వైసీపీ షోకాజ్ నోటీస్‌పై లాజికల్‌గా స్పందించిన రఘురామకృష్ణంరాజు...

Show Cause to Raghuramakrishnam Raju | వైసీపీ తనకు జారీ చేసిన షోకాజ్ నోటీసుపై నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు వివరణ ఇచ్చారు.

news18-telugu
Updated: June 24, 2020, 7:28 PM IST
వైసీపీ షోకాజ్ నోటీస్‌పై లాజికల్‌గా స్పందించిన రఘురామకృష్ణంరాజు...
వైఎస్ జగన్, రఘురామ కృష్ణంరాజు (ఫైల్ ఫోటో)
  • Share this:
వైసీపీ ఆలిండియా జనరల్ సెక్రటరీ వి.విజయసాయిరెడ్డి తనకు జారీ చేసిన షోకాజ్ నోటీసుపై నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు వివరణ ఇచ్చారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోను రిలీజ్ చేశారు. ‘నాకు మా పార్టీ నుంచి నోటీసు వచ్చింది. ఆ విషయం తెలిసి చాలా మంది ఫోన్లు చేశారు. కలుస్తామన్నారు. కానీ, నేనే కరోనా సమయంలో కలవద్దని చెప్పా. నాకు 18 పేజీల షోకాజ్ నోటీసు వచ్చింది. అందులో రెండు పేజీలు రాతపూర్వకంగా ఉన్నాయి. మిగిలిన 16 పేజీలు పేపర్ క్లిపింగ్స్ ఉన్నాయి. నేను మా పార్టీని, అధ్యక్షుడిని ఎన్నడూ పల్లెత్తుమాట అనలేదు. ప్రభుత్వం ప్రజల కోసం చేపట్టిన కొన్ని అద్భుత పథకాలు అనుకున్నట్టుగా సజావుగా జరగడం లేదని జగన్‌కు చెప్పాలనుకున్నా. కానీ, అపాయింట్‌మెంట్ సకాలంలో లభించనందున తిరుపతి భూములు, ఇతర విషయాలను మీడియా ముఖంగా తెలియజేశా. ప్రభుత్వానికి సూచన చేశానే కానీ, పార్టీని ఏనాడూ నేనేమీ అనలేదు. అదే విషయాన్ని నేను సవివరంగా నోటీసుకు సమాధానం ఇస్తా. నాకు వారం రోజుల గడువు ఇచ్చినప్పటికీ నేను రేపే (ఈనెల 25) నా సమాధానం వైసీపీ ఆలిండియా జనరల్ సెక్రటరీ విజయసాయిరెడ్డికి పంపిస్తా.’ అని చెప్పారు.

రఘురామకృష్ణంరాజు, వైసీపీ మధ్య గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం కొనసాగుతోంది. నియోజకవర్గ సమస్యల గురించి చర్చించేందుకు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తనకు అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదంటూ రఘురామకృష్ణంరాజు బహిరంగంగా విమర్శలు గుప్పించారు. మీడియా ముందు ఆయన తీవ్ర విమర్శలు చేశారు. అలాగే, జగన్ మోహన్ రెడ్డి ఏడాది పాలన మీద కూడా కొన్ని విమర్శలు చేశారు. తన పార్లమెంట్ నియోజకవర్గంలో కొందరు ఎమ్మెల్యేలు ఇసుక మాఫియాతో సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. ఇది పెద్ద దుమారం రేగింది.

రఘురామకృష్ణంరాజు మీద పలువురు మంత్రులు, వైసీపీ నేతలు మూకుమ్మడిగా విమర్శల దాడి చేశారు. మూడు పార్టీలు తిరిగిన రఘురామకృష్ణంరాజు జగన్ ఫొటో పెట్టుకుని ఎన్నికల్లో గెలిచారని, ఇప్పుడు అదే ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్న ఆయన దమ్ముంటే రాజీనామా చేయాలని సవాల్ విసిరారు. దీనికి నర్సాపురం ఎంపీ కూడా ఘాటుగానే బదులిచ్చారు. తాను జగన్ ఫొటో పెట్టుకుని గెలవలేదని, తన ఫొటో పెట్టుకునే వైసీపీ ఎమ్మెల్యేలు గెలిచారని, వారంతా రాజీనామా చేసి ఎన్నికలకు సిద్ధమైతే తాను కూడా రెడీ అంటూ ఘాటుగా స్పందించారు.

కొన్ని రోజుల క్రితం వైసీపీ కార్యకర్తలు రఘురామకృష్ణంరాజు దిష్టిబొమ్మలను దహనం చేసి తమ నిరసన తెలిపారు. అనంతరం తనకు ప్రాణహాని ఉందని, కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలంటూ లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాసిన రఘురామకృష్ణంరాజు జగన్ ప్రభుత్వం మీద తీవ్రమైన ఆరోపణ చేశారు. ఈ వ్యవహారం రోజురోజుకూ ముదురుతున్న నేపథ్యంలో వైసీపీ అధిష్టానం రఘురామకృష్ణంరాజుకు షోకాజ్ నోటీస్ జారీ చేసింది.
First published: June 24, 2020, 7:26 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading