Andhra Pradesh: ఏపీ కాంగ్రెస్‌పై రాహుల్ గాంధీ ఫోకస్.. కీలన నేతలతో భేటీ.. బ్లూప్రింట్ రెడీ..

రాహుల్ గాంధీ, ఏపీ మ్యాప్

Andhra Pradesh: తెలంగాణ తరహాలోనే ఏపీలోనూ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్లను నిర్వహించాలనే యోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

  • Share this:
    ఏపీలో అడ్రస్ లేకుండా పోయిన కాంగ్రెస్ పార్టీని మళ్లీ గాడిన పెట్టే ప్రయత్నం మొదలుపెట్టింది ఆ పార్టీ అధిష్టానం. ఇందుకోసం ఆ పార్టీకి చెందిన పలువురు సీనియర్ నేతలతో సమావేశం ఏర్పాటు చేసింది. రాహుల్ గాంధీతో జరిగిన సమావేశానికి ఏపీ మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, కేంద్ర మాజీమంత్రులు పల్లంరాజు, జేడీ శీలం, ఎంపీలు కేవీపీ, హర్ష కుమార్, చింతా మోహన్ హాజరయ్యారు. వీరితో రాహుల్ గాంధీ విడివిడిగా మాట్లాడారు. ఇప్పటికే ఏపీలో పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై రాహుల్ గాంధీ ఏపీ రాష్ట్ర వ్యవహరాల ఇంఛార్జ్ ఉమెన్ చాందీతో చర్చించారు. ఆయన ఇచ్చిన నివేదిక ఆధారంగానే రాహుల్ గాంధీ ముందుకు సాగుతున్నారనే ప్రచారం సాగుతోంది. అయితే ఏపీలో కాంగ్రెస్ పార్టీని తిరిగి బలోపేతం చేయడానికి ఎన్నో చర్యలు తీసుకోవాల్సి ఉందని.. ఈ క్రమంలో పార్టీలో అనేక మార్పులు చేయాల్సి ఉందని నేతలు సూచించినట్టు సమాచారం. మరోవైపు ఏపీలో కాంగ్రెస్ పార్టీకి కొత్త అధ్యక్షుడు వచ్చే అవకాశం ఉందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.

    ప్రస్తుతం ఏపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న శైలజానాధ్ స్థానంలో మరొకరిని నియమించే యోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉందని తెలుస్తోంది. దీంతో పాటు కాంగ్రెస్ కేంద్ర నాయకత్వంలోనే ఏపీ నాయకులకు కీలక పదవులు ఇవ్వాలని నిర్ణయించినట్టు సమాచారం. ఏఐసీసీ స్థాయిలో కొందరు నేతలు తీసుకోవాలని.. తద్వారా ఏపీకి కాంగ్రెస్ పార్టీ మళ్లీ ప్రాధాన్యత ఇస్తోందనే సంకేతాలు ఇవ్వాలని కాంగ్రెస్ హైకమాండ్ యోచిస్తున్నట్టు తెలుస్తోంది. శైలజానాథ్‌ను తప్పిస్తే.. ఆయన స్థానంలో రెడ్డి సామాజికవర్గానికి చెందిన నాయకుడికి ఏపీ కాంగ్రెస్ పగ్గాలు ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని.. ఆ బాధ్యతలు మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి తీసుకునేందుకు ముందుకొస్తే ఆయనకే ఇస్తారనే చర్చ కూడా సాగుతోంది.

    తెలంగాణ తరహాలోనే ఏపీలోనూ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్లను నిర్వహించాలనే యోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. పూర్తిస్థాయిలో పీసీసీ చీఫ్‌తో పాటు నలుగురైదుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమించి.. అందులో పలు సామాజికవర్గాలకు ప్రాధాన్యత ఇవ్వాలని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తున్నట్టు ఊహాగానాలు జోరందుకున్నాయి. అలా చేయడం ద్వారా అన్ని వర్గాలకు న్యాయం చేసినట్టు అవుతుందనే యోచనలో ఉంది.

    మరోవైపు ఏపీలో కాంగ్రెస్ బలోపేతంపై రాహుల్ గాంధీ దృష్టి పెట్టడంపై కాంగ్రెస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. పలు నిర్ణయాల కారణంగా ఏపీలో బీజేపీ టార్గెట్ అవుతోందని.. దాన్ని కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా వినియోగించుకుంటే మళ్లీ పుంజుకునే అవకాశం ఉంటుందని పలువురు నేతలు పార్టీ హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. మొత్తానికి ఏపీలో కాంగ్రెస్ వ్యవహారాలపై ఫోకస్ చేసిన కాంగ్రెస్ అధిష్టానం.. ఏపీసీసీ చీప్‌ను మార్చడంతోనే తన మొదలుపెడుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది.
    Published by:Kishore Akkaladevi
    First published: