news18-telugu
Updated: July 10, 2019, 6:34 PM IST
అమేథీలో రాహుల్ గాంధీ పర్యటన
మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో అమేథీ లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ... బుధవారం తొలిసారిగా అక్కడ పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక కాంగ్రెస్ నాయకులపై రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమేథీలో తన ఓటమికి స్థానిక పార్టీ నాయకులే కారణమని ఆరోపించారు. నియోజకవర్గ ప్రజలకు పార్టీ స్థానిక నేతలు అందుబాటులో లేకుండా ఉన్నారని, అందుకే తాను ఓడిపోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని వ్యాఖ్యానించారు. అదే సమయంలో తాను అమేథీ నియోజకవర్గాన్ని వదులుకునే ప్రసక్తే లేదని పార్టీ నేతల సమావేశంలో రాహుల్ గాంధీ స్పష్టంచేసినట్లు ఆ పార్టీ వర్గాలు మీడియాకు తెలిపాయి.
అమేథీ ఎప్పటికీ తనకు ఇళ్లు, కుటుంబంలా ఉంటుందని రాహుల్ స్పష్టంచేశారని ఆ పార్టీ స్థానిక నేత నదీమ్ అష్రఫ్ తెలిపారు. అదే సమయంలో అమేథీలో తన విజయం కోసం తీవ్రంగా శ్రమించిన పార్టీ శ్రేణులకు రాహుల్ గాంధీ కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల సమయంలో పార్టీకి చెందిన కొందరు నియోజకవర్గ నేతలు బీజేపీతో కలిసి పనిచేశారని...ఆ విషయాన్ని కొందరు నేతలు రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్లారు.
ప్రస్తుతం తాను కేరళలోని వయనాడ్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యంవహిస్తున్నా... అమేథీతో సంబంధాలు మునుపటిలానే కొనసాగిస్తానని స్థానిక పార్టీ శ్రేణులకు రాహుల్ స్పష్టంచేశారు. అమేథీతో తనకు మూడు దశాబ్ధాల అనుబంధం ఉందన్నారు. అమేథీ ప్రయోజనాల కోసం తాను ఢిల్లీలో పోరాడుతానని చెప్పారు.మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో గాంధీ కుటుంబానికి కంచుకోటలాంటి అమేథీలో రాహుల్ గాంధీపై బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీ 52 వేల ఓట్ల తేడాతో విజయం సాధించడం తెలిసిందే. ఈ ఎన్నికల్లో ఓటమికి ముందు 1999 నుంచి రాహుల్ గాంధీ అమేథీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యంవహిస్తున్నారు.
Published by:
Janardhan V
First published:
July 10, 2019, 6:34 PM IST