PRIME MINSTER NARENDRA MODI WILL EXPAND TO CENTRAL CABINET TO DAY OR TOMORROW IS THERE ANY PLACE FOR ANDHRA PRADESH NGS
Central Cabinet: నేడో.. రేపో కేంద్ర మంత్రి మండలి విస్తరణ..! ఏపీ నుంచి బెర్త్ ఎవరికి..?
నేడో రేపో కేబినెట్ విస్తరణ
Central Cabinet: కేంద్ర మంత్రి మండలి విస్తరణ ఎప్పుడు.? ఈ సారి ఎంతమందిని కేబినెట్ లోకి తీసుకునే అవకాశం ఉంది? తెలంగాణకు మరో మంత్రి పదవి వస్తుందా..? ఏపీ నుంచి ఈ సారి ఎవరికైనా ఛాన్స్ ఇస్తారా..? ఇస్తే ఎవరికి అవకాశం ఉంది..?
కేంద్ర మంత్రి మండలి విస్తరణకు ప్రధాని మోదీ రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే పూర్తిస్థాయిలో కసరత్తు చేసినట్టు సమాచారం. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేడో రేపో తన మంత్రిమండలిని విస్తరించనున్నట్టు ఢిల్లీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మోదీ నేతృత్వంలో రెండోసారి కొలువుదీరిన ఎన్డీయే రెండేళ్ల పాలన పూర్తి చేసుకుంది. సాధారణ ఎన్నికలకు మరో మూడేళ్లు గడువు ఉంది. ఈనేపథ్యంలో మరింత మెరుగైన పాలనకు వీలుగా మంత్రివర్గ విస్తరణ చేపట్టాలని ప్రధాని భావిస్తున్నట్టు ఢిల్లీలో బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. శని, ఆదివారాల్లో ప్రధాని మోదీ హోంమంత్రి అమిత్‌షా, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బి.ఎల్.సంతోష్‌లతో చర్చించి విస్తరణ కసరత్తు పూర్తి చేసినట్టు సమాచారం. ప్రస్తుతం ప్రధాని సహా మొత్తంగా 54 మందితో ఉన్న మంత్రి మండలిలో మరో 25 మందిని చేర్చుకోనున్నట్టు బీజేపీ వర్గాల్లో టాక్. ఇప్పటికే స్వతంత్ర హోదా, సహాయ మంత్రి పదవి నిర్వహిస్తున్న మంత్రుల్లో ఒకరిద్దరికి కేబినెట్ ర్యాంకు దక్కే అవకాశం ఉంది. ఇప్పుడున్న వారిలో అదనపు బాధ్యతలు మోస్తున్న సీనియర్ మంత్రుల నుంచి అదనపు శాఖలు తప్పించనున్నట్టు సమాచారం.
రాబోయే ఎన్నికలపై ఫోకస్ చేస్తూ విస్తరణ ఉండే అవకాశం ఉంది. ఉత్తరప్రదేశ్ శాసన సభకు వచ్చే ఏడాది మార్చిలో ఎన్నికలు రానున్నాయి. ఆ రాష్ట్రంలో ఇటీవలి కాలంలో ప్రభుత్వంపై వ్యతిరేకత ఎక్కువవుతోందన్న ఆందోళన బీజేపీలో నెలకొంది. ఈ నేపథ్యంలో ఇక్కడి నుంచి కనీసం ముగ్గురిని, గరిష్టంగా ఐదుగురిని మంత్రిమండలిలో చేర్చుకునే అవకాశాలు ఉన్నాయి. మిత్ర పక్షమైన అప్నాదళ్ నుంచి ఆ పార్టీ చీఫ్ అనుప్రియా పటేల్‌కు, జేడీయూ, లోక్‌జనశక్తి పార్టీలకు చెరో మంత్రి పదవి కేటాయించే అవకాశం ఉంది. మధ్యప్రదేశ్ నుంచి ఇద్దరికి చోటు దక్కనుంది. రాజ్యసభ సభ్యుడు జ్యోతిరాదిత్య సింథియా, ఎంపీ రాకేష్ సింగ్‌లకు అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. తెలంగాణ నుంచి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా జి.కిషన్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
2023లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలున్న నేపథ్యంలో ఇక్కడి నుంచి మరొకరికి ప్రాతినిధ్యం దక్కే అవకాశం ఉందంటున్నారు. ఆదిలాబాద్ ఎంపీ బాపూరావుకు సహాయమంత్రి పదవి దక్కే చాన్సున్నట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. ఏపీ నుంచి బీజేపీకి లోక్‌సభ సభ్యులు ఎవరూ లేరు. రాజ్యసభకు నలుగురు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జీవీఎల్ నరసింహారావు తెలుగువారైనా యూపీ నుంచి పాతినిధ్యం వహిస్తున్నారు. సురేష్ ప్రభు, సీఎం రమేశ్, సుజనా చౌదరి, టీజీ వెంకటేష్ ఉన్నారు. వీరిలో జీవీఎల్ కు మంత్రి పదవి దక్కకపోతే.. టీడీపీ నుంచి బీజేపీలోకి అడుపెట్టిన ఒకరికి కచ్చితంగా మంత్రి పదవి వస్తుందని ప్రచారం జరుగుతోంది. లేదా ఎప్పటిలాగే తెలుగు రాష్ట్రాలకు ప్రధాని మొండి చేయి చూపిస్తారా అన్నది నేడో, రేపో తేలిపోనుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.