PRIYANKA GANDHI WILL NOT CONTEST LOK SABHA ELECTIONS ADDRESS RALLIES SAY SOURCES MS
లోక్‌సభ ఎన్నికల బరిలో ప్రియాంక గాంధీ లేనట్టే..?
ప్రియాంక గాంధీ(File)
ఆరోగ్య పరిస్థితుల రీత్యా సోనియాగాంధీ ఈసారి పోటీకి దూరంగా ఉంటారని అంతా అనుకున్నారు. దీంతో ఆమె స్థానంలో రాయ్‌బరేలీ నుంచి ప్రియాంక బరిలో దిగుతుందని చాలామంది భావించారు.
ఈ ఏడాది జనవరిలో ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ప్రియాంక గాంధీ.. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారన్న ఊహాగానాలు చాలానే వినిపించాయి. అయితే పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. ప్రియాంక లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండనున్నారు. పార్టీని బలోపేతం చేసే కార్యక్రమాలు, ర్యాలీల వరకు మాత్రమే ఆమె పరిమితం కానున్నారు.
తూర్పు ఉత్తరప్రదేశ్ జనరల్ సెక్రటరీగా బాధ్యతలు స్వీకరించిన సమయంలో ప్రియాంక గాంధీ భవిష్యత్తులో మరింత కీలకంగా మారుతారని అంతా భావించారు. అయితే ఆ బాధ్యతలు చేపట్టిన తర్వాత లక్నోలో పాల్గొన్న మొదట ర్యాలీలో ప్రియాంక ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం చాలామందిని ఆశ్చర్యపరిచింది. అయితే భవిష్యత్తులోనూ కాంగ్రెస్ ర్యాలీల్లో ప్రియాంక స్పీచులు ఉండకపోవచ్చునని అంటున్నారు. తెర వెనుక వ్యూహాలకు మాత్రమే ప్రియాంక పరిమితమయ్యే అవకాశం ఉందంటున్నారు.
కాగా, ఆరోగ్య పరిస్థితుల రీత్యా సోనియాగాంధీ ఈసారి పోటీకి దూరంగా ఉంటారని అంతా అనుకున్నారు. దీంతో ఆమె స్థానంలో రాయ్‌బరేలీ నుంచి ప్రియాంక బరిలో దిగుతుందని చాలామంది భావించారు. కానీ ఇటీవల 15మంది లోక్‌సభ అభ్యర్థులతో కాంగ్రెస్ విడుదల చేసిన జాబితాలో సోనియా గాంధీ పేరు కూడా ఉండటంతో రాయ్‌బరేలీ నుంచి ప్రియాంక పోటీపై వస్తున్న ఊహాగానాలకు తెరపడింది. అయితే రాయ్‌బరేలీ కాకపోయినా మరో చోటు నుంచి ఆమె పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని ఇప్పటికీ చాలామంది భావిస్తున్నారు. కానీ పార్టీ వర్గాల్లో మాత్రం ఆమె పోటీకి దూరమనే చర్చ జరుగుతోంది. మరికొద్ది రోజుల్లో ప్రియాంక పోటీపై అధికారికంగా స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
Published by:Srinivas Mittapalli
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.