సోషల్ మీడియా ఇప్పుడు ఎంత పవర్‌ఫుల్లో ప్రత్యేకంగా చెప్పాల్సిన పన్లేదు. ఎందుకంటే అతిరథ మహారథులనుకునే నాయకులు సైతం.. సోషల్ మీడియాకు అత్యంత ప్రాముఖ్యతనిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీల నుంచి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులూ.. పార్టీల అధినేతలూ, ముఖ్యనేతలు.. ఇలా ఒకరేమిటి దేశంలో చోటా బడా నాయకులంతా సోషల్ మీడియాలో క్రియాశీలకంగా ఉంటున్నారు. పార్టీ శ్రేణులకు సూచనలిచ్చేందుకు, ప్రత్యర్థులపై విమర్శలు గుప్పించేందుకు సోషల్ మీడియాను వేదికగా చేసుకుంటున్నారు. అందుకోసం ఆయా విభాగాల్లో ప్రత్యేక సిబ్బందిని సైతం ఏర్పాటు చేసుకుంటున్నారు. ముఖ్యంగా ట్విట్టర్ ద్వారా ట్వీట్లు సంధిస్తూ యాక్టివ్‌గా ఉంటున్నారు. ఇక, తాజాగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. దేశరాజకీయాల్లో సంచలనం సృష్టించిన ప్రియాంక గాంధీ సైతం సోషల్ మీడియాలో అడుగుపెట్టారు. ట్విట్టర్‌లో ఆమె పేరిట కాంగ్రెస్ పార్టీ ఓ అకౌంట్‌ను ఓపెన్ చేసింది. ఇక మీదట సోషల్ మీడియాలో ట్విట్టర్ ద్వారా ఆమె @priyankagandhi అనే ఐడీతో అందుబాటులో ఉంటారని తెలిపింది. ప్రియాంక ట్విట్టర్ అకౌంట్‌లోని సంబంధిత కాలమ్‌లో ‘‘ఇది ప్రియాంక గాంధీ అధికారిక అకౌంట్| ప్రధాన కార్యదర్శి, భారత జాతీయ కాంగ్రెస్’’ అని ఆంగ్లంలో రాసి ఉంటుంది.
పార్టీ బాధ్యతలు చేపట్టాక తొలిసారి ఎన్నికల క్షేత్రంలోకి అడుగుపెట్టిన ప్రియాంక.. అంతకుమందు సోషల్ మీడియాలో క్రియాశీలకంగా వ్యవహరించేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. అందులో భాగంగానే.. ట్విట్టర్‌లో కొత్తగా ఖాతా తెరిచారు. రాజకీయ ఎంట్రీతో ఎంత సంచలనం సృష్టించారో, సోషల్ మీడియాలోనూ అంతే సంచలనం సృష్టించారు ప్రియాంక గాంధీ. ట్విట్టర్ ఖాతా తెరిచిన అతి తక్కువ కాలంలో.. 50,000 మందికిపైగా ఆమెను ఫాలో అవుతున్నారు. ఇక, ఆమె మాత్రం ప్రస్తుతం రాహుల్ గాంధీ, జ్యోతిరాదిత్య సింథియా, అశోక్ గెహ్లోట్, సచిన్ పైలట్, రణ్‌దీప్ సింగ్ సుర్జేవాలా, అహ్మద్ పటేల్‌లను ట్విట్టర్‌లో ఫాలో అవుతున్నారు. అయితే, తన ట్విట్టర్ ఖాతా నుంచి ప్రియాంక గాంధీ ఇప్పటివరకూ ఒక్క ట్వీట్ కూడా చేయలేదు.
గ్యాలరీ: లక్నోలో రాహుల్ గాంధీతో కలిసి ప్రియాంక గాంధీ మెగా రోడ్ షో..
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ashok Gehlet, Congress, Priyanka Gandhi, Rahul Gandhi, Twitter