PUNJAB ASSEMBLY ELECTIONS 2022 PUNJAB CM CHANNI BROTHER TURNS REBEL AFTER CONGRESS DENIES TICKET MKS
Punjab Elections 2022: సీఎం చన్నీకి భారీ షాక్.. కాంగ్రెస్ రెబల్‌గా సోదరుడు పోటీ
పంజాబ్ సీఎం చన్నీ సోదరుడు మనోహర్ సింగ్
పంజాబ్ అధికార కాంగ్రెస్ పార్టీలో టికెట్ల పంపిణీ వ్యవహారం రచ్చకు దారితీసింది. ముఖ్యమంత్రి చరణ్ జీత్ సింగ్ చన్నీకి షాకిస్తూ ఆయన సోదరుడు మనోహర్ సింగ్ సైతం కాంగ్రెస్ రెబల్ గా బరిలోకి దిగుతున్నారు.
పంజాబ్ అధికార కాంగ్రెస్ పార్టీలో టికెట్ల పంపిణీ వ్యవహారం రచ్చకు దారితీసింది. ఇప్పటికే మొగ నియోజకవర్గం నుంచి సోనూ సూద్ సోదరి మాల్వికాకు టికెట్ దక్కగా కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే హర్జోత్ కమాల్ బీజేపీలో చేరి అదే స్థానంలో పోటీకి సిద్ధమయ్యారు. తాజాగా ముఖ్యమంత్రి చరణ్ జీత్ సింగ్ చన్నీకి షాకిస్తూ ఆయన సోదరుడు మనోహర్ సింగ్ సైతం కాంగ్రెస్ రెబల్ గా బరిలోకి దిగుతున్నారు. బీజేపీ, అకాలీ దళ్ నుంచి పెద్దగా పోటీ ఉండదని, ఆమ్ ఆద్మీ పార్టీని కాచుకుంటే వరుసగా రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చని ఉవ్విళ్లూరుతోన్న కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు రెబల్స్ గుబులు పట్టుకుంది. సాక్ష్యాత్తూ సీఎం సోదరుడే తిరుగుబాటు అభ్యర్థిగా పోటీ చేస్తుండటం కాంగ్రెస్ కు మింగుడుపడని వ్యవహారంగా మారింది..
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితా ఆ పార్టీ రాష్ట్ర యూనిట్లో అసంతృప్తులకు తావిచ్చింది. ముఖ్యంగా మాన్సా, మొగా, మలౌట్, బస్సి పఠానా నియోజవర్గాల టిక్కెట్లు ఆశించిన నేతలకు నిరాశ ఎదురైంది. ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ సోదరుడు మనోహర్ సింగ్‌కు సైతం కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ లభించలేదు. దీంతో ఆయన కఠిన నిర్ణయం తీసుకున్నారు.
ఖరార్ సివిల్ ఆసుపత్రిలో సీనియర్ మెడికల్ ఆఫీసర్‌గా ఉన్న సీఎం చన్నీ సోదరుడు మనోహర్ సింగ్ తన ఉద్యోగానికి రాజీనామా చేసి, బస్సీ పఠానా నియోజకవర్గం టెక్కెట్ ఆశించారు. అయితే, కాంగ్రెస్ పార్టీ ఆయనకు టిక్కెట్ నిరాకరించడంతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగనున్నట్టు ఆయన ప్రకటించారు. సోదరుణ్ని బుజ్జగించి పోటీనుంచి విరమింపజేసేలా సీఎం చన్నీ చేసిన ప్రయత్నాలు విఫలమైనట్లు తెలుస్తోంది.
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే 86 మంది అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ శనివారం నాడు విడుదల చేసింది. పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ అమృత్సర్ ఈస్ట్ నుంచి పోటీ చేయనుండగా, ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ చంకౌర్ సాహిబ్ నుంచి పోటీకి దిగనున్నారు. డేరా బాబా నానక్ నియోజవర్గం నుంచి ఉప ముఖ్యమంత్రి సుఖ్జిందర్ సింగ్ రంథావా, గిడ్డెర్‌బహ నుంచి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాజా అమరీందర్ పోటీ చేయనున్నట్లు కాంగ్రెస్ పేర్కొంది. సోనూసూద్ సోదరి మాళవిక సూద్‌కు మోగా నియోజకవర్గం టెక్కెట్ కేటాయించిచారు. పంజాబ్ లోని మొత్తం 117 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరి 14న ఒకే దశలో పోలింగ్ జరుగనుంది.
Published by:Madhu Kota
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.