట్లు యోగి ఆదిత్యనాథ్ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. తాను రాహుల్ గాంధీ కోసం తన జీవితాన్ని త్యాగం చేస్తానని, అదేవిధంగా ఆయన కూడా తన కోసం అదేవిధంగా త్యాగం చేస్తారని చెప్పారు. తమ మధ్య విభేదాలేవీ లేవన్నారు.
Published by:Madhu Kota
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.