పంజాబ్లో సామాన్యుడు(ఆమ్ ఆద్మీ) విసిరన పంజాకు హస్తం పార్టీ కుదేలైంది. చీపురు పార్టీ దెబ్బతో కాంగ్రెస్ హేమాహేమీలకు షాక్ తగిలింది. పీసీసీ చీఫ్ సిద్దూ కూడా ఓడిపోయాడు. బాధ్యత వహిస్తూ పదవికి రాజీనామా చేయగా..
పంచ నదుల రాష్ట్రం పంజాబ్లో సామాన్యుడు(ఆమ్ ఆద్మీ) విసిరన పంజాకు హస్తం పార్టీ కుదేలైంది. చీపురు పార్టీ దెబ్బతో కాంగ్రెస్ హేమాహేమీలకు షాక్ తగిలింది. సిక్కుల్లో బలమైన మూలాలున్నాయనుకున్న శిరోమణి అకాలీదళ్ సైతం నేలకరిచింది. పెద్దగా ప్రభావం చూపలేకపోయిన బీజేపీ రెండే స్థానాల్లో పోటీ ఇవ్వగలిగింది. ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రక్రియలో తుది అంకంగా గురువారం వెలువడిన ఫలితాల్లో బీజీపీ ప్రభంజన విజయంతో తన రాష్ట్రాలను పదిలపర్చుకోగా, కాంగ్రెస్ కు చావుదెబ్బ తగిలింది. సైలెంట్ కిల్లర్ గా ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్ లో గెలిచి, గోవాలో కింగ్ మేకర్ అయ్యేస్థాయిలో నిలిచింది. పంజాబ్ లో పరాజయం తర్వాత కాంగ్రెస్ లో లుకలుకలు మొదలయ్యాయి..
మొత్తం 117 స్థానాలున్న పంజాబ్ అసెంబ్లీకి ఫిబ్రవరి 20న పోలింగ్ జరగ్గా, ఇవాళ ఫలితాలు వెలువడ్డాయి. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) పంజాబ్ ను కైవసం చేసుకుంది. ఇప్పటిదాకా వెల్లడైన ఫలితాల్లో ఆప్ 94 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. వాటిలో 23సీట్లలో గెలుపు ప్రకటన వెలువడింది. అధికార కాంగ్రెస్ కేవలం 15 సీట్లలో లీడ్ సాధించగా, వాటిలో 7 చోట్ల విజయాలు ఖరారయ్యాయి. శిరోమణి అకాలీదళ్ 5 సీట్లలో లీడ్ లో ఉన్నా, చివరికి ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి. బీజేపీ మాత్రం ఒక చోట గెలుపొంది, మరోచోట లీడ్ లో ఉంది.
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని నిలబెట్టుకోలేకపోయినందుకు బాధ్యత వహిస్తూ ఆ రాష్ట్ర పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్దూ రాజీనామాకు సిద్ధమయ్యారు. లేఖను ఢిల్లీలోని హైకమాండ్ కు పంపగా.. నిరాకరణకు గురైందని తాజా సమాచారం. దీంతో పంజాబ్ లో ఓటమిపై పోస్ట్ మార్టం జరుపుకొనేదాకైనా పదవిలో ఉండాలని సిద్దూకు నేతలు సూచించినట్లు తెలుస్తోంది. కాగా, సీఎం చరణ్ జిత్ సింగ్ చన్నీ పోటీ చేసిన రెండు స్థానాల్లో ఓడిపోయారు. చన్నీని సీఎంగా కొనసాగించడమే కాంగ్రెస్ ఘోర వైఫల్యానికి కారణమని సిద్ధూ వర్గం భావిస్తున్నట్లు సమాచారం. కానీ స్వయంగా సిద్దూకూడా ఎన్నికల్లో ఓడిపోయాడు. అమృత్ సర్ ఈస్ట్ స్థానంలో సిద్ధూ.. ఆప్ అభ్యర్థి జీవన్ జ్యోత్ కౌర్ చేతిలో పరాజం పొందారు.
పంజాబ్లోని ధురీ స్థానం నుంచి ఆప్ ముఖ్యమంత్రి అభ్యర్థి భగవంత్ మాన్ 45,000 ఓట్ల తేడాతో గెలుపొందారు. మాన్ తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి దల్వీర్ సింగ్ గోల్డీపై విజయం సాధించారు. విజయోత్సవ సభలో మాన్ తన తల్లిని పట్టుకుని ఏడ్చేశారు. పంజాబ్ లో ఆప్ ప్రభుత్వం తొలి ప్రాధాన్యంగా నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తుందని మాన్ అన్నారు. "యువత విదేశాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండేలా చేస్తాం.. ఒక నెలలో, మీరు మార్పులను గమనిస్తారు" అని మాన్ తన విజయ ప్రసంగంలో చెప్పారు.
Published by:Madhu Kota
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.