PRIYANKA GANDHI HUSBAND ROBERT VADRA TO ENTER POLITICS IS IT TRUE PS
రాజకీయాల్లోకి రాబర్ట్ వాద్రా.. ఎంట్రీ ఖాయమేనా?
భర్త రాబర్ట్ వాద్రాతో ప్రియాంకాగాంధీ file
20 ఏళ్ల క్రితం రాబర్ట్ వాద్రాను వివాహం చేసుకుని కుటుంబానికి ఎక్కువశాతం సమయం కేటాయించిన ప్రియాంక గాంధీ.. ఇటీవలె పూర్తిస్థాయి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. కాంగ్రెస్ పార్టీలో కీలక బాధ్యతలు చేపట్టారు. తాజాగా, ఆమె భర్త రాబర్ట్ వాద్రా కూడా రాజకీయాల్లోకి వచ్చేందుకు రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది. ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే త్వరలోనే ఆయన ఎంట్రీ ఖాయంగానే కనిపిస్తోంది.
ప్రియాంక గాంధీ భర్తగా, సోనియా గాంధీ అల్లుడిగా యూపీఏ హయాం నుంచి బాగా ఫేమస్సయ్యారు రాబర్ట్ వాద్రా. ఆయనిప్పుడు ప్రియాంక మాదిరిగానే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారని తెలుస్తోంది. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే వాద్రా.. ఇటీవల తర భార్య ప్రియాంక పొలిటికల్ ఎంట్రీపై సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఆమెకు పూర్తి మద్దతును ప్రకటిస్తూ వరుస ట్వీట్లు చేశారు. ఆమెకు ప్రజాసేవలో అన్నివేళలా సహకరిస్తానని తెలిపారు. అయితే, ఆయన తాజాగా సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్టు మాత్రం.. ఆయన పొలిటికల్ ఎంట్రీ ఖాయమైందనే ప్రచారానికి ఊతమిస్తోంది.
తాజాగా తన ఫేస్బుక్ పేజ్లో రాబర్ట్ వాద్రా పెట్టిన పోస్ట్.. రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఆయన రాజకీయాల్లోకి రాబోతున్నారనే ఊహాగానాలను రేకెత్తిస్తోంది. భార్య ప్రియాంక మాదిరే, క్రియాశీల రాజకీయాల్లోకి రావాలని ఆయన ఆసక్తి చూపుతున్నట్టు తెలుస్తోంది.
సోనియాగాంధీ, ప్రియాంక గాంధీలతో రాబర్ట్ వాద్రా ఫైల్
‘‘ పార్టీకి సంబంధించి దేశంలోని వివిధ ప్రాంతాల్లో... ముఖ్యంగా యూపీలో ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నాను. ఈ నేపథ్యంలో నాపై ప్రజలు చూపిన ఆదరాభిమానాలు నన్ను ఆకట్టుకున్నాయి. అందుకే ప్రజలకు మరింత చేరువగా వెళ్లి సేవ చేయాలనుకుంటున్నా. సాధ్యమైనంత వరకు వ్యవస్థలో మార్పు తేవాలనుకుంటున్నా. నాపై వస్తున్న ఆరోపణలు అబద్ధమని తేలితే రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉండాలనుకుంటున్నా.’’ అని రాబర్ట్ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో సంచలనం రేపుతున్నాయి. ఆయన పొలిటికల్ ఎంట్రీ దాదాపు ఖరారైనందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
రాబర్ట్ వాద్రా, ప్రియాంక గాంధీ(File)
అయితే, రాబర్ట్ వాద్రా మనీ లాండరింగ్, అక్రమాస్తులు తదితర ఆరోపణలతో ఈడీ విచారణ ఎదుర్కొంటున్నారు. మోదీ ప్రభుత్వం కక్షసాధింపు చర్యల్లో భాగంగానే తనపై కేసుల బనాయించిందని ఆయన ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన భార్య ప్రియాంక గాంధీ పూర్తిస్థాయి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడం, తాజాగా ఆయన కూడా రాజకీయాల్లోకి వచ్చేందుకు ఆసక్తి చూపుతుండడం చర్చనీయాంశంగా మారింది.
Published by:Santhosh Kumar Pyata
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.