ఓడిన రాహుల్ కంటే ప్రియాంక గాంధీనే ప్రియం -కానీ చెల్లెలంటే అన్నకు భయం -ముందే జారుకుంటోన్న మిత్రులు

రాహుల్, ప్రియాంక గాంధీ

Priyanka Gandhi vadra:ఉత్తరప్రదేశ్ లో ఉనికి కోసం పాకులాడుతోన్న కాంగ్రెస్ పార్టీ.. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీకి ప్రియాంక గాంధీనే ముఖచిత్రంగా ఉంటారని ప్రకటించింది. ప్రియాంక సారధ్యంలోనే అన్ని వ్యవహారాలు సాగుతాయని కాంగ్రెస్ ప్రచార కమిటీ అధ్యక్షుడు స్పస్టం చేశారు. అయితే, ప్రియాంకను సీఎం అభ్యర్థిగా ప్రకటించకపోవడానికి రాహుల్ గాంధీ భయమే కారణమని స్ట్రాటజిస్టు ప్రశాంత్ కిషోర్ అంటున్నారు..

  • Share this:
ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకోడానికి అత్యధిక ఎంపీ సీట్లున్న ఉత్తరప్రదేశ్ ను అన్ని పార్టీలు కీలకంగా భావిస్తాయి. ఆ రాష్ట్రంలో ఇంకొద్ది నెలల్లోనే అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. యూపీలో చాలా ఏళ్లుగా డీలా పడ్డ కాంగ్రెస్ ప్రియాంక గాంధీ రాకతో మళ్లీ పుంజుకుంటామని విశ్వసిస్తోంది. ప్రియాంకను ముందుపెట్టుకునే ఎన్నికల్లో పోరాడుతామని కాంగ్రెస్ బాహాటంగా ప్రకటించింది. కానీ బీజేపీ యోగికి ధీటుగా కాంగ్రెస్ సీఎం అభ్యర్థి ప్రియాంకే అని చెప్పడానికి మాత్రం ఆ పార్టీ సంకోచిస్తున్నది. ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ, ప్రియాంక పట్ల అన్న రాహుల్ గాంధీ అబ్సెషన్ తో ఉన్నారని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ బాంబు పేల్చారు. ప్రియాంకను జాతీయ నేతగా ఫోకస్ చేయాల్సిందిపోయి, యూపీకి పరిమితం చేయడం, అది కూడా సీఎం అభ్యర్థిగా కాకుండా లీడ్ రోల్ మాత్రమేనని కాంగ్రెస్ చెప్పడాన్ని ఆయన తప్పుపట్టారు. మరోవైపు, పొత్తుల విషయంలోనూ కాంగ్రెస్ కు షాకులు మొదలయ్యాయి. ఈ పరిణామాలు ప్రియాంక పొలిటికల్ కెరీర్ పై ఎలాంటి ప్రభావం చూపుతాయోనని చర్చ జరుగుతోంది..

ప్రియాంక సారధ్యంలోనే ఎన్నికల పోరు..
2022 మార్చి నాటికి యూపీ అసెంబ్లీ గడువు ముగియనుండటంతో జనవరి లేదా ఫిబ్రవరి లో ఎన్నికలు జరుగనున్నాయి. ఈసారి కచ్చితంగా ప్రభావం చూపాలనుకుంటోన్న కాంగ్రెస్ పార్టీ మిగతా వాళ్లకంటే ముందుగానే ప్రచార కమిటీని ప్రకటించింది. మొత్తం 20 మంది సభ్యులున్న యూపీ ఎన్నికల ప్రచార కమిటీకి సీనియర్ నేత పీఎల్ పునియా అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. అయితే పునియా మాత్రం తమ ప్రచారానికి ప్రియాకనే సారధిగా ఉంటారని చెబుతున్నారు. ప్రియాంకా గాంధీ ముఖచిత్రంతోనే కాంగ్రెస్ ముందుకు వెళుతుందని ఆయన స్పష్టం చేశారు. అయితే, ప్రియాంకను యూపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించకపోవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. యూపీలో(లోక్ సభ ఎన్నికల్లో) ఓడిపోయిన రాహుల్ గాంధీకంటే నానమ్మ ఇందిరను పొలి ఉండే ప్రియాంక గాంధీ అంటేనే ప్రజలు ఇష్టపడుతున్నారనే వాదన వినిపిస్తోంది.

చెల్లెలంటే అన్నకు భయం..
ప్రియాంకా గాంధీ సారధ్యంలోని యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోరాడుతామంటూ కాంగ్రెస్ చేసిన ప్రకటనపై ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అనూహ్య వ్యాఖ్యలు చేశారు. ప్రియాంక శక్తిసామర్థ్యాలను చూసి ఆమె సోదరుడు రాహుల్‌ గాంధీ భయపడుతున్నారని, 2017 యూపీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున సీఎం అభ్యర్థిగా ఆమెను ప్రకటించకపోవడానికి ఇదే కారణమని, ఇప్పుడు కూడా ప్రియాంకను ముందు నిలిపినా, ముఖ్యమంత్రి అభ్యర్థిగా మాత్రం ఫోకస్ చేయడంలేదని పీకే అన్నారు. నానమ్మ ఇందిరలా బలమైన నాయకత్వ లక్షణాలున్న ప్రియాంకను యూపీకే పరిమితం చేయకుండా జాతీయ నేతగా ముందుకు తేవాలని కాంగ్రెస్ కు పీకే సూచించారు. ఇదిలా ఉంటే,

కాంగ్రెస్ ఒంటరి పోరాటం..
ప్రియాంక గాంధీ నాయకత్వలో యూపీ అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కోనున్న కాంగ్రెస్ కు పొత్తుల విషయంలో అప్పుడే షాకులు మొదలయ్యాయి. భావసారూప్య పార్టీగా, గతంలో కాంగ్రెస్ కు సానుకూలంగా వ్యవహరించిన రాష్ట్రీయ లోక్ దళ్(ఆర్ఎల్డీ) ఇప్పుడు కొత్త మిత్రులను వెతుక్కుంటోంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు అసలే ఉండబోదని ఆర్ఎల్డీ చీఫ్ జయంత్ చౌదరి స్పష్టం చేశారు. అంతేకాదు, అఖిలేశ్ యాదవ్ నాయకత్వలోని సమాజ్ వాదీ పార్టీతో కలిసి పనిచేసే అవకాశాలను పరిశీలిస్తున్నామనీ చౌదరి తెలిపారు. బీఎస్పీ అధినేత్రి మాయావతి.. సోనియాతో సన్నిహితంగా ఉన్నప్పటికీ యూపీలో కాంగ్రెస్ తో పొత్తుకు మాత్రం అంగీకరించే పరిస్థితి లేదు. తద్వారా ప్రియాంక నాయకత్వంలో కాంగ్రెస్ ఈసారి యూపీ ఎన్నికలను ఒంటరిగానే ఎదుర్కొనబోతున్నది. అధికారం సంగతి పక్కనపెడితే గౌరవప్రదమైన స్థాయిలో సీట్లు సాధించినా ప్రియాంక నాయకత్వానికి బలం చేకూరినట్లవుతుందని, ఆ శక్తితో ప్రియాంక 2024 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా దేశవ్యాప్త ప్రచారం నిర్వహించేందుకు వీలవుతుందని విశ్లేషణలు వెలువడుతున్నాయి.
Published by:Madhu Kota
First published: