విభజనదారన్న టైమ్ మేగజైన్.. కానీ, ప్రతి ఇద్దరిలో ఒకరి ఓటు మోదీకే..

ప్రధాని నరేంద్ర మోదీ (ఫైల్)

Lok Sabha Elections 2019: ప్రస్తుతానికి విడుదలైన ఫలితాల ప్రకారం 48 శాతం ఓట్లు మోదీకే వచ్చాయి. అంటే.. దాదాపు ప్రతి ఇద్దరిలో ఒకరు మోదీకి ఓటు వేశారు. ఆయన్నే ప్రధానిగా కోరుకున్నారు.

 • Share this:
  సార్వత్రిక ఎన్నికలు ముగుస్తున్నాయన్న తరుణంలో ప్రముఖ మేగజైన్ ‘టైమ్’ ఓ సంచలన కథనాన్ని ప్రచురించిన సంగతి తెలిసిందే. ‘ఇండియాస్‌ డివైడర్‌ ఇన్‌ చీఫ్‌’ (భారత ప్రధాన విభజనదారు) అంటూ మోదీ ఫోటోతో పతాక శీర్షికను పెట్టి వివాదానికి తెర తీసింది. ఐరోపా, మధ్య ప్రాచ్యం, ఆఫ్రికా, ఆసియా, దక్షిణ పసిఫిక్‌ ప్రాంతాలకు వెళ్లిన అంతర్జాతీయ సంచికలో మోదీపై ముఖచిత్ర కథనాన్ని ‘టైమ్‌’ ప్రచురించింది. ఆ కథనాన్ని భారత జర్నలిస్టు తవ్లీన్‌ సింగ్‌, పాకిస్థాన్‌ రాజకీయవేత్త సల్మాన్‌ తసీర్‌ల కుమారుడు ఆతిష్‌ తసీర్‌ రాశారు. 2014లో నెలకొన్న విభేదాలను సొమ్ము చేసుకుంటూ ఒక ఆశావహ వాతావరణాన్ని మోదీ ఏర్పరిచారని తసీర్‌ తన ‘భారత ప్రధాన విభజనదారు’ కథనంలో పేర్కొన్నారు. 2019లో మాత్రం ఆయన విభేదాలను అలాగే కొనసాగిస్తూ, నిస్పృహను వీడాలని మాత్రం ప్రజలకు సూచిస్తున్నట్లు తెలిపారు. కానీ, ఈ రోజు వెల్లడైన ఫలితాలు దేశ ప్రజలకు మోదీపై ఉన్న నమ్మకాన్ని మరోసారి రుజువు చేశాయి. ఎంతలా అంటే ప్రస్తుతానికి విడుదలైన ఫలితాల ప్రకారం 48 శాతం ఓట్లు మోదీకే వచ్చాయి. అంటే.. దాదాపు ప్రతి ఇద్దరిలో ఒకరు మోదీకి ఓటు వేశారు. ఆయన్నే ప్రధానిగా కోరుకున్నారు. ఫలితంగా 2014 ఎన్నికల ఫలితాలకు మించి ఎక్కువ సీట్లు ఎన్డీయే వశమయ్యాయి. ప్రస్తుతం 349 సీట్లలో బీజేపీ నేతృత్వంలోని కూటమి విజయం దిశగా దూసుకుపోతోంది. బీజేపీ సొంతంగానే 298 సీట్లు దక్కించుకుంది.

  అదే, కాంగ్రెస్ విషయానికి వస్తే ప్రతిపక్ష హోదా కోసం కూడా పోరాడేలా కేవలం 51 సీట్లు దక్కించుకుంది. అందులోనూ సగం కేరళ, పంజాబ్ నుంచి వచ్చినవే. రాహుల్ వయనాడ్‌లో భారీ మెజారిటీతో గెలిచినా అమేథీలో ఘోరంగా ఓడిపోయారు. ఆ నియోజకవర్గంలో గాంధీ కుటుంబానికి తిరుగులేదు. కానీ, రాహుల్ దాన్ని కాపాడుకోలేకపోయారు.

  ఉత్తరప్రదేశ్‌లో మోదీని దెబ్బ కొట్టాలన్న వ్యూహంతో బద్ధ శత్రువులు ఎస్పీ-బీఎస్పీ కలిసి పోటీ చేశాయి. కానీ మోదీ మేనియా ముందు అవి నిలువలేకపోయాయి. గత ఎన్నికల్లో 71 సీట్లు దక్కించుకున్న బీజేపీ 10 సీట్లను మాత్రమే కోల్పోయింది. పశ్చిమ బెంగాల్‌లో 19 చోట్ల బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. మోదీకి వ్యతిరేకంగా బీజేపీయేతర కూటమిని ఏర్పాటు చేయాలన్న ఆశతో దేశవ్యాప్తంగా చక్కర్లు కొట్టిన చంద్రబాబు నాయుడు ఏపీలో ఘోర పరాజయం చవిచూశారు.

  కులం పేరుతో ఓట్లను చీల్చాలని చూసినా యూపీ, బిహార్, జార్ఖండ్‌లో 134 సీట్లకు గానూ 117 సీట్లను దక్కించుకునేందుకు బీజేపీ సిద్ధంగా ఉంది. మహాకూటమికి నిరాశే మిగిలింది. బిహార్‌లో బీజేపీ-జేడీయూ కూటమి 39 సీట్లను కైవసం చేసుకోబోతోంది. ఇక, భోపాల్ నుంచి సాధ్వి ప్రగ్యా, యువ నేత తేజస్వి సూర్య, క్రికెటర్ గౌతమ్ గంభీర్, సుఫీ గాయకుడు హన్స్ రాజ్, భోజ్‌పూరి నటుడు రవికిషన్‌కు టికెట్ ఇచ్చింది. వీరంతా కొత్తవారే. వారిలో దాదాపు మంది గెలుపు దిశగా పయనిస్తున్నారు.
  First published: