వైసీపీపై ఈసీ అస్త్రం... వెనక్కి తగ్గని రఘురామకృష్ణంరాజు?

రఘురామకృష్ణంరాజు(Image: Facebook)

నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణం రాజు ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు.

  • Share this:
    నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణం రాజు ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఆయన కేంద్ర ఎన్నికల కమిషన్, హోంశాఖ అధికారులను కలిసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ మధ్య వైసీపీకి, రఘురామకృష్ణంరాజుకు మధ్య యుద్ధం జరుగుతోంది. మీడియా ముఖంగా సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం మీద ఆయన చేసిన విమర్శలకు ఇటీవల వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి షోకాజ్ నోటీసు జారీ చేశారు. 18 పేజీల షోకాజ్ నోటీసులు రెండు పేజీల ప్రశ్నలు, మరో 16 పేజీల పేపర్ క్లిపింగ్‌లను జతచేశారు.

    ఈ నోటీసుకు స్పందించిన రఘురామకృష్ణంరాజు పలు ఘాటైన వ్యాఖ్యలు చేశారు. అసలు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అని ఎన్నికల కమిషన్ వద్ద రిజిస్టర్ అయిన పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటూ లెటర్ హెడ్ మీద ఎలా షోకాజ్ నోటీసు ఇస్తుందని ప్రశ్నించారు. రాష్ట్ర పార్టీగా గుర్తుంపు పొందిన పార్టీకి జాతీయ ప్రధాన కార్యదర్శి ఎలా ఉంటారంటూ విజయసాయిరెడ్డిని ప్రశ్నించారు. అలాగే, అసలు తనకు షోకాజ్ నోటీసు ఇచ్చేందుకు విజయసాయిరెడ్డి ఎవరని ప్రశ్నించారు. ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం ఏదైనా రాజకీయ పార్టీలో క్రమశిక్షణ కమిటీ ఉండాలని, ఎవరైనా నేతలు పార్టీ విధివిధానాలను అతిక్రమిస్తే ఆ కమిటీ మాత్రమే షోకాజ్ నోటీసు ఇవ్వాలన్నారు. వైసీపీలో అలాంటి కమిటీ ఏదైనా ఉంటే తనకు చెప్పాలని పరోక్షంగా అసలు పార్టీలో అలాంటిదేమీ లేదని స్పష్టంచేశారు. తాను లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెబితే తన షోకాజ్ నోటీసుకు వివరణ ఇస్తానని ఘాటుగా బదులిచ్చారు.

    ఈ క్రమంలో రఘురామకృష్ణంరాజు ఢిల్లీ పర్యటనకు వెళ్లడం రాజకీయవర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ఆయన కేంద్ర ఎన్నికల సంఘాన్ని కూడా కలుస్తారనే వార్త మరింత హాట్ హాట్ చర్చకు దారితీస్తోంది. ఇటీవల తనకు ప్రాణహాని ఉందని, కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలంటూ ఆయన గతంలో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. ఆ లేఖను స్పీకర్ హోంశాఖ వర్గాలకు పంపారు. ఆ లేఖ విషయం మీద స్పీకర్‌ను కూడా కలుస్తారని తెలుస్తోంది.
    First published: