Manmohan Singh blasts pm modi : ఏడున్నరేళ్ళ నుంచి అధికారంలో ఉన్న ప్రభుత్వం తమ తప్పులను అంగీకరించి సరిదిద్దుకోవడానికి బదులుగా.. ప్రజా సమస్యల విషయంలో తొలి ప్రధాన మంత్రి జవహర్లాల్ నెహ్రూను నిందిస్తోందన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం దేశాన్ని విభజిస్తున్నారని మన్మోహన్ ఆవేదన వ్యక్తం చేశారు.
Manmohan Singh : మోదీ సర్కార్ పై మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అన్ని విషయాల్లో మోదీ ప్రభుత్వం విఫలమైందని దుయ్యబట్టారు. విదేశాంగ విధానంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. పొరుగు దేశాలతో మన సంబంధాలు క్షీణిస్తున్నాయన్నారు. ఏడాది కాలంగా చైనా సైన్యం మన దేశ పవిత్ర భూభాగాన్ని ఆక్రమించుకుంటోందని.. కానీ ప్రభుత్వ చర్యలన్నీ ఈ సమస్యను కప్పి ఉంచేందుకే ఉన్నాయన్నారు. ప్రతి సమస్యకు భారత దేశ తొలి పీఎం జవహర్లాల్ నెహ్రూను నిందించడమేమిటని నిలదీశారు. ఓవైపు ప్రజలు ద్రవ్యోల్బణం, నిరుద్యోగం సమస్యలను ఎదుర్కొంటున్నారని, మరోవైపు ఏడున్నరేళ్ళ నుంచి అధికారంలో ఉన్న ప్రభుత్వం తమ తప్పులను అంగీకరించి సరిదిద్దుకోవడానికి బదులుగా.. ప్రజా సమస్యల విషయంలో తొలి ప్రధాన మంత్రి జవహర్లాల్ నెహ్రూను నిందిస్తోందన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం దేశాన్ని విభజిస్తున్నారని మన్మోహన్ ఆవేదన వ్యక్తం చేశారు.
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు మూడు రోజులే ఉన్న నేపథ్యంలో గురువారం మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్.. వీడియో సందేశం ద్వారా ఆ రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. విదేశాంగ విధానం, ధరల పెరుగుదల, నిరుద్యోగం, రైతుల నిరసనలు వంటి అంశాలను ప్రస్తావిస్తూ బీజేపీ వైఫల్యాలను మన్మోహన్ ఎండగట్టారు.
పంజాబీలో ఆయన మాట్లాడిన వీడియోను కాంగ్రెస్ పార్టీ.. ఆ రాష్ట్రంలో నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో ప్రదర్శించింది. వీడియో సందేశంలో బీజేపీని, కేంద్ర ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకొని విమర్శలకు దిగారు మన్మోహన్ సింగ్. ఏడేళ్లకు పైగా అధికారంలో ఉన్న బీజేపీ.. తన తప్పులను అంగీకరించకుండా ప్రజా సమస్యలకు ఇప్పటికీ నెహ్రూను బాధ్యులను చేస్తోందని మండిపడ్డారు. బీజేపీ జాతీయవాదం బ్రిటిష్ విభజనవాదంపై ఏర్పాటైందని విమర్శించారు. బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వానిది బూటకపు జాతీయవాదమని, విభజన విధానమని దుయ్యబట్టారు. ప్రతి సమస్యకు భారత దేశ తొలి పీఎం జవహర్లాల్ నెహ్రూను నిందించడమేమిటని నిలదీశారు. కాంగ్రెస్ ఎన్నడూ రాజకీయ ప్రయోజనాల కోసం దేశాన్ని విభజించలేదన్నారు. సత్యాన్ని మరుగుపరచలేదన్నారు. ప్రధాన మంత్రి పదవికి ప్రత్యేక ప్రాధాన్యం ఉందని తాను భావిస్తున్నానని చెప్పారు. తప్పులకు ప్రాధాన్యాన్ని తగ్గించడానికి చరిత్రను నిందించడం కన్నా ప్రధాని హుందాగా వ్యవహరించాలన్నారు. తాను ప్రధాన మంత్రిగా ఉన్న పదేళ్ళ కాలంలో తాను తన పని ద్వారా మాట్లాడానన్నారు. ప్రపంచం ముందు దేశం పరువు పోయేలా చేయలేదన్నారు. తాను ఎన్నడూ భారత దేశ ఔన్నత్యానికి విఘాతం కలిగించలేదని చెప్పారు. అంతర్జాతీయ స్థాయిలో భారతదేశం, భారతీయుల గౌరవాన్ని పెంచినట్లు చెప్పారు. కాంగ్రెస్-యూపీఏ హయాంలో జరిగిన మంచి పనులను ప్రజలు గుర్తుంచుకోవాలని మన్మోహన్ చెప్పారు.
బలహీనుడు, మౌన ముని, అవినీతిపరుడు అంటూ తనపై తప్పుడు ఆరోపణలు చేసిన తర్వాత ఇప్పుడు బీజేపీ, దాని బీ, సీ జట్ల బండారం దేశం ముందు బయటపడుతోందనే సంతృప్తి తనకు ఉందని తెలిపారు. బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వానికి ఆర్థిక విధానంపై అవగాహన లేదన్నారు. ప్రస్తుత ప్రభుత్వ ఆర్థిక విధానంలో స్వార్థం, దురాశ ఉన్నాయన్నారు. వారి స్వార్థపూరిత ప్రయోజనాల కోసం దేశ ప్రజలను విడగొడుతున్నారని, పోట్లాడుకునేలా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది దేశానికే పరిమితమైన సమస్య కాదన్నారు. విదేశాంగ విధానంలో కూడా ఈ ప్రభుత్వం విఫలమైందని చెప్పారు. ఏడాది కాలంగా చైనా సైన్యం మన దేశ పవిత్ర భూభాగాన్ని ఆక్రమించుకుంటోందని.. కానీ ప్రభుత్వ చర్యలన్నీ ఈ సమస్యను కప్పి ఉంచేందుకే ఉన్నాయి. చైనా దాడులను మరుగుపరచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. నేతలను బలవంతంగా కౌగిలించుకోవడం, ఊయల ఊగడం, బిర్యానీలు తినిపించడం ద్వారా విదేశాంగ విధానాన్ని నిర్వహించడం సాధ్యం కాదని పీఎం మోదీ అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నట్లు తెలిపారు. రాజ్యాంగ వ్యవస్థలు బలహీనపడుతున్నాయి అని మన్మోహన్ మండిపడ్డారు. దేశ రాజ్యాంగంపై ప్రభుత్వానికి విశ్వాసం లేదని, ప్రజాస్వామ్య సంస్థలన్నింటినీ బలహీనం చేస్తోందని మన్మోహన్ అన్నారు.
ఇటీవల ప్రధాని మోదీపంజాబ్ పర్యటనలో తలెత్తిన భద్రతా లోపంపై కూడా మన్మోహన్ మాట్లాడారు. అదంతా పంజాబ్ ప్రభుత్వానికి అపకీర్తి తెచ్చేందుకు చేసిన ప్రయత్నమేనని ఆరోపించారు. అన్నదాతల ఆందోళన సమయంలోనూ పంజాబ్ ను, పంజాబీలను అవమానించే ప్రయత్నాలు జరిగాయన్నారు. పంజాబీల ధైర్యం, దేశభక్తిని ప్రపంచమే మెచ్చుకుంటుందని... మోదీ సర్కారు మాత్రం దీని గురించి మాట్లాడదన్నారు. పంజాబ్ నుంచి వచ్చిన నిజమైన భారతీయుడిగా ఈ విషయాలన్నీ తనను తీవ్రంగా బాధిస్తున్నాయన్నారు. పంజాబ్ ప్రజల ముందు చాలా సమస్యలు ఉన్నాయని... పంజాబ్ అభివృద్ధి, వ్యవసాయం, నిరుద్యోగం వంటి సమస్యలను పరిష్కరించుకోవాలని... ఈ పని కాంగ్రెస్ మాత్రమే చేయగలదని మన్మోహన్ అన్నారు.
Published by:Venkaiah Naidu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.